బస్సులన్నీ.. సీఎం సభకే!

ABN , First Publish Date - 2022-09-23T09:00:23+05:30 IST

బస్సులన్నీ.. సీఎం సభకే!

బస్సులన్నీ.. సీఎం సభకే!

ఆర్టీసీ.. ప్రైవేటు స్కూలు బస్సులన్నీ అటువైపే..

కుప్పానికి భారీగా జనసమీకరణ 

టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌.. బైండోవర్‌


చిత్తూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ పాగా వేస్తామని, వచ్చే ఎన్నికల్లో అక్కడా గెలుస్తామని స్వయంగా ప్రకటించిన సీఎం జగన్‌ అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చేయూత లబ్ధిదారులకు మూడో విడత నగదు పంపిణీకి కుప్పం సభను వేదికగా చేసుకున్న సీఎం జగన్‌.. ఈ సభ కోసం కుప్పం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఓవైపు భారీ హోర్డింగులు, సీఎం ఫ్లెక్సీలు, వైసీపీ రంగులతో సభా వేదికను అలంకరించిన వైసీపీ నాయకులు... మరోవైపు జన సమీకరణకు నాయకులకు, అధికారులకు టార్గెట్లు పెట్టారు. ప్రధాన బాధ్యతలను వలంటీర్లకు అప్పగించారు. జిల్లావ్యాప్తంగానూ.. పక్క జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు 1400 బస్సులను నడుపుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్ల బస్సులను రవాణా శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్లు శుక్రవారం సెలవు ప్రకటించాయి. సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా టీడీపీ నేతల్ని ఒక రోజు ముందు నుంచే హౌస్‌ అరెస్టులు, బైండోవర్లు చేశారు. ఇక, జనాల్ని తరలించే బాధ్యత వలంటీర్లకు అప్పగించారు. సీఎం సభకు రాకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చిత్తూరులో వలంటీర్లకు ఆదేశాలు అందాయి.


స్కూల్‌ బస్సులు సీజ్‌ 

సీఎం సభకు బస్సులు ఇవ్వలేదనే కక్ష సాధింపులో భాగంగా వివిధ కారణాలు చూపుతూ గురువారం పలు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను సీజ్‌ చేసి ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. దీనిపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తనిఖీల పేరిట 60కిపైగా బస్సులను సీజ్‌చేసి డీటీసీ కార్యాలయానికి తరలించారు. 



Updated Date - 2022-09-23T09:00:23+05:30 IST