గేట్లన్నీ బార్లా!

ABN , First Publish Date - 2022-08-12T09:16:23+05:30 IST

ఎగువన ఏకధాటిగా వర్షాలు.. వెల్లువలా వరద.. పరవళ్లు తొక్కుతూ.. పరవశింపజేస్తూ ప్రవాహం..! ఆల్మట్టిని దాటి..

గేట్లన్నీ బార్లా!

  • ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా..
  • జూరాల 38 గేట్ల నుంచి నీటి విడుదల
  • నాగార్జున సాగర్‌ 26 గేట్లు ఎత్తివేత
  • మళ్లీ ఉగ్ర గోదారి.. ప్రాణహిత, ఇంద్రావతికి వరద 
  • మేడిగడ్డకు 10.62 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • తెరుచుకున్న శ్రీరామసాగర్‌ నాలుగు గేట్లు
  • భద్రాద్రి వద్ద 52.4 అడుగుల ఎత్తున గోదారి
  • మంచిర్యాల జిల్లాలో 3 వేల ఎకరాల మునక
  • ఆసిఫాబాద్‌ జిల్లాలో రైతు గల్లంతు
  • ఖమ్మం జిల్లాలో వాగులో వ్యక్తి గల్లంతు
  • కాపాడేందుకు వచ్చిన ఇద్దరు డీఆర్‌ఎఫ్‌ 
  • సిబ్బందిలో ఒకరి మృతి.. మరొకరు గల్లంతు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఎగువన ఏకధాటిగా వర్షాలు.. వెల్లువలా వరద.. పరవళ్లు తొక్కుతూ.. పరవశింపజేస్తూ ప్రవాహం..! ఆల్మట్టిని దాటి.. నారాయణపూర్‌ను మీరి.. తుంగభద్రను కలుపుకొని.. కృష్ణమ్మ పోటెత్తుతోంది. పరీవాహకంలోని ప్రాజెక్టులను ‘‘నిండుగా’’ ఆశీర్వదిస్తోంది. ఫలితంగా.. గేట్లను ఎత్తి  వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఇక గత నెల వణికించిన గోదావరి మళ్లీ తన ఉగ్ర రూపం చూపుతోంది. కాళేశ్వరం వద్ద ఉధృతి పెరుగుతోంది.


ఉప నదులను కలుపుకొంటూ ఉరుకులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే నాగార్జున సాగర్‌ గేట్లన్నీ తెరుచుకున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. కర్ణాటకలోని ఆల్మట్టికి 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 2 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్‌ వద్ద 2.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా 25 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కులను జూరాలకు విడిచిపెడుతున్నారు. తుంగభద్ర డ్యాంకు 1.82 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 33 గేట్లు తెరిచి 1.81 లక్షల క్యూసెక్కులను కిందకు పంపుతున్నారు. జూరాలకు 2.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 38 గేట్లు ఎత్తి 2.72 లక్షల క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. సుంకేసుల నుంచి మరో 1.74 లక్షల క్యూసెక్కుల చేరికతో.. గురువారం రాత్రి శ్రీశైలం డ్యాం వద్ద 4.53 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తడంతో పాటు ఏపీ, తెలంగాణ విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ద్వారా 4.38 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.


13 ఏళ్ల తర్వాత సాగర్‌ గేట్లన్నీ ఒకేసారి!

శ్రీశైలం నుంచి కృష్ణమ్మ బిరబిరా రావడంతో సాగర్‌ నీటి మట్టం 588 అడుగుల (306.10 టీఎంసీలు)కు చేరింది. పూర్తి నీటి మట్టం 590 అడుగులు (312.04 టీఎంసీలు). ప్రాజెక్టు నిండడంతో తెల్లవారుజామున 5 గంటలకు సీఈ శ్రీకాంతరావు, ఎస్‌ఈ ధర్మానాయక్‌ 13వ నెంబరు గేటు వద్ద పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. మొదట 10 గేట్లను, మధ్యాహ్నం  26 గేట్లను ఎత్తారు. 2009 తర్వాత సాగర్‌ 26 క్రస్ట్‌గేట్లను మొదటిరోజే ఎత్తడం ఇదే ప్రథమం. మొత్తంగా 4,22,761 క్యూసెక్కులను పులిచింతలకు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే ఉంటే శుక్రవారం కూడా నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పులిచింతలకు 3,44,748 క్యూసెక్కుల వరద చేరుతోంది. 24 గేట్లకు 17 గేట్లను ఎత్తి 4,36,525 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలోని 3 యూనిట్ల ద్వారా 6 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు పులిచింతలకు 3.91 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 4.40 లక్షల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి విడిచిపెడుతున్నారు. మూసీ నుంచి మూడు గేట్ల ద్వారా 5,309 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉండడంతో.. 11 విద్యుత్‌ కేంద్రాల్లో 45.65 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు.


మళ్లీ ఉగ్ర గోదారి.. కాళేశ్వరం వద్ద ఉధృతి

గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతికి వరద పెరిగింది. మేడిగడ్డ వద్ద 10.62 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా తుపాకులగూడెంకు 12.83 లక్షల క్యూసెక్కులు, దుమ్ముగూడెంకు 13.72 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. అన్నారం 66 గేట్లను, మేడిగడ్డ 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలిపెడుతున్నారు. కాళేశ్వరం వద్ద గురువారం 12.6 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ రెండో ప్రమాద హెచ్చరికకు చేరువైంది. భద్రాచలం వద్ద  52.4 అడుగులకు చేరింది. ఎల్లంపల్లికి 61 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 54 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. శ్రీరామసాగర్‌కు 39,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. 4 గేట్ల ద్వారా 16 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాణహిత నీటితో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో 3 వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలంలోని పాపన్‌పేటలో రైతు మడె భగవాన్‌ గురువారం ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌లో గల్లంతయ్యాడు. 


ప్రకాశం బ్యారేజీ మొత్తం గేట్లూ..

పులిచింతల నుంచి ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి 1,33,925 క్యూసెక్కుల నీరువస్తోంది. ఇది 4.50 లక్షల క్యూసెక్కులకు పెరగొచ్చని అంచనా. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 1,06,370 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గోదావరిపై తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి 14,05,991 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. 

Updated Date - 2022-08-12T09:16:23+05:30 IST