వేద పాఠశాలలన్నీ టీటీడీ గొడుగులోకి

ABN , First Publish Date - 2021-01-27T05:27:33+05:30 IST

‘రాష్ట్రంలోని దేవదాయ, ప్రైవేటు ఆధ్యాత్మిక సంస్థలు, టీటీడీ నిర్వహిస్తున్న అన్ని వేద పాఠశాలలను ఎస్వీ వేద విశ్వవిద్యాలయం గొడుగు కిందకు తెస్తాం. కామన్‌ సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తాం. సంహిత, మూలం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తాం’ అని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.

వేద పాఠశాలలన్నీ టీటీడీ గొడుగులోకి
గౌరవ వందనం స్వీకరిస్తున్న టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి

గణతంత్రదిన వేడుకల్లో ఈవో జవహర్‌రెడ్డి 

తిరుపతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని దేవదాయ, ప్రైవేటు ఆధ్యాత్మిక సంస్థలు, టీటీడీ నిర్వహిస్తున్న అన్ని వేద పాఠశాలలను ఎస్వీ వేద విశ్వవిద్యాలయం గొడుగు కిందకు తెస్తాం. కామన్‌ సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తాం. సంహిత, మూలం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తాం’ అని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక ఉన్న మైదానంలో మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. రానున్న రోజుల్లో టీటీడీ చెపట్టనున్న కార్యక్రమాలు, ఇప్పటికే నిర్వహించిన కార్యక్రమాలను వివరిస్తూ దేశంలో ఏ ఆలయానికి వెళ్లినా గోవును పూజించే ఏర్పాటు చేయటానికి టీటీడీ సిద్ధంగా ఉందన్నారు. దేశంలోని ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు ముందుకు వస్తే గోవును ఇవ్వటానికి టీటీడీ సిద్ధంగా ఉందన్నారు. తిరుమల మ్యూజియంలో శ్రీవారి ఆభరణాల నమూనాలను భక్తులు చూసేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరకామణిని భక్తులు వీక్షించేలా రూ.8.9 కోట్లతో అద్దాలను అమరుస్తున్నట్టు తెలిపారు. తిరుమల పర్యావరణ పరిరక్షణకు 100 నుంచి 150 ఎలక్ర్టికల్‌ బస్సులను అందించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. టీటీడీ నిర్వహిస్తున్న బధిర పాఠశాలలకు, జూనియర్‌ కళాశాల విద్యార్థులకు, ప్రత్యేక ప్రతిభావంతులకు రూ.44.5 కోట్లతో జూ పార్క్‌ సమీపంలో హాస్టల్‌ భవనాలను నిర్మించనున్నట్టు వెల్లడించారు. 


టీటీడీ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

టీటీడీలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వివిధ విభాగాలకు చెందిన 38 మంది అధికారులకు, 243 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందిజేశారు. సాంస్కృతి కార్యక్రమాలు, అశ్వ ప్రదర్శనలు అలరించాయి.  ఆయా కార్యక్రమాల్లో అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్‌కుమార్‌, సదా భార్గవి, సీవీఎస్వో గోపినాథ్‌ జెట్టి, సీఈ రమేష్‌రెడ్డి, ఎఫ్‌ఏ సీఏవో బాలాజీ, డీఎల్‌వో రెడ్డెప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


టీటీడీ ఈవో బంగ్లాలో అట్‌ హోం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి బంగ్లాలో అట్‌ హోం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డితో పాటు అధికార ప్రముఖులకు ఈవో ఆతిథ్యం ఇచ్చారు. తొలుత జాతీయ గీతాలాపనతో మొదలైన కార్యక్రమంలో అతిథుల వద్దకు ఈవోనే వెళ్లి పలకరించారు.  

Updated Date - 2021-01-27T05:27:33+05:30 IST