ఈ నెలాఖరుకల్లా ఖాళీలన్నీ భర్తీ

ABN , First Publish Date - 2022-02-04T09:05:18+05:30 IST

గిరిజన ప్రాంతాలు, ప్రభుత్వాస్పత్రులు సహా వైద్య శాఖలోని అన్ని ఖాళీలను ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ పునరుద్ఘాటించారు. గురువారమిక్కడ తాడేపల్లిల్లోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖపై ఆయస సమీక్ష నిర్వహించారు.

ఈ నెలాఖరుకల్లా ఖాళీలన్నీ భర్తీ

  • ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి
  • లేరనే మాటే వినిపించొద్దు.. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం
  • డాక్టర్లు అక్కడే ఉండి సేవలందిస్తామంటే ఎంత ప్రోత్సాహకమైనా ఇస్తాం: సీఎం జగన్‌ 


అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాలు, ప్రభుత్వాస్పత్రులు సహా వైద్య శాఖలోని అన్ని ఖాళీలను ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ పునరుద్ఘాటించారు. గురువారమిక్కడ తాడేపల్లిల్లోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖపై ఆయస సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద చేపట్టిన పనులను సమీక్షించారు. వైఎ్‌సఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రగతిపై ఆరా తీశారు. నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సృష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్నారు. డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో మార్పులు సృష్టంగా కనిపించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడపై దృష్టి పెట్టాలన్నారు. ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. డాక్టర్లు గిరిజన ప్రాంతాల్లో ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తామని వెల్లడించారు. వారికి ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్న దానిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే.. తప్పనిసరిగా ఆమోదిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే కాదు.. ఈ నెల చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖలో ఖాళీలను పూర్తిగా భర్తీ చేయాలని స్పష్టం చేశారు.


కొవిడ్‌ తీవ్రత తగ్గుతోంది!

రాష్ట్రంలో కోవిడ్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోందని ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 1,00,622 ఉన్నాయని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 2,301 మాత్రమేనని, ఐసీయూలో 263 మంది ఉన్నారని, వీరంతా దాదాపు కోలుకుంటున్నారని, 2,144 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. 104 కాల్‌ సెంటర్‌కూ వస్తున్న కాల్స్‌ గణనీయంగా తగ్గాయన్నారు. వేక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. 12.60 లక్షల మంది ప్రికాషనరీ డోస్‌ వేయాల్సి ఉండగా.. 9,79,723 మందికి పూర్తయిందని చెప్పారు. రాష్ట్రంలో 15-18 ఏళ్ల మధ్య అందరికీ మొదటి డోసు పూర్తయిందని తెలిపారు.

Updated Date - 2022-02-04T09:05:18+05:30 IST