అయ్యో..రా..!

ABN , First Publish Date - 2021-04-15T05:03:09+05:30 IST

కరోనా ప్రభావంతో గత ఏడాది నుంచి విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పరీక్షలు లేకపోవడం, అకడమిక్‌ క్యాలెండరులో మార్పులు చేర్పులువంటివి చోటు చేసుకున్నాయి.

అయ్యో..రా..!

బోధన సమయమంతా యాప్‌లతోనే సరి..!

వత్తిడితో తలపట్టుకుంటున్న ఉపాధ్యాయులు

కుంటుపడుతున్న విద్యాబోధన

కడప(ఎడ్యుకేషన), ఏప్రిల్‌ 14: కరోనా ప్రభావంతో గత ఏడాది నుంచి విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పరీక్షలు లేకపోవడం, అకడమిక్‌ క్యాలెండరులో మార్పులు చేర్పులువంటివి చోటు చేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే క్రమంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం సమాచార సేకరణ పేరిట వివిధ యాప్‌లను ప్రవే శపెట్టింది. అయ్యోరులు (ఉపాధ్యాయులు) పాఠశాలల్లో అడుగుపెట్టిన దగ్గరనుంచి అసలు విధి అయిన బోధనను వదిలేసి యాప్‌లల్లో సమాచారం అప్‌లోడ్‌ చేయడానికే సమయమంతా సరిపోతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక యాప్‌లో సమాచారం అప్‌లోడ్‌ చేస్తూనే ఉంటున్నారు. అప్‌డేట్‌ చేయకపోయినా, వివిధ కారణాల వల్ల సర్వర్‌ మొరాయించినా దానికి రఽపధానోపాధ్యాయుడే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయులు, సంఘాలు ఆందోళనలు చేసినప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.


రోజూ ఇవి తప్పనిసరి..

- ఉదయం పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు వచ్చిన తరువాత ముందుగా ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని ఆనలైనలో వేయించాలి. సర్వర్‌ బిజీ, నెట్‌వర్క్‌ సరిగా లేకపోవడంవంటి కారణాలతో ఈ ప్రక్రియ గంటసేపు సాగుతుంది.

- ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఎంఈవో కార్యాలయం ఏర్పాటు చేసిన గ్రూపు ద్వారా తెలియజేయాలి.

- విద్యార్థుల హాజరును రిజిస్టరులో నమోదు చేసుకుని ఆ వివరాలను ఆనలైనలో పొందుపరచాలి.

- మధ్యాహ్న భోజనంలో జగనన్న గోరుముద్ద పథకం వివరాలను ప్రతిరోజూ ఐఎంఎంఎ్‌సఎఫ్‌ యాప్‌లోని కాలమ్స్‌ ప్రకారం నమోదు చేయాలి. భోజనం చేసే స్థలం బాగుందా? విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారు, ఎన్ని గుడ్లు పెట్టారు.. ఇలా పూర్తి వివరాలను యాప్‌లో పొందుపరిచి ఫొటో అప్‌లోడ్‌ చేయాలి.

- రోజూ శానిటేషన ఫొటోలతో సహా వివరాలు ఆనలైన్లో పొందుపరచాలి.

- పాఠశాల ముగిసిన తరువాత సాయంత్రం ఇన - అవుట్‌ ఉపాధ్యాయుల వివరాలను పొందుపరచాలి.

- ఇవి కాక అమ్మఒడి పథకం అందని విద్యార్థుల వివరాలు అప్‌డేట్‌ చేయాలి. జగనన్న విద్యాకానుక అందని వారి వివరాలు పొందుపరచడం, ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చెప్పడం, ముందుగా ఇచ్చిన జగనన్న విద్యాదీవెన కిట్లకు తల్లి వేలిముద్రలు వేయించుకోవడం, నాడు-నేడు పథకం పనుల పర్యవేక్షణ వంటివి నిత్యకృత్యాలు.


