Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందరినీ ఆదుకుంటా

2 నెలల్లో సాధారణ స్థితికి తీసుకొస్తాం

6 గ్రామాల్లో కుటుంబానికో 5 సెంట్లు

అందులో ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం

ఇసుక మేట తొలగింపునకు సాయం

డ్వాక్రా మహిళలు సర్వం కోల్పోయారు

వారి రుణాలపై త్వరలో స్పష్టత: సీఎం

కడప, చిత్తూరు జిల్లాల వరద ప్రాంతాల్లో జగన్‌ పర్యటన

నేడు తిరుపతి, నెల్లూరుల్లో పర్యటన

తుఫానుపై అప్రమత్తం ఉత్తరాంధ్ర కలెక్టర్లకు సీఎం ఆదేశాలు


కడప/తిరుపతి, డిసెంబరు 2(ఆంద్రజ్యోతి): ‘చెయ్యేరు నదికి సామర్థ్యానికి మించి వరద రావడం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. ఈ జలాశయం దిగువన వరద ముంచెత్తిన పులపత్తూరు, మందపల్లి, తొగూరుపేట, రామచంద్రాపురం సహా ఆరు గ్రామాల్లో బాధితులకు ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.  కడప, చిత్తూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం పర్యటించారు. రెండు జిల్లాల్లోనూ  వరద నష్టాలపై ఫొటో ఎగ్జిబిషన్లను సందర్శించారు. కడప జిల్లా పులపత్తూరులో ముంపునకు గురై రాళ్లకుప్పగా మారిన రాజులవీధి, దళితవాడ తదితర ప్రాంతాలను పరిశీలించి బాధితుల గోడు ఆలకించారు. ‘మీకు అన్ని విధాలా తోడుగా ఉంటా. రెండు నెలల్లోగా గ్రామాలను సాధారణ స్థితికి తీసుకువస్తా’ అని హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయం ప్రాంగణంలో బాధితులను ఉద్దేశించి జగన్‌ మాట్లాడారు. వరద సహాయక చర్యల్లో అధికారులు చురుగ్గా వ్యవహరించారని, కేవలం 13 రోజుల్లోగా 99 శాతం సహాయక చర్యలు అందించారంటూ అభినందించారు. ఇంకా ఎవరికైనా సహాయం అందకపోతే సచివాలయంలో దరఖాస్తు చేస్తే పరిశీలించి అందరికీ న్యాయం చేస్తామన్నారు. ‘పులపత్తూరు గ్రామంలో 293 ఇళ్లు పూర్తిగా కుప్పకూలాయి. ఈ గ్రామం సహా ఆరు గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో ఐదు సెంట్ల స్థలం ఇస్తాం. ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది’ అని హామీ ఇచ్చారు. పొలాల్లో ఇసుకమేటలు, భూమి కోతకు గురైన పొలాలను బాగు చేసుకోవడానికి హెక్టారుకు రూ.12,500 ఇస్తామని తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలు, భూహక్కు పత్రాలతో సంబంధం లేకుండా ఈ-క్రాప్‌ నమోదు చేసిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం అందిస్తామన్నారు. వరదలో సర్వం కోల్పోయామని డ్వాక్రా రుణాలు చెల్లించలేమని పొదుపు మహిళలు వివరించారు. ఆ రుణాలు ఏం చేయాలో త్వరలోనే స్పష్టత ఇస్తామని వారికి చెప్పారు. ‘వరద వల్ల వ్యవసాయ పనులు లేవు. నేటి నుంచి ఇక్కడ ఉపాధి పనులు చేపడతాం. ఎందరో ఆటోలు, బైకులు కోల్పోయారు. వాటి రిజిస్ర్టేషన్‌ ఆధారంగా వారందరికీ న్యాయం చేస్తాం. చదువుకున్న పిల్లలు, నిరుద్యోగులకు జాబ్‌మేళా పెట్టి అవుట్‌సోర్సింగ్‌, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి గ్రామంలో డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి రెండు నెలల్లో సాధారణ స్థితికి తీసుకువస్తాం. వరదకు కొట్టుకుపోయిన అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి రీడిజైన్‌ చేయిస్తాం’ అని సీఎం హామీ ఇచ్చారు. నందలూరు బ్రిడ్జి వరకు చెయ్యేరు నదీ తీరంలో ముంపు గ్రామాలకు రక్షణ గోడ నిర్మిస్తామని తెలిపారు. సాయంత్రం చిత్తూరు జిల్లాలోని వరదప్రాంతాల్లో సీఎం పర్యటించారు. విమానంలో తిరుపతికి చేరుకున్న సీఎం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన రేణిగుంట మండలం వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీకి చేరుకున్నారు. 130 ఇళ్లున్న ఆ కాలనీలో 30 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీధుల్లో నడుస్తూ దెబ్బ తిన్న ఇళ్లను దగ్గరగా వెళ్లి  సీఎం పరిశీలించారు. ఒక్కో ఇంటి వద్ద ఆగి బాధితులను పలకరించారు. ప్రభుత్వ సాయం అందిందా అని ప్రశ్నించారు. బాధితులను భుజంపై తడుతూ, కరచాలనం చేస్తూ, చిన్న పిల్లలను పలకరిస్తూ జగన్‌ అరగంట పాటు కాలనీలో గడిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన కొందరు బాధితులనూ ఆయన పలకరించి, వారిచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు.  స్వర్ణముఖి నదిపై కూలిపోయిన బ్రిడ్జిని రాత్రి ఫ్లడ్‌ లైట్ల వెలుగులో పరిశీలించారు. అనంతరం రాత్రి బసకు తిరుపతి పద్మావతీ అతిథిగృహానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి నగరంలో రెండుచోట్ల పర్యటించాక నెల్లూరు జిల్లాకు బయల్దేరి వెళతారు.


