మళ్లీ ఎప్పుడొస్తారు?

ABN , First Publish Date - 2020-05-22T09:28:15+05:30 IST

వలస కార్మికులంతా వెళ్లిపోయారు.. ఇప్పుడు పనులు సాగేదెట్లా? నిర్మాణ రంగం పుంజుకునేదెట్లా? రైసు మిల్లులు, ఇటుక బట్టీలు, కార్ఖానాల్లో పని చేసేవారెవరు? ఇవి ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేశాయి.

మళ్లీ ఎప్పుడొస్తారు?

తిరిగి రావాలనుకుంటున్నారా? లేదా?.. వలస కార్మికులపై సర్కారు సర్వే

‘టీఎస్‌ఎస్‌పీ‌’ యాప్‌ రూపకల్పన 

వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి సర్వే బాధ్యతలు 


హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): వలస కార్మికులంతా వెళ్లిపోయారు.. ఇప్పుడు పనులు సాగేదెట్లా? నిర్మాణ రంగం పుంజుకునేదెట్లా? రైసు మిల్లులు, ఇటుక బట్టీలు, కార్ఖానాల్లో పని చేసేవారెవరు? ఇవి ప్రభుత్వాన్ని  పునరాలోచనలో పడేశాయి. లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం  ఊపుమీదుంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో పెద్దఎత్తున అపార్ట్‌మెంట్ల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. షాద్‌నగర్‌, సంగారెడ్డి, శంకర్‌పల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి వంటి చోట్ల, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ తదితరచోట్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధిలో ఉంది. దీంతో పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు వలస వచ్చారు. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ‌స్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిసాల నుంచే కాకుండా, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌ నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసేవారు.


వీరి సంఖ్య దాదాపు 3.5 లక్షలని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వీరంతా ప్రభుత్వం గుర్తించిన కార్మికులే. కానీ ఇంతకంటే రెట్టింపు సంఖ్యలోనే ఉంటారని అంచనా. అయితే, లాక్‌డౌన్‌తో  దాదాపు 3 లక్షల మంది తెలంగాణను వీడారని అంచనా. ఆ దెబ్బ నుంచి భవన నిర్మాణ రంగం ఇంకా తేరుకోనేలేదు. అసలే రాష్ట్రానికి రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రధాన ఆదాయ వనరు. అందుకే కార్మికుల విషయంలో ఏదో ఒకటి చేయాలి. వారిని తిరిగి రప్పించాలి. లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. సొంత రాష్ట్రాలకు వెళ్లిన వారంతా వస్తారో, లేదో ముందుగా తేల్చుకోవాలని నిర్ణయించింది.


ఇందులో భాగంగా ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు గురువారం నుంచే ప్రత్యేక సర్వేను ప్రారంభించింది. ‘తెలంగాణ స్టేట్‌ స్ర్టేండెడ్‌ పర్సన్స్‌ సర్వే(టీఎస్‌ఎస్‌పీ)’ పేర ఒక యాప్‌ను రూపొందించి వలస కార్మికుల వివరాలు సేకరిస్తోంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు ఈ బాధ్యతను అప్పగించింది. ఆ శాఖలోని మొత్తం 2500 మందిని ఇందుకోసం నియోగించింది. ఒక్కో అధికారి రోజుకు 30 మందికి ఫోన్లు చేసి వివరాలు సేకరించాలి. సేకరించిన వివరాలను యాప్‌లో పొందుపర్చాలి. 


వివరాల సేకరణ ఇలా...

ఒక్కొక్కరు తమకు అప్పగించిన 30 మంది కార్మికులకు ఫోన్లు చేస్తారు. వారి ఫోన్‌ నంబర్లు, వారి అడ్ర్‌సలను ‘టీఎ్‌సఎ్‌సపీ’ యాప్‌లో ప్రభుత్వం అప్‌లోడ్‌ చేసింది. వలస కార్మికుడికి ఫోన్‌ చేసిన వెంటనే ఎక్కడున్నారో తెలుసుకుంటారు. రాష్ట్రంలో లేకుంటే  ఎప్పుడొస్తారని అడుగుతారు. వస్తారా? రారా? అని తెలుసుకున్నాక.. అధికారి ఆ వివరాలను యాప్‌లో పొందుపర్చి సబ్‌మిట్‌ కొడతాడు. ఆ కార్మికుడు తెలంగాణలోనే ఉన్నట్టయితే.. మీ సొంత రాష్ట్రానికి వెళ్లాలనుకుంటున్నారా? అని అడుగుతారు. అవునంటే మళ్లీ   తెలంగాణకు ఎప్పుడు వస్తారంటూ ప్రశ్నలు సంధిస్తారు. వెళ్లను అంటే.. వెంటనే యాప్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేస్తారు. ఇలా ఒక్కో అధికారి రోజుకు 30 మంది వివరాలను యాప్‌ ద్వారా పంపిస్తారు. ఒకవేళ కార్మికుడి ఫోన్‌ నంబర్‌ నాట్‌ కనెక్టెడ్‌/నో రెస్పాన్స్‌/రాంగ్‌ నెంబర్‌ అని సమాధానం వస్తే... అవే వివరాలతో సబ్‌మిట్‌ కొడతారు. ఇలా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న, సొంత రాష్ట్రాలకు వెళ్లిన వారందరి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. 

Updated Date - 2020-05-22T09:28:15+05:30 IST