ఆరంభం అదిరింది..

ABN , First Publish Date - 2022-07-30T09:40:33+05:30 IST

చదరంగం చరిత్రలో భారత్‌ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చెందిన ఆరు జట్లు మొదటి రౌండ్‌లో క్లీన్‌ స్వీప్‌ చేశాయి.

ఆరంభం అదిరింది..

ఆరు భారత జట్లూ క్లీన్‌ స్వీప్‌

హంపి, అర్జున్‌, ప్రత్యూష బోణీ

చెన్నై (ఆంధ్రజ్యోతి): చదరంగం చరిత్రలో భారత్‌ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చెందిన ఆరు జట్లు మొదటి రౌండ్‌లో క్లీన్‌ స్వీప్‌ చేశాయి. 180కి పైగా దేశాలు పాల్గొంటున్న ఈ చెస్‌ ఒలింపియాడ్‌ తొలి రౌండ్‌ పోటీలను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఐదుసార్లు విశ్వవిజేతైన విశ్వనాథన్‌ ఆనంద్‌, ఫిడే అధ్యక్షుడు ఆర్కాడి డ్వొర్కోవిచ్‌ కలిసి శుక్రవారం ప్రారంభించారు. పురుషుల విభాగంలో భారత జట్టు తరఫున బరిలోకి దిగిన విదిత్‌ గుజరాతి, ఇరిగేసి అర్జున్‌, ఎస్‌.ఎల్‌ నారాయణ్‌, శశికిరణ్‌ బృందం 4-0తో జింబాబ్వేను చిత్తు చేసింది. భారత్‌-2 జట్టు తరఫున ఆడిన డి.గుకేష్‌, అధిబన్‌, సద్వానీ రౌనక్‌, నిహాల్‌ సరిన్‌ 4-0తో యునైటెడ్‌ అరబ్‌పై గెలవగా, భారత్‌-3 జట్టు నుంచి బరిలోకి దిగిన సేతురామన్‌, అభిజిత్‌ గుప్తా, కార్తికేయన్‌ మురళి, పురానిక్‌ అభిమన్యు 4-0తో సౌత్‌ సుడాన్‌ను ఓడించారు. ఇక, మహిళల విభాగంలో భారత టీమ్‌ కోనేరు హంపి, ఆర్‌.వైశాలి, తానియా సచ్‌దేవ్‌, కులకర్ణి భక్తి 4-0తో తజికిస్థాన్‌పై గెలుపొందింది. భారత-2 జట్టు వంతికా అగర్వాల్‌, సౌమ్య స్వామినాథన్‌, మేరీ అన్‌ గోమ్స్‌, దివ్య దేశ్‌ముఖ్‌ 4-0తో వేల్స్‌ను ఓడించగా, భారత-3 జట్టు కర్వాడే ఇషా, నందిదా, సాహితి వర్షిణి, బొడ్డా ప్రత్యూష 4-0తో హాంగ్‌కాంగ్‌పై జయకేతనం ఎగురవేసింది.


తెలుగు ప్లేయర్ల శుభారంభం..:

మహిళల విభాగంలో భారత జట్టును ముందుండి నడిపిస్తున్న హంపి తొలి రౌండ్‌లో ఆంటోనోవా నదెజ్డా (తజికిస్థాన్‌)తో తలపడింది. నల్ల పావులతో బరిలోకి దిగిన హంపి 41 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదే టీమ్‌ తరఫున ఆడిన తానియా సచ్‌దేవ్‌ విజయానికి పెద్ద పోరాటమే చేసింది. సాయ్‌డొవా రుఖ్‌షోరా (తజికిస్థాన్‌)తో సుదీర్ఘంగా సాగిన పోరులో తానియా 103 ఎత్తుల్లో నెగ్గగా, భారత్‌-3 జట్టు తరఫున ఆడుతున్న ప్రత్యూష 32 ఎత్తులోనే లి జాయ్‌ చింగ్‌ (హాంగ్‌)తో ఓడించి శభాష్‌ అనిపించింది. పురుషుల్లో భారత టీమ్‌ తరఫున ఆడుతున్న యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ నల్ల పావులతో బరిలోకి దిగాడు. అర్జున్‌ 38 ఎత్తుల్లో మసాంగో స్పెన్సెర్‌ను చిత్తు చేసి టోర్నీని విజయంతో ఆరంభించాడు.

Updated Date - 2022-07-30T09:40:33+05:30 IST