ఢిల్లీలో దీపావళి బాణసంచాపై నిషేధం

ABN , First Publish Date - 2021-09-15T19:06:59+05:30 IST

దీపావళి సంబరాల్లో బాణసంచా ఉపయోగించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి

ఢిల్లీలో దీపావళి బాణసంచాపై నిషేధం

న్యూఢిల్లీ : దీపావళి సంబరాల్లో బాణసంచా ఉపయోగించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. అన్ని రకాల బాణసంచా నిల్వ, అమ్మకాలు, వాడకంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. దీపావళినాడు గాలి కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థితిలో ఉంటోందని చెప్పారు. ఈ వివరాలను ఆయన బుధవారం ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 


ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గత ఏడాది కూడా దీపావళి బాణసంచాపై సంపూర్ణ నిషేధం విధించింది. ప్రమాదకర గాలి కాలుష్యానికి, కోవిడ్-19 వ్యాప్తికి సంబంధం ఉందని తెలిపింది. 


కేజ్రీవాల్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘గత మూడేళ్ళలో దీపావళి సందర్భంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయి దృష్ట్యా, గత ఏడాది మాదిరిగానే, అన్ని రకాల బాణసంచా నిల్వ, అమ్మకాలు, వాడకంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఈ చర్యలు తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు. 


గత ఏడాది బాణసంచాపై నిషేధం విధించడం ఆలస్యమైనందువల్ల కొందరు వ్యాపారులకు నష్టం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా సంపూర్ణ నిషేధం విధించినందువల్ల బాణసంచాను నిల్వ చేయవద్దని, అమ్మవద్దని కోరారు. 


Updated Date - 2021-09-15T19:06:59+05:30 IST