‘నిత్యావసరాల’ రద్దీ!

ABN , First Publish Date - 2020-03-22T11:17:21+05:30 IST

వంటింట్లో సరుకులు, కూరలకోసం గృహిణుల ఆత్రుత! సండేరోజు బయట తిరగడానికి లేదని ముందే బీర్లు కొనుక్కొనేందుకు మద్యంప్రియుల బారులు! అత్యవసరం ఎప్పుడు ఎలా ఉంటుందోనని...

‘నిత్యావసరాల’ రద్దీ!

  • సండే కర్ఫ్యూ దృష్ట్యా రోజంతా కొనుగోళ్లు
  • కరోనా వ్యాప్తి వల్ల కూడా పోటెత్తిన జనం
  • త్వరలో మార్కెట్లు మూతపడే భయంతో ప్రతి అవసరం కోసం ఎగబడిన ప్రజలు
  • కూరల కోసం రైతు బజార్లకు వెల్లువ
  • ముందే మద్యం నిల్వకు భారీ బారులు
  • తెలతెలవారుతుండగానే సర్వత్రా క్యూ


అమరావతి, విజయవాడ, ఏలూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): వంటింట్లో సరుకులు, కూరలకోసం గృహిణుల ఆత్రుత! సండేరోజు బయట తిరగడానికి లేదని ముందే బీర్లు కొనుక్కొనేందుకు మద్యంప్రియుల బారులు! అత్యవసరం ఎప్పుడు ఎలా ఉంటుందోనని పాల పొడులు, పెరుగు ప్యాకెట్లు, ఔషధాల కోసం మిల్క్‌ స్టాళ్లు, మెడికల్‌ షాపుల వద్ద రద్దీ! ఇదంతా జనతా కర్ఫ్యూ  ప్రభావం! దానికితోడు కరోనా పంజా కారణంగా ఎప్పుడు హోల్‌సేల్‌ మార్కెట్లు, దుకాణాలు బంద్‌ అవుతాయో తెలియని అనిశ్చితి కూడా భారీఎత్తున కొనుగోళ్లకు వినియోగదారులను రోడ్డుపైకి తెచ్చింది.


దీంతో శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు నిత్యావసరాల నుంచి ప్రతి అవసరం కోసం పరుగులు పెట్టాయి. దీంతో రైతుబజార్లు, కూరగాయల అంగళ్లు, పాల దుకాణాలు  కిక్కిరిసిపోయి కనిపించాయి. విజయవాడలో డిమార్ట్‌, బెస్ట్‌ప్రైస్‌, మెట్రో, రిలయన్స్‌ వంటి బహుళజాతి సంస్థల మాల్స్‌తోపాటు కాళేశ్వరరావు, గొల్లపూడిలో హోల్‌సేల్‌ మార్కెట్లు కిటకిటలాడిపోయాయి. ఉన్నత వర్గాల ప్రజలు కార్పొరేట్‌ మాల్స్‌లో నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తుంటే, పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్లంతా హోల్‌సేల్‌ మార్కెట్లకు పోటెత్తారు. ఇంట్లో నిండుకున్న రేషన్‌ను లెక్కలు వేసుకుని దాని ప్రకారం ప్రతినెలా కొనుగోలు చేస్తుంటారు. అయితే, కరోనా ప్రభావంతో మున్ముందు హోల్‌సేల్‌ మార్కెట్లను బంద్‌ చేయించే అవకాశం ఉండటంతో ముందుచూపుతో ప్రజానీకం జాగ్రత్తపడుతున్నారు.


ఇంట్లో రేషన్‌ నిండుకున్నా, ఇంకా ఉన్నా నెలరోజులకు సరిపడా సరుకులను కొనుగోలు చేసుకుంటున్నారు. బహుళజాతి సంస్థ మాల్స్‌ కాకుండా విజయవాడలో 20-30 వరకు సూపర్‌ మార్కెట్లు ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకే కార్పొరేట్‌ మాల్స్‌ను తెరిచారు. ఎన్నడూ లేని విధంగా మాల్స్‌ బయటకు జనం క్యూలో కనిపించారు. సాధారణ రోజుల్లో 20-30 నిమిషాల్లో షాపింగ్‌ను పూర్తి చేసుకునే ప్రజలు, శనివారం బయటకు రావడానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. ఇంట్లో సరుకుల కోసం ప్రజానీకం దుకాణాల వద్దకు పరుగులు తీస్తుంటే, వ్యాపారులు హోల్‌సేల్‌ మార్కెట్లపై పడుతున్నారు. ఏయే సరుకు నిల్వలు తక్కువగా ఉన్నాయో చూసుకుని వాటిని ముందుగా కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో కాళేశ్వరరావు మార్కెట్‌, గొల్లపాలెంలోని హోల్‌సేల్‌ మార్కెట్‌ల నుంచి కిలోల కొద్దీ సరుకుల బస్తాలను గోడౌన్లకు తరలిస్తున్నారు.


‘మందు’ జాగ్రత్తతో..

ఆదివారం సకలం బంద్‌ కావడంతో మందుబాబుల క్యూ ల్లో నిలబడి మద్యాన్ని కొనుగోలు చేశారు. సాధారణంగా ఒక వ్యక్తికి మూడు సీసాలకు మించి  విక్రయించటం కుదరదు. దీంతో ఎందుకైనా మంచిదని భావించిన మందు బాబులు త మ కోటాలో మూడు సీసాలను తీసుకోవటమే కాకుండా పరిచయం ఉన్న వ్యక్తులను షాపుల వద్దకు పంపి మరో మూడు సీసాలను రప్పించుకున్నారు. విజయవాడ నగరంలో మద్యం దుకాణాల వద్ద ఈ దృశ్యాలు బాగా కనిపించాయి. బహిరంగ ప్రదేశాల్లో ఒక వ్యక్తికి మూడు అడుగుల దూరంలో ఉండాలని జాగ్రత్త చర్యలు చెబుతున్నప్పటికి మద్యం బాబులు ఒకరి మీద ఒకరు పడి పోటీ పడ్డారు.


రైతుబజార్లు కిటకిట

పట్టణాల్లోని రైతుబజార్లలో ఉదయం నుంచి రాత్రి వరకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చి కూరగాయలు కొనుగోలు చేయడం కనిపించింది. ఈ క్రమంలో కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకొన్నాయి. ప్రస్తుతం రైతుబజార్లలో చిక్కు డు, క్యారెట్‌, క్యాప్సికం, బీట్రూట్‌ మినహా ఇతర కూరగాయల న్నీ కిలో రూ.40లోపే ఉన్నాయి. దీంతో వినియోగదారులు నా లుగైదు రోజులకు సరిపడా కొనుక్కెళ్లడం కన్పించింది. ప్రస్తు తం చికెన్‌ ధర కిలో రూ.20నుంచి రూ.50లోపే ఉన్నా వైరస్‌ భయంతో వినియోగం తగ్గింది. కరోనా కలవరం మొదలయిన ఈ నెల రోజుల నుంచి కూరగాయలే ఎక్కువగా వాడుతున్నారు.

Updated Date - 2020-03-22T11:17:21+05:30 IST