డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై మరోమారు యూజీసీ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-07-09T22:04:15+05:30 IST

సంప్రదాయ యూజీ, పీజీ కోర్సులతోపాటు ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన..

డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై మరోమారు యూజీసీ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: సంప్రదాయ యూజీ, పీజీ కోర్సులతోపాటు ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి మరోమారు యూజీసీ సెక్రటరీ కీలక ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రాలు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ సెక్రటరీ తాజాగా స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశామని చెప్పారు. యూనివర్సిటీలు, కళాశాలలు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ తెలిపారు.కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.


ఇదిలా ఉంటే.. యూజీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబర్‌లోగా నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చివరి సంవత్సరం/సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేసి గత సెమిస్టర్‌ల మార్కుల సరాసరి ఆధారంగా పాస్‌ చేయాలని కోరుతున్నారు. తర్వాత కావాలంటే బెటర్‌మెంట్‌ మార్కుల కోసం పరీక్షలు పెట్టి రాసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.


మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో పరీక్షలను ఐచ్ఛికంగా తీసుకుని ప్రభుత్వం తీర్మానం చేసిన తర్వాత చాలామంది ఉపశమనం పొందారు. ఇప్పుడు యూజీసీ నిర్ణయంపై ఆందోళన చెందుతున్నారు. యూజీసీ నిబంధనలు కేవలం మార్గదర్శకాలేనని, అవి తప్పనిసరి కావని అంటున్నారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు పరీక్షలను రద్దు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయరని కొందరు ప్రశ్నిస్తున్నారు.



Updated Date - 2020-07-09T22:04:15+05:30 IST