అన్నమూ అధికారమూ

ABN , First Publish Date - 2020-12-28T10:21:27+05:30 IST

చేతులు దులుపుకోవటం సులువు బతుకు నిలుపుకోవటమే భారం పంట పండించి...

అన్నమూ అధికారమూ

చేతులు దులుపుకోవటం సులువు

బతుకు నిలుపుకోవటమే భారం

పంట పండించి

పంచి పెట్టిన రోజులు గుర్తే

పంటకు ధర రాక

పారబోసిన రోజులు గుర్తున్నాయి

అడ్తి కిరాయి ఎల్లదని

పంట కాలవెట్టిన దినాలు మరిచిపోలేదు

పొలం దున్నకముందే

పంట తియ్యక ముందే

ఎవుసానికి ఎసరు పెడుతుంటే

ఏ రైతు తట్టుకుంటాడు

బతుకులు కాలపెడుతుంటే

బజారుకెక్కక ఎవరుంటారు

పొలంలో పొర్లాడే రైతు

హైవేల మీద

రాజధానిలో గుడారమేసి

అన్నం వండుతున్నాడు


ఏ భయమూ లేదు

సిగ్గుపడే పని లేదు

అధికారం అనుగ్రహించిన దేవునికి

ఆలయం అర్పించటం సరే సనాతనధర్మం

అధికారం కట్టబెట్టిన బేహార్లకు

చట్టాలు సమర్పించటం అధునాతన ధర్మం

ఛాందసాలు సరే

పాతచట్టాలతో అభివృద్ధి సాధ్యం కాదు

మర్మానికి తావులేదు

సంస్కరణలన్నీ ధర్మంకోసమే

ఆస్తులే కావాలా...

తరించటానికి దుస్తులు చాలు


భయపడే పనిలేదు

సిగ్గుపడే పని చేయలేదు

చదువుకున్నందుకు చదువు తెలివి ఉండాలె

మోచేతి నీళ్లతోనే మోక్షం

మాయ బోధ పర్చుకున్నందుకు

మాయా ప్రదర్శించాలె

దేవుళ్లయితే భజనతో సరిపెట్టుకుంటారు

కార్పొరేట్‌ దేవుళ్లు

భజనేనా

పైస కావాలె

పంట కావాలె

పార్లమెంటు పట్టా కావాలె


చట్టం చేయటం సులువు

మాటలు చెప్పటం ఇంకా సులువు

బతుకే పోతుంటే భయమేమిటి

సింఘాలో రైతులు అల్లుకుంటారు

గుంపులు గుంపులుగా గుడారాలు అల్లుకుంటాయి

వాటర్‌ కెనాన్లే గద

చౌరస్తాలోనే రస్తా దొరుకుతుంది

బజార్లలోనే నిజాలు తేలుతాయి

అన్నం తినేవాడెవడైనా

అన్నం పెట్టేవాళ్లకు తలొంచాల్సిందే

నందిని సిధారెడ్డి

Updated Date - 2020-12-28T10:21:27+05:30 IST