స్వర్గంలో తోడు

ABN , First Publish Date - 2021-12-24T05:30:00+05:30 IST

ప్రసిద్ధమైన ప్రవక్తలలో హజ్రత్‌ మూసా ఒకరు. ఆయన అల్లా్‌హతో మాట్లాడేవారు. అందుకే ఆయనకు ‘ఖలీల్లుహా’ అనే బిరుదు కూడా ఉంది. ...

స్వర్గంలో తోడు

ప్రసిద్ధమైన ప్రవక్తలలో హజ్రత్‌ మూసా ఒకరు. ఆయన అల్లా్‌హతో మాట్లాడేవారు. అందుకే ఆయనకు ‘ఖలీల్లుహా’ అనే బిరుదు కూడా ఉంది. 

ఒక రోజు ఆయన అల్లాహ్‌తో సంభాషిస్తున్నప్పుడు... ‘‘ఓ అల్లాహ్‌! స్వర్గంలో నాకు తోడు ఎవరుంటారు?’’ అని ప్రశ్నించారు.


‘‘నీకు తోడుగా ఒక ఖసాబ్‌ (మాంస విక్రేత) తోడుగా ఉంటారు’’ అని అల్లాహ్‌ చెప్పారు. దాంతో ఆ మాంస విక్రేత కోసం మూసా అన్వేషణ మొదలుపెట్టారు. చివరకు అతడు దొరికాడు. సాయంత్రం వరకూ అతని మాంసం దుకాణంలోనే ఆయన కూర్చున్నారు. పని ముగించి, కొన్ని మాంసం ముక్కలను సంచిలో ఉంచుకొని ఆ విక్రేత బయలు దేరడానికి సిద్ధమయ్యాడు. అప్ప్పడు అతనితో మూసా మాట్లాడుతూ ‘‘నేను ఒక బాటసారిని. ఈ రోజు మీ ఇంట్లో అతిథిగా ఉండాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే వస్తాను. లేదంటే వెళ్ళిపోతాను’’ అన్నారు. 


‘‘మీరు మా అతిథి’’ అన్నాడు ఆ మాంస విక్రేత. 

అతను దుకాణం మూసేసిన తరువాత, ఇద్దరూ బయలుదేరారు. ఆ విక్రేత ఇంటికి చేరగానే కాళ్ళు, చేతులు కడుక్కున్నారు

ఒక గదిలో పడుకుని ఉన్న, వృద్ధురాలైన తన తల్లి దగ్గరకు ఆ విక్రేత వెళ్ళి, ఆప్యాయంగా పలకరించాడు. ఆ తరువాత, తనతో తెచ్చిన మాంసంతో కూర వండాడు. రొట్టెలు తయారు చేశాడు. తల్లిని కూర్చోబెట్టి తినిపించాడు. ఆమె ముఖాన్ని శుభ్రం చేసి, మంచి నీరు తాగించాడు. 

ఆమె తన కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని, రెండు చేతులూ పైకి ఎత్తి, అల్లా్‌హను ప్రార్థించింది. కుమారుణ్ణి ఉద్దేశించి ‘‘స్వర్గంలో నీకు తోడుగా మూసా అలైహిసలామ్‌ ఉండుగాక!’’ అని అంది.

దూరంగా ఉన్న మూసాకు ఆమె మాటలు వినిపించలేదు. ఆ తరువాత ఆ మాంస విక్రేత, మూసా కలిసి భోజనం చేశారు. ఆ తరువాత... అతనితో తల్లి ఏం మాట్లాడిందో చెప్పాలని మూసా అడిగారు.

‘‘ఆమె ‘‘స్వర్గంలో నీకు తోడుగా మూసా ఉండుగాక!’’ అని ప్రతిరోజూ అల్లా్‌హను ప్రార్థిస్తున్నానని చెప్పింది. నేనెక్కడ? మూసా ప్రవక్త ఎక్కడ?’’ అన్నాడు ఆ మాంస విక్రేత.

అతని మాటల మధ్యలోనే మూసా కల్పించుకొంటూ ‘‘మీ తల్లి చేసే ప్రార్థనను దేవుడు ఇప్పటికే స్వీకరించాడు’’ అని చెప్పారు. అనంతరం అల్లా్‌హకు శతకోటి కృతజ్ఞతలు తెలుపుకొంటూ, ఆ ఇంటి నుంచి బయలుదేరారు. తల్లితండ్రులకు సేవ చేయడం గొప్ప అదృష్టం, దైవ ప్రీతికరం.





విధేయతా చిహ్నం

‘హజబ’ అనే అరబీ పదం నుంచి ‘హిజాబ్‌’ అనే పదం వచ్చింది. ‘హిజాబ్‌’ అంటే ‘దాచిపెట్టడం’ లేదా ‘కప్పిపుచ్చడం’ అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో... యుక్తవయసుకు చేరుకున్న తరువాత నుంచి ముస్లిం మహిళలకు నిర్దేశితమైన వస్త్రధారణ నియమాన్ని ‘హిజాబ్‌’ అంటారు. అంటే పూర్తిగా దేహాన్ని... ముఖం, చేతులు తప్ప మిగిలిన శరీరాన్ని కప్పి ఉంచడం. కొందరు ముఖాన్ని, చేతులను కూడా కప్పుకొంటారు. దీన్ని ‘బురఖా’ లేదా ‘నికాబ్‌’ అంటారు. నియమాల ప్రకారం... ఒక చోట అందరూ మహిళలే ఉన్నప్పుడు, సమీప బంధువులైన పురుషులు మాత్రమే ఉన్నప్పుడు హిజాబ్‌ అవసరం లేదు. నిజానికి హిజాబ్‌ అనేది బాహ్య వస్త్రధారణకు సంబంధించినది మాత్రమే కాదు... బిడియం, మాట్లాడే పద్ధతి, హుందాతనాలకు సంబంధించినది. మిగిలిన ప్రయోజనాల సంగతి పక్కనపెడితే... ముఖ్యంగా దైవాదేశాలను అనుసరించడానికి హిజాబ్‌ పాటిస్తారు. ఇది దైవ విధేయతకు చిహ్నం. ధార్మిక విశ్వాసాలను హిజాబ్‌ ప్రతిఫలిస్తుంది.

                                                                                     మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-12-24T05:30:00+05:30 IST