Presidential Polls: మమత నేతృత్వంలో జరిగిన సమావేశంలో సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-15T23:15:05+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న

Presidential Polls: మమత నేతృత్వంలో జరిగిన సమావేశంలో సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం నిర్వహించిన సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఈ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో ఓ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. 


కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత మమత బెనర్జీ మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రక్రియకు ఇది నాంది అని చెప్పారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని అందరు నేతలు ఏకాభిప్రాయంతో అంగీకరించారని చెప్పారు. అయితే శరద్ పవార్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచలేదని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన ఇతర నేతల పేర్లను పరిశీలిస్తామని చెప్పారు. 


ఈ సమావేశంలో పాల్గొనని టీఆర్ఎస్, బీజేడీ వంటి పార్టీల గురించి మమత మాట్లాడుతూ, వారు ఈ సమావేశంలో పాల్గొనకపోవడం పెద్ద విషయమేమీ కాదన్నారు. ఈ సమావేశానికి చాలా పార్టీలు వచ్చాయని, హాజరుకాని పార్టీల నేతలకు ఇతర కార్యక్రమాలు ఉండి ఉంటాయని చెప్పారు. 


ఏకాభిప్రాయంతో కూడిన ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష పార్టీలతో మరోసారి వచ్చే వారంలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు  వివిధ పార్టీల నేతలతో మమత బెనర్జీ, శరద్ పవార్, మల్లికార్జున ఖర్గే చర్చలు జరుపుతారని తెలుస్తోంది.


కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్, ఆర్ఎస్‌పీ, ఐయూఎంఎల్, ఆర్ఎల్‌డీ, జేఎంఎం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ గైర్హాజరయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖుల్లో ఎన్‌సీపీ నేతలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్; కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరామ్ రమేశ్, రణదీప్ సుర్జీవాలా; జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమార స్వామి; సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. 



Updated Date - 2022-06-15T23:15:05+05:30 IST