జగన్‌ ప్రభుత్వంలో అన్నీ దారుణాలే...

ABN , First Publish Date - 2022-05-16T06:24:19+05:30 IST

జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ దారుణాలే జరుగుతున్నాయని, దీనికి విసుగు చెందిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

జగన్‌ ప్రభుత్వంలో అన్నీ దారుణాలే...
రామయ్యపట్నం ఉప సర్పంచ్‌ లక్ష్మి, మాజీ సర్పంచ్‌ వీరన్ననాయుడులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న అనిత

మద్యపాన  నిషేధం అన్నారు.. జె.బ్రాండ్లతో దోచుకుంటున్నారు

తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

రామయ్యపట్నంలో వైసీపీ నుంచి భారీగా చేరికలు


ఎస్‌.రాయవరం, మే 15: జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ దారుణాలే జరుగుతున్నాయని, దీనికి విసుగు చెందిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం రామయ్యపట్నం గ్రామంలో అల్లు నరసింహమూర్తి అధ్యక్షతన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కార్యకర్తలను అనిత పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, తాను ఎమ్మెల్యే అయిన వెంటనే రామయ్యపట్నం గ్రామం నుంచే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతానని హామీ ఇచ్చారు. జగన్‌ చేతగాని పాలనతో వేళాపాలా లేని విద్యుత్‌ కోతలు, పెంచిన చార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం జగన్‌ ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానం నిషేధిస్తామని మహిళల ఓట్లు దండుకుని, ఇప్పుడు జే బ్రాండ్లతో కల్తీ మద్యం ప్రభుత్వం ద్వారానే అమ్ముతూ వారి సొమ్మును దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అభయహస్తం పథకానికి చెందిన రూ.2 వేల కోట్లను కూడా స్వాహా చేసి డ్వాక్రా మహిళలను జగన్‌ మోసం చేశారన్నారు. గడప గడపకు అంటూ వస్తున్న నాయకులను ప్రతీ ఒక్కరూ నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు. వైసీపీ పాలనతో జరిగేదేమీ లేదని గమనించిన వైసీపీకి చెందిన వారు టీడీపీ వైపు చూస్తున్నారని, అందులో భాగంగానే రామయ్యపట్నంలో వందమందికి పైగా టీడీపీలో చేరారని అనిత పేర్కొన్నారు. అనంతరం వైసీపీకి చెందిన ఉప సర్పంచ్‌ మైలారు లక్ష్మి, మాజీ సర్పంచ్‌, సీనియర్‌ నేత పోలిశెట్టి వీరన్ననాయుడు, రజిక సంఘ అధ్యక్షుడు మడత సత్తిబాబు, యూత్‌ లీడర్‌ పోలిశెట్టి శ్రీను, రెల్లి సంఘం అధ్యక్షుడు రాయివరపు ఆంజనేయులు, వార్డు సభ్యులు అరవోలు శ్రీనివాసరావు, కోసూరు చిరంజీవి, ముత్యాల అప్పలనర్స, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ అల్లు రమణ తదితరులకు టీడీపీ కండువాలు వేసి అనిత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దండు అచ్యుతరామరాజు, మాజీ ఎంపీపీ యేజెర్ల వినోద్‌రాజు, పార్టీ మండల అధ్యక్షుడు ఎ.అబద్దం, నాయకులు ఎన్‌.వెంకటరాజు, కె.నూకరాజు, జె.శ్రీను, అల్లు నరసింహమూర్తి, జీవీ రామక్రిష్ణ, పి.బుజ్జి, సుంకర శ్రీను, సమ్మంగి నానాజీ, తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T06:24:19+05:30 IST