ఆంక్షలు, గృహనిర్బంధాల మధ్య..

కడప జిల్లా పులపత్తూరు, మందపల్లి గ్రామాల్లో ఆంక్షలు, గృహ నిర్బంధాల మధ్య సీఎం జగన్‌ పర్యటన సాగింది. వీధి వీధినా బాధితులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రే పోలీసులు, అధికారులు  ఇంటింటికి వెళ్లి సీఎంను ఇతర ప్రశ్నలు అడగవద్దంటూ ఆంక్షలు విధించారు. సీఎం పర్యటన షెడ్యూల్‌ కన్నా ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 2.30 గంటలైనా ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. దీంతో పునరావాస కేంద్రాల్లో భోజనాలు చేసేందుకు పంపించాలని, పిల్లలు, వృద్ధులు ఆకలితో ఎలా ఉంటారని ప్రజలు నిలదీయడంతో పోలీసులు భోజనానికి అనుమతించారు. గ్రామానికి చెందిన టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి కొండా శ్రీనివాసులును పోలీసులు అదుపులో తీసుకుని నందలూరు, సిద్దవటం పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. సీఎం పర్యటన తర్వాత ఆయనను వదిలేశారు. కాగా, 9 మందిని కోల్పోయిన పూజారి ఇంటికి సీఎం వెళ్లలేదు. అమ్మ, భార్యను కోల్పోయిన ఈశ్వరయ్య కుటుంబం వద్దకే పూజారి కుటుంబ సభ్యులను పిలిపించి జగన్‌ పరామర్శించి వెళ్లారు. వీధివీధినా వరదకు చితికిన ఇళ్లను పరిశీలిస్తారని జనం ఆశిస్తే.. కేవలం 10 నిమిషాల్లో పరిశీలించి వెళ్లిపోవడంతో ఈమాత్రం పరామర్శకు అంతదూరం నుంచి రావాలా అంటూ మందపల్లి గ్రామస్థులు అసహనం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.


సీఎం సెల్ఫీ...

ఎవరో సెల్ఫీ తీసుకుంటే అది మామూలే.. అదే వరద బాధిత ప్రాంతాలైన రాజంపేటకు వస్తూ హెలికాప్టర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఎంపీ మిథున్‌రెడ్డిలతో కలిసి సెల్ఫీ తీసుకుంటే.. అది స్ఫెషలే కదా.. ఈ ఫొటోను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా పంచుకున్నారు.

- రాజంపేట

Advertisement
Advertisement