Mary Roy, champion of women’s rights: అతివల ఆస్తి హక్కు కోసం అలుపెరగని పోరాటం..మేరీ రాయ్..

ABN , First Publish Date - 2022-09-03T16:51:45+05:30 IST

మహిళంటే చులకన భావన, వివక్షత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 62 మిలియన్ బాలికలకు సరైన విద్యా సౌకర్యం లేదు.

Mary Roy, champion of women’s rights: అతివల ఆస్తి హక్కు కోసం అలుపెరగని పోరాటం..మేరీ రాయ్..

ప్రపంచంలో ఎక్కడో ఒకచోట మహిళ అణిచివేతకు, బానిసత్వానికి, దోపిడికి గురవుతూనే ఉంది. వారి తరపున నిలబడి పోరాడే శక్తులు ఏవి? మహిళంటే చులకన భావన, వివక్షత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 62 మిలియన్ బాలికలకు సరైన విద్యా సౌకర్యం లేదు. మన దేశంలో నేటికీ మహిళా అక్షరాస్యత 55% కంటే తక్కువ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 29 కోట్ల మహిళలు, బాలికలు బానిసత్వం, వెట్టిచాకిరీలో మగ్గుతున్నారు. వీరి గోడు వినేదెవరూ? 


మహిళలకు అండగా నిలిచే శక్తులు కొన్నే ఉంటాయి. బాధితుల గొంతును తమదిగా చేసుకుని వినిపించే వారే మహిళా హక్కుల కార్యకర్తలు. ఈ గొంతులు బాధింప బడిన వ్యక్తుల తరపున నిలుస్తాయి. ఈ గొంతుకలే బాధను పోగొట్టే ఆపన్న హస్తాలవుతాయి. అలాంటి ఒక ఆపన్న హస్తం మేరీ రాయ్..


ఆమె మహిళల హక్కుల గురించి పోరాడింది. వారిని తన బిడ్డలుగా సాకింది. క్రైస్తవ సమాజానికి చెందిన ఎందరో మహిళలకు సమాన వారసత్వ హక్కుల కోసం నాలుగు దశాబ్దాలుగా ఆమె పోరాటం చేశారు. కేవలం మహిళా హక్కుల కార్యకర్తగా మాత్రమే కాకుండా విద్యావేత్తగా, లింగ సమానత్వం కోసం పోరాడింది. బుకర్ ఫ్రైజ్ గెలుచుకున్న ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ తల్లి మేరీ రాయ్. 


మేరీ రాయ్ సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ కీటక శాస్త్రవేత్త పి.వి. ఐజాక్. మేరీ విద్యాభ్యాసం పాఠశాల చదువు ఢిల్లీలో తరవాత చెన్నైలోని క్వీన్ మేరీ కాలేజ్ లో చదువు పూర్తి చేసుకుని కొల్ కత్తాలో ఉద్యోగంలో చేరింది. అక్కడే రాజాజీ రాయ్ ని వివాహం చేసుకుంది. వైవాహిక జీవితంలో సమస్యల కారణంగా ఊటీలోని తండ్రి వద్దకు తిరిగి చేరుకుంది. తండ్రి మరణం తరువాత అన్న జార్జ్ ఐజాక్ తో వచ్చిన ఆస్తి తగాదాలతో కోర్టు వరకూ వెళ్ళింది. 


ఫిబ్రవరి 24, 1986న మేరీ తన తండ్రి ఆస్తిపై వారసత్వ హక్కు కోసం సుదీర్ఘ న్యాయ పోరాటంలో గెలిచింది. ట్రావెన్ కోర్ సిరయన్ క్రిస్టియన్ వారసత్వ చట్టం, 1916, కొచ్చిన్ వారసత్య చట్టం, 1921 ప్రకారం తండ్రి తన వీలునామాలో కుతురికి వాటాను ఇవ్వకపోతే ఆస్తిలో వాటాను తీసుకునే హక్కు స్త్రీకి లేదు. ఆస్తిలో కొడుకు వాటా విలువలో నాలుగింట ఒక వంతు అంటే రూ. 5,000, మాత్రమే పొందవచ్చు. తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిన వితంతువు ఆమె చనిపోయే వరకు లేదా తిరిగి ఇంకో వివాహం చేసుకునే వరకు పూర్వీకుల ఆస్తిని అనుభవించే హక్కు మాత్రమే ఉంది. అయితే  మేరీ తండ్రి వీలునామాలో ఏ విషయమూ రాయకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది.


"నా పోరాటం ఆస్తి కోసం కాదు, రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన హక్కులను ఈ దేశంలోని మహిళలు పొందేలా చూడటం కోసం" అని వారసత్వ కేసు గెలిచిన తర్వాత మేరీ రాయ్ అన్నారు. 


మేరీ రాయ్ కొట్టాయంలో కార్పస్ క్రిస్టి స్కూల్ ను స్థాపించింది. కొంత కాలానికి దీనిని పల్లికూడం స్కూల్ గా మార్చారు. 2011 వరకు ఈ స్కూల్ కు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించారు.  పాఠశాలలో 1990లో ప్రదర్శించిన 'జీసస్ క్రైస్ట్ సూపర్‌స్టార్' నాటకం అప్పట్లో వివాదాస్పదమై, నిషేధించబడింది. దానికోసం మేరీ రాయ్ చేసిన న్యాయ పోరాటంలో చివరకు 2015 డిసెంబరులో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తరవాత పాఠశాల ఆడిటోరియంలో అదే నాటకాన్ని తిరిగి ప్రదర్శించారు.


ఆమెకు కుమార్తె అరుంధతీ రాయ్, కుమారుడు లలిత్ రాయ్ ఉన్నారు. తన జీవితంలోని అనుభవాలతో చలించిన మేరీ రాయ్ స్త్రీల హక్కుల కోసం పోరాడింది. ఎందరికో న్యాయం జరిగేలా చేయూతను ఇచ్చింది. 

Updated Date - 2022-09-03T16:51:45+05:30 IST