ఆల్‌ ది బెస్ట్‌!

ABN , First Publish Date - 2022-05-06T05:23:54+05:30 IST

ఆల్‌ ది బెస్ట్‌!

ఆల్‌ ది బెస్ట్‌!
వికారాబాద్‌ పరీక్ష కేంద్రంలో హాల్‌ టికెట్‌ నెంబర్లు వేస్తున్న సిబ్బంది


  • నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 
  • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ 
  • మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి స్పెషల్‌ స్క్వాడ్‌ టీములు
  • ఎగ్జామ్‌ సెంటర్‌ను గుర్తించేందుకు ‘సెంటర్‌ లొకేటర్‌’ యాప్‌

నేటి నుంచి నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్‌ బోర్డు అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య, రవాణా శాఖల అధికారుల సమన్వమంతో విద్యార్థుల కోసం పరీక్ష కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యార్థులు ఎగ్జామ్‌ రాస్తారు. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.

వికారాబాద్‌, మే 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఇంటర్‌ పరీక్షల పకడ్బందీ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియెట్‌ బోర్డు పకడ్బందీ చర్యలు చేపటి ్టంది. వికారాబాద్‌ జిల్లాలో ఇంటర్‌ పరీక్షలకు 17,565 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరు కానున్నారు. వారిలో ఫస్టియర్‌ విద్యార్థులు 9,350 మంది, సెకెండియర్‌ స్టూడెంట్స్‌ 8,215మంది ఉన్నారు. 32 ఎగ్జామినేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. 32మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 32 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 16 మంది అదనపు చీఫ్‌ సూపరింటెండెంట్లు, 12 మంది కస్టోడియన్లు విఽధలు నిర్వహిస్తారు. ప్రతీ 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున నియమించారు.

పటిష్ట నిఘా, పర్యవేక్షణ మధ్య పరీక్ష

జిల్లాలో 32 కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో 16 ప్రభుత్వ జూనియర్‌/ రెసిడెన్షియల్‌ కాలేజీల కేంద్రాలు, 16 ప్రైవేట్‌/అన్‌ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి. 17,565 మంది రెగ్యులర్‌ విద్యార్థుల్లో 15,290 జనరల్‌(ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ.. తదితర) కోర్సుల వారు, 2,275 మంది ఒకేషనల్‌ కోర్సు విద్యార్థులు పరీక్ష రాస్తారు. ప్రశ్నాపత్రాలను ఆయా సెంటర్ల పరిధి పది పోలీసు స్టేషన్లలో భద్రపరుస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ఎగ్జామ్‌ సెంటర్లోని ప్రతీ రూమ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఎగ్జామినర్లు.. ఇలా ఎవరైనా సరే వారితో సెంటర్లోకి స్మార్ట్‌/మొబైల్‌ ఫోన్లను అనుమతించరు. క్వశ్చన్‌ పేపర్లు తెరవడం, ఆన్సర్‌ షీట్లను సీల్‌చేయడం వంటివి సీసీ కెమెరాల రికార్డింగ్‌లోనే పూర్తి చేస్తారు.

ఆలస్యమైతే అనుమతి నిరాకరణ!

విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష ప్రారంభానికి 45నిమిషాల ముందే కేంద్రంలోకి విద్యార్థులను పంపుతారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుతించరు. ఉదయం 8గంటల్లోగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 8.15గంటల నుంచి సెంటర్‌లోకి పంపుతారు. పరీక్ష ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగుతుంది. పరీక్ష సమయం 3గంటలు పూర్తయ్యే వరకూ విద్యార్థులను బయటకు అనుమతించరు. విద్యార్థుల కోసం గ్రామాల నుంచి సెంటర్ల వరకూ ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు ‘ఎగ్జాం సెంటర్‌ లొకేటర్‌‘ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. హాల్‌ టిక్కెట్‌ ఎంటర్‌ చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందీ, ఎంత దూరం ఉన్నదీ తెలుస్తుంది. సెంటర్ల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కోసం వైద ్య సిబ్బందినీ అందుబాటులో ఉంచుతారు. పరీక్ష జరిగినంత సేపూ జిరాక్స్‌, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ కేంద్రాలను మూసేయిస్తారు.

చూచిరాత నివారణకు స్పెషల్‌ స్క్వాడ్స్‌

పరీక్షల్లో కాపీయింగ్‌ జరగకుండా ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌, రెండు డెక్‌, ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తాయి. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీంలో కాలేజీ ప్రిన్సిపాల్‌, డిప్యుటీ తహసీల్దార్‌, ఎస్‌ఐ ఉంటారు. సిట్టింగ్‌ స్క్వాడ్‌లో ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లు ఉంటారు. డెక్‌ బృందంలో సీనియర్‌ ప్రిన్సిపాల్‌, జూనియర్‌ లెక్చరర్లు ఉంటారు. ఈ బృందాలు పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్‌ జరగకుండా నిఘా ఉంచుతారు.

మేడ్చల్‌ జిల్లాలో 127 సెంటర్లలో పరీక్షలు

  • 1,06,730 మంది ఇంటర్‌ విద్యార్థులు 

మేడ్చల్‌, మే 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలో ఇంటర్‌ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల కోసం 127 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఒక గంట నుంచి అరగంట ముందుగానే రావాలని, నిర్ణీత సమయానికి నిమిషం అలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించం అని జిల్లా ఇంటర్‌ పరీక్షల నిర్వాహణ అధికారి కిషన్‌ తెలిపారు. ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు మొత్తం 1,06,730మంది పరీక్షలు రాస్తారని, వారిలో ఫస్టియర్‌ స్టూడెంట్స్‌ 56,620 మంది, సెకండియర్‌ విద్యార్థులు 50,110 మంది పరీక్షలు రాస్తారన్నారు. హాల్‌ టికెట్లు ఇప్పటికే పంపిణీ చేశామని, వాటిల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే ప్రిన్సిపాల్‌ దృష్టికి తెచ్చి సరిచేయించుకోలవాలని సూచించారు. పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు, ఆన్సర్‌ షీట్లు ఆయా సెంటర్ల పరిధి పోలీస్‌ స్టేషన్లకు చేర్చామన్నా రు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకాలం లో పరీక్ష కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

Read more