తప్పని అవస్థలు

యాప్‌లో సమాచారం నమోదులో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో వందలాది పాఠశాలలు ఏకోపాధ్యాయ విద్యాలయాలుగా మారాయి. అక్కడ బోధన సమయమంతా ఫొటోలు, సమాచారం అప్‌లోడ్‌ చేయడానికే టైం సరిపోతోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కనీసం ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులను ఈ పనులకు కేటాయిస్తున్నారు. బోధిస్తున్న సమయాన్ని బోధనేతర కార్యక్రమాలకు కేటాయించడంతో సిలబస్‌ పూర్తిచేయలేని పరిస్థితి. దీనివల్ల ఉపాధ్యాయులు మానసిక వత్తిడికి గురవుతున్నారు. ఈ ప్రభావం విద్యార్థులపై కూడా పడుతోంది.


ఇవీ యాప్‌లు..

విద్యార్థుల హాజరు, జగనన్న విద్యాదీవెన, అమ్మఒడి రేషన పంపిణీ, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు-నేడు, బడికి పోదాం, జగనన్న విద్యాకానుక, దీక్ష, స్కూలు ఇన్ఫర్మేషన, మేనేజ్‌మెంటు సిస్టం, ఉపాధ్యాయుల సెలవులు, హాజరు, ఇనస్పైర్‌మనక్‌, చైల్డ్‌ ఇన్ఫో వంటి యాప్‌లున్నాయి. వీటితో పాటు మరుగుదొడ్ల పరిశీలనకు ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన లాగినతో గూగుల్‌లింకుతో ఆనలైన్లో వివరాలు నమోదు చేయాలి. తాజాగా వంట ప్రదేశం, పాత్రలు, స్టోరు రూం, వండిన గుడ్లు, టీఎ్‌సఎం పేరుతో విద్యార్థులు వినియోగించే బాతరూముల ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేయాలంటూ మరో కొత్త యాప్‌ ప్రవేశపెట్టారు.


పాఠాలు ఎప్పుడు బోధించాలో..!

ఈ యాప్‌లను ప్రధానోపాధ్యాయుడు ఒక్కడే చూసుకోలేక ఒక్కోపనికి ఒక్కో ఉపాధ్యాయుడికి అప్పగిస్తున్నారు. దీంతో ఆ ఉపాధ్యాయులు గంటల సమయం ఆనలైనలో వివరాలు పొందుపరచడానికే సరిపోతుండడంతో విద్యా బోధనపై దృష్టి సారించడంలేదు. కొందరు ఉపాధ్యాయులు పాఠాలు బోధించాల్సిన పనిలేదని, ప్రశాంతంగా ఆనలైనలో ఉండవచ్చని ఆనందిస్తుంటే... అధికులు మాత్రం విద్యాబోధన సక్రమంగా చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు. ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంటోంది. ఉదయం బడి తెరిచినప్పటి నుంచి సాయంత్రం మూసేవరకు రోజూ గంటల తరబడి సెల్‌ చేతబట్టి ఆనలైనలో నమోదుతోనే సరిపోతోంది. ఇక పాఠాలు బోధించే వారు ఎవరో మరి.


యాప్‌ల వినియోగం సులభతరం చేయాలి  

- కె.సురే్‌షబాబు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు 

ఇటీవల పాఠశాలల్లో యాప్‌ల వినియోగం ఎక్కువైంది. దీనివల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడడమే కాక తీవ్ర మానసిక వత్తిళ్లకు లోనవుతున్నారు. బోధనా సమయం వృధా అవుతోంది. ఈ వత్తిడి వల్ల ఇటీవల పలువురు ఉపాధ్యాయులు బీపీ, షుగరు తదితర రోగాల బారిన పడుతున్నారు. సాంకేతిక వినియోగం మంచిదే అయినా దానికి తగిన మౌలిక సదుపాయాల కల్పన చేసి అవసరమైన శిక్షణ ఇచ్చి అమలుకు తగినంత సమయం ఇవ్వాలి. యాప్‌ల వినియోగం సులభతరం చేయాలి

 

నిబంధనలు పాటించాల్సిందే

- డీఈవో శైలజ 

ప్రభుత్వం పెట్టిన ప్రతి నిబంధన పాటించాల్సిందే. అయితే సర్వరు మొరాయించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు రాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం.

Updated Date - 2021-04-15T05:03:09+05:30 IST