ప్రస్తుతం ఉన్నవన్నీ ఐసొలేషన్‌ కేసులే

ABN , First Publish Date - 2020-04-07T09:24:08+05:30 IST

రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సింహభాగం నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు వెళ్లివచ్చిన వారి నుంచి వ్యాప్తి చెందినవేనని తేలింది. ప్రస్తుతం ఉన్నవన్నీ ఐసోలేషన్‌ కేసులేనని వైద్య ఆరోగ్య శాఖ

ప్రస్తుతం ఉన్నవన్నీ ఐసొలేషన్‌ కేసులే

  • మర్కజ్‌కు వెళ్లివచ్చిన వాళ్లు, వారి సన్నిహితులు..
  • 2,600 మంది శాంపిల్స్‌ సేకరణ
  • 1,924 ఫలితాల వెల్లడి..
  • అందులో పాజిటివ్‌ 265..
  • పెండింగ్‌లో 676 శాంపిల్స్‌
  • కేసుల సంఖ్య 500కు పెరగొచ్చు?.. 
  • ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం!


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సింహభాగం నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు వెళ్లివచ్చిన వారి నుంచి వ్యాప్తి చెందినవేనని తేలింది. ప్రస్తుతం ఉన్నవన్నీ ఐసోలేషన్‌ కేసులేనని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఒకరు తెలిపారు. తబ్లీగీలు, వారి కాంటాక్టులు తప్ప.. ఇతరుల ద్వారా వ్యాపిస్తున్న కేసులు లేవని చెబుతున్నారు. రాష్ట్రం నుంచి 1,089 మంది మర్కజ్‌ సమావేశాలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వారితోపాటు.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన మొత్తం 2,600 మంది నుంచి వైద్య ఆరోగ్య శాఖ నమూనాలు సేకరించింది. వీటిలో ఆదివారం రాత్రి వరకు 1,924 నమూనాల ఫలితాలు వెల్లడయ్యాయి. 265 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో మర్కజ్‌కు వెళ్లివచ్చిన 172 మంది కాగా.. మిగతా 93 మంది వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులే. మరో 676 నమూనాల ఫలితాలు మంగళవారం రాత్రికి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితో వ్యాప్తి చెందిన కరోనా కేసులపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా.. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నింటికీ మర్కజ్‌తో సబంధమున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారందరినీ జిల్లాల్లో ఎక్కడికక్కడ ఐసోలేషన్‌లో ఉంచారు. ఇవి కాకుండా.. బయటి నుంచి వస్తున్న కొత్తకేసులేమీ లేవని అధికారులు చెబుతున్నారు.


10వ తేదీ వరకు ఇదే ట్రెండ్‌

రాష్ట్రంలో రోజుకు సగటున 44 కేసుల చొప్పున గడిచిన ఆరు రోజుల్లో మొత్తం 267 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 5 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇదే ట్రెండ్‌ ఈ నెల 10 దాకా కొనసాగే అవకాశాలున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ రోజుకల్లా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 500కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత కేసుల సంఖ్య బాగా తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


వారి కాంటాక్టు ట్రేసింగ్‌ సవాలే

మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారందర్నీ ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉంచగా.. వారి కుటుంబ సభ్యులను, సన్నిహితంగా మెలిగినవారిని ట్రేస్‌ చేస్తున్నారు. ఈ కేటగిరీలో మూడువేల మంది ఉంటారని అంచనా. జిల్లాలు, గ్రామీణ ప్రాంతా ల్లో ట్రేసింగ్‌కు పెద్దగా ఇబ్బందులు లేకున్నా.. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో మాత్రం అధికారులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు.


ముగ్గురు భార్యలు.. 45 మంది కుటుంబ సభ్యులు

మర్కజ్‌కు వెళ్లివచ్చిన కింగ్‌కోఠీ వాసికికరోనా పాజిటివ్‌ అని తేలింది. అతడి కుటుంబ సభ్యులను ట్రేస్‌ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. అతడికి ముగ్గురు భార్యలున్నారని, మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య 45 అని గుర్తించారు. ఆ 45 మందితో ఎందమంది కాంటాక్ట్‌ అయ్యారనే విషయాన్ని గుర్తించడం ఇప్పుడు అధికారులకు సవాల్‌గా మారింది.

Updated Date - 2020-04-07T09:24:08+05:30 IST