రథసారధులంతా రామగుండం వాసులే

ABN , First Publish Date - 2022-05-16T06:34:02+05:30 IST

జిల్లాలోని ప్రధాన పార్టీల జిల్లా రథసారధులంతా రామగుండం వాసులే. బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మూడు ప్రధాన పార్టీల జిల్లా అధ్యక్షులు ఒకే సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రథసారధులంతా రామగుండం వాసులే

- మూడు పార్టీల పగ్గాలు ఒక వర్గం చేతుల్లోనే...

- ప్రధానపార్టీలకు కార్యవర్గాలు కరువు

గోదావరిఖని, మే 15: జిల్లాలోని ప్రధాన పార్టీల జిల్లా రథసారధులంతా రామగుండం వాసులే. బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మూడు ప్రధాన పార్టీల జిల్లా అధ్యక్షులు ఒకే సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల రాజకీయల వేడి పెరుగుతున్న నేపథ్యంలో, రాజకీయాలు మొత్తం కులాలు, మతాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లా రాజకీయ పార్టీల అధ్యక్షుల కుల గోత్రాలపై చర్చ మొదలైంది. జిల్లాలో బీసీల్లో అత్యధిక ఓటర్లు, జనం ఉన్నా వారిని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నారనే యనే అపవాదు కూడా లేకపోలేదు. కోరుకంటి చందర్‌... టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, రామగుండం... కాపు సామాజిక వర్గం... సోమారపు సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం, కాపు సామాజిక వర్గం... ఈర్ల కొమురయ్య, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజకీయ క్షేత్రం రామగుండమే... కాపు సామాజికవర్గం(చీకురాయి, పెద్దపల్లి)... వై యాకయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి, రామగుండం కార్మిక క్షేత్రమే, తాండ్ర సదానందం సీపీఐ జిల్లా కార్యదర్శి, రాజకీయ క్షేత్రం రామగుండమే(చీకురాయి, పెద్దపల్లి).

- బీజేపీ అధ్యక్షుడిగా సోమారపు సత్యనారాయణ బాధ్యతలు చేపట్టి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆయన స్వయంగా నేను అధ్యక్షున్నా అని చాలా సందర్భాల్లో ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో. జిల్లా కమిటీని నియామకం చేసుకునే పరిస్థితి కూడా తనకు లేదనే విషయాన్ని బహిరంగంగానే చెప్పడంతో పాటు జిల్లా పదవికి రాజీనామా కూడా చేసిన పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో బీజేపీకి గతంలోనే పాతుకుపోయిన సీనియర్‌ నాయకులు ఉండగా, సత్యనారాయణ ఇతర పార్టీల నుంచి వచ్చి అధ్యక్షపదవి చేపట్టే విషయంలో అంతర్గత ఆరోపణలు, గ్రూపు తగాదాలు కోకోళ్లలు. 

- అధికార టీఆర్‌ఎస్‌ పగ్గాలు చేతబట్టిన కోరుకంటి చందర్‌ అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లా కమిటీ నియామకంపై ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. అత్యధికులు నాయకులుగా ఉన్నా టీఆర్‌ఎస్‌లో జిల్లా కమిటీలో చోటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. చందర్‌ జిల్లా కమిటీ ఎప్పుడు నియమిస్తాడా, తమకు అవకాశం దక్కుతుందని ఎదురు చూస్తున్న నేతలు చాలా మంది ఉన్నారు. పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టిన చందర్‌ ఇప్పటికీ జిల్లా స్థాయిలో పార్టీ సంస్థాగత విషయాలు, జిల్లా వ్యాప్త పర్యటన లాంటి కార్యక్రమాలు ఇంకా ఏమీ చేయలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న సందర్భంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవి చందర్‌కు ఛాలెంజే.

-  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా రెండేళ్ల క్రితం బాధ్యతలు తీసుకున్న ఈర్ల కొమురయ్య జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయంగా ఎదురురీదుతున్న కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా బాధ్యతలు నిర్వహించడం కొమురయ్యకు కత్తిమీద సామే. విద్యాభ్యాసం నుంచి గోదావరిఖని క్షేత్రంలోనే రాజకీయ కార్యకలాపాలు నిర్వహించిన కొమురయ్య నాలుగు దశాబ్దాలుగా ఎన్‌ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడి వరకు పార్టీని పట్టుకునే ఉంటున్నాడు. పెద్దపల్లి మండలం చీకురాయి స్వగ్రామం అయినప్పటికీ ఈర్ల కొమురయ్య రాజకీయ చిరునామా గోదావరిఖనియే. 

-  కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులు కార్మిక క్షేత్రం బిడ్డలు...

బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లాంటి పార్టీల జిల్లా అధ్యక్షులే కాకుండా కమ్యూనిస్టు పార్టీలకు అధ్యక్షులు కార్మిక క్షేత్రం నుంచే ఉన్నారు. ఎంఎల్‌ గ్రూపుల్లో పని చేసిన వై యాకయ్య సీపీఎంలో,  కార్మికవర్గం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. యాకయ్య సీపీఎం జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నాడు. సీపీఎంకు కూడా పూర్తి స్థాయి జిల్లా కమిటీ ఉంది. అనేక ప్రజా పోరాటాల్లో సీపీఎం జిల్లా కమిటీ క్రియాశీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. 

- సింగరేణి కార్మికవర్గంలో పట్టున్న సీపీఐ అనుబంధ ఏఐటీయూసీకి మొదటి నుంచి గోదావరిఖని కార్మిక క్షేత్రమే బలమైన ప్రాంతం. కార్మిక, రాజకీయ పోరాటాలైనా సీపీఐ రాజకీయ నిర్మాణం అయినా జిల్లాలో గోదావరిఖనియే ఆ పార్టీకి కీలకం. ప్రస్తుతం సీపీఐ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న తాండ్ర సదానందం కూడా గోదావరిఖని ప్రాంతంలో పీడీఎస్‌యూ విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగిన నేతనే. 2003లో సీపీఎం చేరి ఎస్‌ఎఫ్‌ఐలో ఎదిగిన సీపీఎం పెద్దపల్లి డివిజన్‌ కార్యదర్శిగా గుర్తింపు పొందాడు. 2012లో సీపీఐలో చేరి క్రమంగా జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. రాజకీయ ఎదుగుదల గోదావరిఖని కేంద్రంగా ఎదిగిన స్వగ్రామం సదానందంది కూడా పెద్దపల్లి చీకురాయే.


Updated Date - 2022-05-16T06:34:02+05:30 IST