కార్డుదారులకు అన్ని కష్టాలే

ABN , First Publish Date - 2021-02-24T05:20:14+05:30 IST

బియ్యం కార్డుదారులు తమ బాధను ఎక్కడ చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు. నిత్యావసరాల సరుకుల కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. నెల పూర్తి కావస్తున్నా బియ్యం, నిత్యావసరాలు పంపిణీ ముందుకు సాగకపోవడమే ఇందుకు కారణం.

కార్డుదారులకు అన్ని కష్టాలే
చంద్రాకాలనీలో మొబైల్‌ వాహనం వద్ద పడిగాపులు కాస్తున్న కార్డుదారులు

నిత్యావసరాల కోసం పడిగాపులు


మదనపల్లె అర్బన్‌, ఫిబ్రవరి 23: బియ్యం కార్డుదారులు  తమ బాధను ఎక్కడ చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు. నిత్యావసరాల సరుకుల కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. నెల పూర్తి కావస్తున్నా  బియ్యం, నిత్యావసరాలు పంపిణీ ముందుకు సాగకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికీ పట్టణంలో 75శాతం, పల్లెలో 30 శాతం కూడా పంపిణీ కాలేదు. మదనపల్లె పట్టణంలో 67 రేషన్‌ దుకాణాలద్వారా 19 వాహనాలతో, మదనపల్లె రూరల్‌ మండలంలో 34 రేషన్‌షాపుల ద్వారా 19 వాహనాలతో   సరుకుల పంపిణీ చేపట్టారు. సర్వర్‌ పని చేయకపోవడం, తమకు ఎక్కువ పని అంటూ పదిమంది డ్రైవర్లు పనికి రాకుండా చేతులెత్తేయడంతో పంపిణీ సక్రమంగా జరగలేదు. దీనికితోడు పంచాయతీ ఎన్నికల కోడ్‌ అడ్డురావడం కూడా ఒక కారణం. ఇక పంపిణీకి వాడుతున్న వాహనాల సామర్థ్యం తక్కువ కావడంతో చౌకదుకాణం నుంచి  రెండు, మూడు ధపాలు వెళ్లి సరుకులు నింపుకురావాల్సి వస్తోంది.  ఇక కార్డుదారులు రోడ్లపై  వరుసలో నిలబడి వేచి ఉన్నా తమ వంతు వచ్చేసరికి సర్వర్‌ పని చేయకపోడవంతో తరువాతి రోజు మళ్లీ క్యూలో నిలుచుకోవాల్సిన పరిస్థితి. ఈ బాలారిష్టాలు దాటి ఇంటింటికీ రేషన్‌ ఎప్పటికి పంపిణీ అవుతుందోనని కార్డుదారులు చర్చించుకుంటున్నారు.  


నిమ్మనపల్లెలో కూడా అంతే...


నిమ్మనపల్లె మండలంలో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ  జరగడంలేదు. దాదాపు 25 చౌకదుకాణాలకు 6 వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనం రోజుకు 100కార్డులకు సరుకులు పంపిణీ చేయాల్సివుంది. అయితే వాహన డ్రైవర్లు గ్రామాల్లో చెట్లకింద నిలిపి  కార్డుదారులను వాహనం వద్దకువచ్చి తీసుకుపోవాలని చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమంది డ్రైవర్లు ప్లాస్టిక్‌ బేసిన్తు, గోనె సంచులు, రేకు డబ్బాలను త్రాసుల్లోపెట్టి తూకాలు వేస్తున్నారు. దీంతో తూకాలలో వ్యత్యాసం వస్తున్నాయి.  దీనిపై అధికారులు స్పందిం చాలని కార్దుదారులు కోరుతున్నారు. 

Updated Date - 2021-02-24T05:20:14+05:30 IST