ఇది మారణహోమమే..!

ABN , First Publish Date - 2021-05-06T07:26:25+05:30 IST

ఆక్సిజన్‌ దొరక్క కొవిడ్‌ రోగులు మరణించడంపై అలహాబాద్‌ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రాణ వాయువు అందక రోగులు మృతి చెందడం అంటే ‘నేరపూరిత చర్య, మారణహోమం’ ...

ఇది మారణహోమమే..!

  • ఆక్సిజన్‌ అందక చనిపోవడమంటే నేరపూరిత చర్యే
  • అలహాబాద్‌ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

అలహాబాద్‌, మే 5: ఆక్సిజన్‌ దొరక్క కొవిడ్‌ రోగులు మరణించడంపై అలహాబాద్‌ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రాణ వాయువు అందక రోగులు మృతి చెందడం అంటే ‘నేరపూరిత చర్య, మారణహోమం’ అని పేర్కొంది. ‘‘ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా లేక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను చూస్తున్నాం. ఇది అత్యంత బాధాకరం. ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకొని, నిరంతరం సరఫరాను పర్యవేక్షించే బాధ్యత కలిగిన అధికారుల వైఖరి మారణహోమం కంటే తక్కువేమీ కాదు’’ అని జస్టిస్‌ అజిత్‌కుమార్‌, జస్టిస్‌ సిద్ధార్థ వర్మల ధర్మాసనం వ్యాఖ్యానించింది. లఖ్‌నవూ, మేరఠ్‌ జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందక రోగులు మరణించారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ అంశంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ లేక రోగులు మరణించడమా? శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెంది.. గుండె మార్పిడి, మెదడు శస్త్రచికిత్సలు జరుగుతున్న ఈ కాలంలోనూ ఇలా మరణించడం ఎంత వరకు సబబు? యూపీలో అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు కూడా వీటిని ధ్రువీకరిస్తున్నారు. ఈ అంశంపై వెంటనే దర్యాప్తు జరపాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. మేరఠ్‌, లఖ్‌నవూల్లో సంభవించిన మరణాలపై విచారణ జరిపి 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

Updated Date - 2021-05-06T07:26:25+05:30 IST