Jul 25 2021 @ 00:00AM

నా పాత్రలన్నీ మన సమాజంలోవే

  • తెలుగు సినిమా కథకులలో ‘కోన వెంకట్‌’ ఒక బ్రాండ్‌. కథా రచయితగా,
  •  డైలాగ్‌ రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా విశేష అనుభవమున్న కోన వెంకట్‌ను
  •  ‘నవ్య’ పలకరించింది. ఆ ముఖాముఖిలోని విశేషాలు ‘నవ్య’ పాఠకుల కోసం..


ఒక రచయితగా మీకు స్ఫూర్తి ఎవరు ?

హాకవి ఆత్రేయ స్ఫూర్తి. నేను ఏమి కానీ రోజుల్లో ఆయనతో పాటు రెండేళ్లు ప్రయాణం చేశా. కొన్ని అనుకొని పరిస్థితుల్లో మేమిద్దరం కలిసాం. అప్పుడు నాకు 23 ఏళ్లు. ఆయనకు 63 ఏళ్లు. వయస్సులో అంత తేడా ఉన్నా- మా ఇద్దరి స్నేహం కుదిరింది. మేమిద్దరం కలిసి కారులో షికార్లకు వెళ్తూ ఉండేవాళ్లం. ఆ సమయంలో ఆయన ‘ప్రేమ’, ‘అభినందన’, ‘నీరాజనం’ వంటి సినిమాలకు పాటలు రాశారు. ఆయన వద్దకు నిర్మాతలు వచ్చేవారు. కొందరు డబ్బులు ఇచ్చి వెళ్లిపోయేవారు. ఇంకొందరు షూటింగ్‌లు ఆగిపోయాయని తిట్టేవారు. మళ్లీ వాళ్లే వచ్చి కాళ్లు పట్టుకొనేవారు. ఒక రచయిత పాట రాయకపోతే షూటింగ్‌ ఆగిపోతుందని నాకప్పుడే తెలిసింది. ‘రచయితకు ఇంత వేల్యూ’ ఉందా అనుకొనేవాడిని. నేను సినిమా రచయితను కావటానికి ఆయనే కారణం. 


ఆత్రేయ మాట.. పాట.. ఈ రెండింటిలో మీకేది ఇష్టం..?

రెండూ ఇష్టమే. ఆయన ఆల్‌రౌండర్‌. ఒక్క డైలాగ్‌లో మొత్తం కథను చెప్పటం ఆయనకే సాధ్యం. ఉదాహరణకు ఒక సినిమాలో- ‘ఎందుకు చేశావు ఈ పని’ అంటాడు. ఆ సినిమా కథకు ఆ డైలాగే మూలం. ఇక పాటల విషయానికి వస్తే- ఆయనకు మనిషి అంతరాల్లోకి వెళ్లి మనస్సును స్పృశించే శక్తి ఉంది. ఆ పాట మనతోనే ఉంటుంది. మనతోనే జీవిస్తుంది. మనతోనే చచ్చిపోతుంది. ఆయన పాటల్లో జీవిత సత్యాలు ఉంటాయి. ఫిక్షన్‌ ఉండదు. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాటనే తీసుకోండి. ఒక వ్యక్తి పడుతున్న వేదనను అంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు?


తెలుగు సినిమాల్లో ఒరిజినల్‌ కంటెంట్‌ తక్కువనే విమర్శ వినిపిస్తూ ఉంటుంది..

ఒక కథ నుంచి స్ఫూర్తి పొందటం నేరం కాదు కదా! ఇక రీమేక్స్‌ విషయానికి వద్దాం. కొన్ని రీమేక్స్‌ ఉండచ్చు. కానీ మిగిలివన్నీ ఒరిజినల్‌ కంటెంటే కదా! ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలు రీమేక్‌ చేస్తున్నారనే విమర్శ నేను విన్నా. పవన్‌ కళ్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’, చిరంజీవి ‘లూసీఫర్‌’, వెంకటేష్‌ ‘నారప్ప’.. సినిమాలన్నీ రీమేక్‌లే కదా అంటున్నారు. ఇవి కొన్ని సినిమాలు మాత్రమే. ఇక్కడ నేను ఇంకో విషయం చెబుతా. పెద్ద హీరోల సినిమాలకు హైరిస్క్‌ ఉంటుంది. బడ్జెట్‌ ఎక్కువగా ఉన్నప్పుడు నిర్మాత సేఫ్టీ చూసుకోవటం తప్పు లేదు. అందుకే ఇతర భాషల్లో హిట్‌ అయిన సినిమాలు రీమేక్‌ చేస్తున్నారు. దీని వల్ల షూటింగ్‌ వేగంగా పూర్తవుతుంది. ఆ సినిమాలో పనిచేసే టెక్నీషియన్స్‌కు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వందల కోట్లు పెట్టి తీసిన ప్లాప్‌ అయితే ఎన్ని కుటుంబాలు వీధిన పడతాయో విమర్శలు చేసేవారికి తెలియదు. అంతే కాదు.. మన పెద్ద స్టార్స్‌ కూడా అన్నీ రీమేక్‌లే చేయటం లేదు. పవన్‌ కళ్యాణ్‌ మూడు సినిమాలు చేస్తుంటే... ‘అయ్యప్పన్‌.. కోషియం’ ఒకటే రీమేక్‌. మిగిలినవి రెండూ ఒరిజినల్‌ కంటెంటే కదా!


