సోమరితనం నేర్పే పథకాలే అన్నీ!

ABN , First Publish Date - 2021-04-15T07:32:55+05:30 IST

ఇటీవల మద్రాస్ హైకోర్టు రాజకీయపార్టీలు మేనిఫెస్టోల ద్వారా ఇచ్చే ఉచిత వరాల వల్ల ప్రజలు సోమరులుగా మారుతున్నారని...

సోమరితనం నేర్పే పథకాలే అన్నీ!

ఇటీవల మద్రాస్ హైకోర్టు రాజకీయపార్టీలు మేనిఫెస్టోల ద్వారా ఇచ్చే ఉచిత వరాల వల్ల ప్రజలు సోమరులుగా మారుతున్నారని, ఈ ఉచిత వరాలను అవినీతిగా పరిగణించాలని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల్లో ఎంతో నిజముంది. రాజకీయపార్టీలు ‍సంక్షేమ రాజ్యం ముసుగులో ఓటు బ్యాంకు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. స్వాతంత్ర్య ప్రారంభ కాలంలో పార్టీలు సామాజిక, ఆర్థిక మార్పుల కోసం నూతన పథకాలను తీసుకు వచ్చేవి. తద్వారా కొద్దో గొప్పో అభివృద్ధిని సాధించగలిగాం. ఇదే బాటలో, తర్వాతి కాలంలో రాజకీయపార్టీల హామీలు సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల వైపు మళ్ళాయి. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పాఠశాల భవనాలు, మౌలిక వసతులు మొదలైన అంశాల్లో కొత్త పథకాలతో హామీలు ఉండేవి. అట్టి పథకాల వల్ల దీర్ఘకాల అభివృద్ధికి బాటలు పడ్డాయి. కానీ ప్రస్తుత రాజకీయపార్టీలు మాత్రం మొత్తం వ్యవస్థను ప్రభా వితం చేసే పథకాలుగాక ఓట్ల కోసం ఓటర్లకు వ్యక్తిగతంగా ప్రయోజనం కల్పించే పథకాలను రూపొందిస్తున్నాయి. సామాజిక భద్రత కల్పించే కొన్ని పథకాలు వ్యక్తులనే ఉద్దేశించినప్పటికీ వాటికి సంక్షేమ రాజ్యంలో ప్రజలందరి ఆమోదమూ ఉంటుంది. ఉదాహరణకు ఒక రూపాయికి కిలో బియ్యం, రైతు బీమా, 12 రూపాయలకే జీవిత బీమా...  మొదలైనవి. కానీ ఈ వ్యక్తిగత ప్రయోజనాల పథకాలు ఇప్పుడు శ్రుతిమించాయి. సౌకర్య, విలాస వస్తువుల బహూకరణే ఎన్నికల హామీలుగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో పేర్కొంటున్నాయి. టివీ సెట్లు, వాషింగ్ మిషన్లు, గ్రైండర్స్, బాలికలకు స్కూటీలు, మహిళలకు ప్రతినెల నగదు ఇలా అనేక తాత్కాలిక ప్రయోజన పథకాలను మ్యానిఫెస్టోలో పొందుపరచి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు స్వావలంబన నేర్పాల్సిందిపోయి, వారిని పరాన్నజీవులుగా తయారు చేస్తున్నాయి. మద్రాసు హైకోర్టు పేర్కొన్నట్లు రాజకీయపార్టీలు ఇచ్చే ఇలాంటి హామీలకు ఆయా పార్టీల సొంత ఆదాయం నుంచి 10 శాతం నిధులు వసూలు చేసే విధంగా చట్టం తీసుకు రావాలి. రాజకీయపార్టీలు ఇచ్చే ఈ హామీలు సాంకేతికంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిలోకి రాకపోవచ్చు, కానీ మద్రాస్ హైకోర్టు చెప్పినట్లు ఆ హామీలను అవినీతిగా ఎందుకు చూడకూడదు? ఇది ఒక రకంగా ఓటుకు పరోక్షంగా డబ్బులు ఇవ్వడం కాదా? కనీసం ప్రజలైనా చైతన్యవంతులై పార్టీ హామీలను తిరస్కరించాలి. అప్పుడే నిజమైన సంక్షేమ రాజ్య స్థాపన జరుగుతుంది.

జూరు నారాయణ యాదవ్

మహబూబ్ నగర్

Updated Date - 2021-04-15T07:32:55+05:30 IST