హిజాబ్ వివాదం.. మూడు రోజులపాటు కర్ణాటకలో విద్యాసంస్థల బంద్

ABN , First Publish Date - 2022-02-08T22:37:03+05:30 IST

రాష్ట్రంలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడం ముఖ్యమంత్రి బసవరాజు

హిజాబ్ వివాదం.. మూడు రోజులపాటు కర్ణాటకలో విద్యాసంస్థల బంద్

బెంగళూరు: రాష్ట్రంలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో స్కూళ్లు, కళాశాలలను మూడు రోజులపాటు మూసేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని కోరారు.


రాష్ట్రంలో గత కొంతకాలంగా హిజాబ్ వివాదం చెలరేగుతోంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని హిందూ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చినిచినికి గాలివానగా మారిన వివాదం చివరికి హింసాత్మక ఘటనలకు దారితీసింది.

 

 శివమొగ్గలోని బాపూజీనగర్ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల పరిసర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు నేడు (మంగళవారం) లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు విద్యార్థులు జూనియర్ కళాశాల సమీపంలోని ప్రైవేటు బస్సులపై రాళ్లు రువ్వారు.


ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితి మరింత విషమించకుండా శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు.  జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అదనపు  పోలీసు బలగాలను మోహరించారు.


ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిజాబ్ ధరించిన విద్యార్థులు, కాషాయ కండువాలతో వచ్చిన విద్యార్థుల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఒక గ్రూపుపై మరో గ్రూపు రాళ్లు రువ్వింది. ఈ ఘటన ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ లక్ష్మీప్రసాద్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఉడుపి ఎంజీఎం కాలేజీ పరిసరాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కళాశాల యాజమాన్యం నిరవధికంగా సెలవులను ప్రకటించింది. 

Updated Date - 2022-02-08T22:37:03+05:30 IST