మీ సినిమాల్లో తమాషా పేర్లు, పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. ఇవెక్కడినుంచి వస్తాయి?

రచయిత తన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకు ‘ఢీ’ సినిమాలో బ్రహ్మానందం ఒక మధ్యతరగతి ఉద్యోగి. అందుకే ‘నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి రావుగారు’ అంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్లు మన చుట్టూ అనేక మంది కనిపిస్తూ ఉంటారు. రచయిత నాలుగు గోడల మధ్య కాకుండా- బయట సమాజంలో తిరుగుతున్నప్పుడు ఈ పాత్రలు పుడతాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెబుతా. ‘గల్లీ రౌడీ’ అనే సినిమాలో వెన్నెల కిషోర్‌ పేరు నెమలిబాబు. ఒక రోజు టీవీ చూస్తుంటే విజయనగరానికి చెందిన ఒక నేరస్థుడి గురించి చెబుతున్నారు. అతని పేరు నెమలిబాబు. అందుకే అతని పేరును ఈ సినిమాలో వాడా. వైజాగ్‌లో మా బంధువులాయన ‘నన్ను రెచ్చగోక్కు’ అంటూ ఉంటాడు. అది అక్కడి యాస. దీనినే ‘గల్లీ రౌడీ’లో వెన్నెల కిషోర్‌తో పలికించా. చాలా కాలం క్రితం నేను రాజమండ్రిలో ఒకరి ఇంట్లో దిగా. ఆ ఇంటి యజమాని పేరు ‘పట్టపగలు వెంకట్రావు’. ఆయన ఇంకో వ్యక్తిని పరిచయం చేశారు. ఆయన పేరు ‘చీకటి సాంబశివరావు’ అన్నారు. వాళిద్దరిని చూసి - ‘పగలుతో రాత్రి స్నేహం చేయటం చాలా విచిత్రంగా ఉంది’ అని నేను అంటే అందరూ నవ్వారు. ‘గల్లీరౌడీ’లో రాజేంద్ర ప్రసాద్‌ పేరు ‘పట్టపగలు వెంకట్రావ్‌’.  ఇలా మన చుట్టూ ఉన్న సమాజం నుంచే పాత్రలన్నీ పుడతాయి. నేను 50 దేశాలుపైగా తిరిగా. ఒకో దేశంలో ఒకో సంస్కృతి. రకరకాల మనుషులు. వారి ప్రభావం నా పాత్రలపై ఉంది.


ఒక మంచి సినిమాకు ప్రాతిపదిక కలెక్షన్లు రావటమా.. ప్రేక్షకులు మెచ్చుకోవటమా?

డబ్బులు వచ్చి.. జనాలు మెచ్చుకొని.. అవార్డులు వస్తే అది మంచి స్టోరీ. నేను రాసిన సినిమాల్లో ‘దూకుడు’కి రివార్డులు, అవార్డులు కూడా వచ్చాయి. నా ఉద్దేశంలో కలెక్షన్లే ముఖ్యం. ఎందుకంటే ఏ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉండదు. అలాంటప్పుడు అందరూ మెచ్చుకోవాలనుకోవటం కన్నా- డబ్బులు రావాలనుకోవటం మంచిది. జనాలకు నచ్చి- సినిమా విడుదలయిన తర్వాత ప్రొడ్యూసర్‌ ఇటుకలు మోసే పరిస్థితికి వచ్చేస్తే అది వేస్ట్‌ స్ర్కిప్ట్‌. సూసైడికల్‌ స్ర్కిప్ట్‌. 


