ఆస్తుల వివరాలన్నీ..‘ధరణి’లో పొందుపర్చాలి

ABN , First Publish Date - 2020-09-29T06:05:04+05:30 IST

ఆస్తుల వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో పొందుపర్చాలని, రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆయువుపట్టుగా మారనున్న ధరణి పోర్టల్‌ విజయ దశమి (దసరా) పర్వదినం రోజు

ఆస్తుల వివరాలన్నీ..‘ధరణి’లో పొందుపర్చాలి

విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ ప్రారంభం

సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలి

విధివిధానాలపై అధికారులకు శిక్షణ

పోర్టల్‌ నిర్వహణకు మండలానికి ఒకరి నియామకం

రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఆస్తుల వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో పొందుపర్చాలని, రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆయువుపట్టుగా మారనున్న ధరణి పోర్టల్‌ విజయ దశమి (దసరా) పర్వదినం రోజు నుంచి ప్రారంభం కానున్నదని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంత్రులు ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ ధరణి పోర్టల్‌పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ విజయదశమిని ప్రజలు శుభదినంగా భావిస్తున్నందున అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారని అన్నారు. ఆలోపు జిల్లాలో ధరణికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, బ్యాండ్‌ విడ్త్‌లను సిద్ధం చేయాలని అన్నారు.


నూతన రిజిస్ట్రేషన్‌ విధానం, వెంటనే మ్యూటేషన్‌ చేయడం, ధరణి పోర్టల్‌లో వివరాలను అప్‌డేట్‌గా పొందుపరచడం, విధివిధానాలపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ధరణి పోర్టల్‌పై నమూనా ట్రయల్స్‌ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పోర్టల్‌ నిర్వహణకు అనుగుణంగా ప్రతి మండలానికి ఒకరు, ప్రతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 


దసరాలోగా అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులను కోరారు. ఆ తర్వాత జరిగే మార్పులు, చేర్పులను వెంటవెంటనే నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ధరణి ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్‌ రేట్లను నిర్ణయించడం జరుగుతుందని అన్నారు.


అదే రేట్ల ప్రకారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. ధరణి పోర్టల్‌ ప్రారంభమయ్యే రోజు నుంచే రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతాయని, అప్పటి వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలు జరుగవని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణకు, రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేందుకు, భూ సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

Updated Date - 2020-09-29T06:05:04+05:30 IST