మీరు మంచి ప్రేక్షకుడా? రచయితా? 

నేను మంచి ప్రేక్షకుడిని. మంచి ప్రేక్షకుడు కాని వ్యక్తి మంచి రచయిత కాదు. దీనికి కొలమానం ఏమిటో కూడా చెబుతా. మొదటి రోజు ఒక సినిమాకు వెళ్లి తలనెప్పి అని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత- అది బ్లాక్‌ బస్టర్‌ అయితే - ఆ వ్యక్తి మంచి ప్రేక్షకుడు కాదు. ప్రేక్షకుడి నాడి అతనికి తెలియలేదని అర్థం. ప్రేక్షకుడికి దూరమయిన వ్యక్తి మంచి రచయిత ఎలా అవుతాడు? ఇటీవల వచ్చిన ‘ఉప్పెన’ సినిమాను మొదటి ఆట చూస్తూ- ‘ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌’ అని ట్వీట్‌ చేశా. అది తప్పు అయితే నన్ను సోషల్‌ మీడియాలో ఆడుకుంటారని తెలుసు. అయినా నా జడ్జిమెంట్‌ను నమ్మి ట్వీట్‌ చేశా. అది బ్లాక్‌ బస్టర్‌ అయింది. అంటే నేను ఇంకా మంచి ప్రేక్షకుడినే! ఒక ప్రేక్షకుడు మనలో జీవించినంత కాలం మనం రచయితగా నిలిచి ఉంటాం. అంతే కాదు.. నేను రాసే ప్రతి డైలాగ్‌ను ముందు నేను ఎంజాయ్‌ చేయాలి. ఆ డైలాగ్‌ను చూసి నేను నవ్వాలి.. నేను ఏడ్వాలి. అప్పుడే నాలోని భావోద్వేగాలు బయటకు వచ్చినట్లు లెక్క!

సివిఎల్‌ఎన్‌


చేతన్‌ భగత్‌ అంటే చాలా ఇష్టం. తెలుగులో మల్లాది వెంకటకృష్ణమూర్తి అంటే ఇష్టం. ఇక సినిమాల విషయానికి వస్తే రాజ్‌కుమార్‌ హిరానీ మంచి రచయిత. 

నాకు ఇష్టమైన జోనర్‌ కామిడీ. ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న బాధలన్నీ మర్చిపోయి నవ్వుతూ ఉండటానికి సినిమాకు ఒక సాధనమని నేను నమ్ముతా. అందుకే హ్యూమర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను పోయిన తర్వాత నన్ను బతికించి ఉంచేవి నా పాత్రలు, నా మాటలే. పద్మశ్రీ(దూకుడు), చారి(ఢీ), మెక్‌డొనాల్డ్‌ మూర్తి(రెడీ), పద్మనాభ సింహా(బాద్‌షా) లాంటి పాత్రలు ఇప్పటికీ అందరికి గుర్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఎక్కువ శాతం మీమ్స్‌ ఈ పాత్రల నుంచే ఉంటాయి. ఇక  థ్రిల్లర్‌, హారర్‌లు తీయటం చాలా కష్టం. ఈ రెండింటిలోను- ప్రేక్షకుడిని ఉలిక్కిపడేడట్లు చేయాలి. పోస్ట్‌ ప్రొడక్షన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లు ఎలా ఉంటాయో ఉహించుకొని కథను రాయటమంటే కష్టమే!

‘గల్లీరౌడీ’తో పాటు మూడు సినిమాలు లాంచ్‌ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రెండింటిని హిందీలో తీస్తున్నాం. జాన్‌ అబ్రహం, ఫరాన్‌ అక్తర్‌లకు స్ర్కిప్టు పంపించాం. వారి డేట్స్‌ ఆధారంగా షూటింగ్స్‌ మొదలవుతాయి. ఇక టాలీవుడ్‌, హాలీవుడ్‌ వర్కింగ్‌లో చాలా తేడా ఉంది. టాలీవుడ్‌లో ఫ్యామిలీ బిజినెస్‌ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కార్పొరేట్‌ బిజినెస్‌ ఉంటుంది. ఇక్కడ వ్యక్తులు, వారితో ఉన్న సాన్నిహిత్యం,నమ్మకాలు, విజయాల ఆధారంగా పని నడుస్తుంది. అక్కడ ఎగ్రిమెంట్ల ఆధారంగా పని నడుస్తుంది. ఒకో ఎగ్రిమెంట్‌ వంద పేజీలుంటుంది. దానిపై సంతకాలు చేయాల్సిందే.