కేజీబీవీలన్నీ కళాశాలలుగా

ABN , First Publish Date - 2020-10-01T08:17:44+05:30 IST

పేదరికంతో ఏ బాలిక కళాశాల విద్యకు దూరం కాకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవ వనరుల

కేజీబీవీలన్నీ కళాశాలలుగా

 రిమోట్‌, ఏజెన్సీలో ఉన్న ఎనిమిదే మొన్నటి వరకు కళాశాలలు 

  ప్లెయిన్‌లో ఉన్న నాలుగు త్వరలో కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ 

 బాలికలు ప్రైవేట్‌ బాట పట్టకుండా ఉండాలని ప్రభుత్వాల నిర్ణయం


 (కాకినాడ-ఆంధ్రజ్యోతి)

పేదరికంతో ఏ బాలిక కళాశాల విద్యకు దూరం కాకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా విధానానికి ప్రత్యక్ష, పరోక్షంగా కేంద్రం దండిగా రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల చేస్తోంది. తదను గుణంగా బాలికా విద్య బలోపేతానికి నడుం బిగించింది.


ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభు త్వాలకు తగిన ఆదేశాలిస్తూ వస్తోంది. వాటి అమలుకు సర్వశిక్షా సొసైటీ (ఎస్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టులకు తగిన సూచనలు ఇస్తూ బాలిక విద్య పురోగతికి బీజాలు వేసి, లక్ష్యాలు సాధించాలని ఎప్పటికపుడు మార్గనిర్దేశం చేస్తోంది. విద్య హక్కు చట్టం మేరకు ఎస్‌ఎస్‌ ఎస్‌ల ద్వారా బాలికల విద్య పురోగమనానికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంలో ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల పరిధిలో అన్ని జిల్లాల్లో ఉన్న కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో 6-10 తరగతులుగా ఉన్న పాఠ శాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయనుంది.


దీంతో ఇక నుంచి ఇక్కడ 6-12 వరకు అడ్మిషన్లు ఇవ్వాలని పేర్కొంది. ప్రస్తుతం జిల్లాలో 8 కేజీబీవీ కళాశాలలున్నాయి. మిగిలిన 4 పాఠశాలలు కళాశాలలుగా మారనున్నాయి. జిల్లాలో ఏజెన్సీ, రిమోట్‌, ప్లైయిన్‌ ఏరి యాల్లో 12 కేజీబీవీలున్నాయి. ఇందులో 6 నుంచి 10, 6 నుంచి 12 తరగతుల వరకు గత ఏడాది వరకు 2,800 మంది బాలికలు విద్యనభ్యసించారు. వాస్తవానికి 2018-19 విద్యా సంవత్సరంలో 8 కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య అమల్లోకి వచ్చింది. మిగిలిన నాలుగింటి లో పది వరకే ఉంది. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో అన్ని కేజీబీవీలను ఇంటర్‌ స్థాయిలో కళాశాలలుగా మార్చుతుండడంతో జిల్లాలో కూడా నాలుగు కేజీబీవీలు త్వరలో కళాశాలలుగా మారను న్నాయి.


8 కేజీబీవీల్లో ఇప్పటి వరకు బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లోనే బాలికలకు అడ్మిషన్లు ఇస్తున్నారు. ఎంపీసీ, బైసీపీ గ్రూపులు చెరి నాలుగు కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎంఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యు కోర్సులు బైపీసీ ఆధారంగా బోఽధిస్తున్నారు. ఈ పాఠశాలల్లో 10 వరకు చదివిన వారికే కళాశాలల్లో సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మిగిలిన నాలుగు పాఠశాలలు కళాశాలలుగా మారితే మరికొందరి బాలికలకు సీట్లు లభించనున్నాయి. ఇప్పుడున్న కళాశాలల్లో విద్యార్థులకు వసతి సమస్య వేధిస్తోంది. దీనికి అదనంగా తరగతి గదులను నాడు-నేడు కార్యక్రమంలో నిర్మించాల్సి ఉంది.


అయితే కేజీబీవీల నిర్వహణకు కేంద్రం సుమారు 70 శాతం నిధులు భరిస్తోంది. 30 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన నిధుల శాతాన్ని పెంచాల్సి ఉంది. అలాగే బాలికలకు అవసరమయ్యే ఇతర సౌకర్యాలను నూరుశాతం మెరుగుపర్చాలి. కొత్తగా అధ్యాపకులను నియమించినప్పటికీ, ఇంకా సబ్జక్టు టీచర్ల కొరత కనిపిస్తోంది. ఫ్యాకల్టీని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాల్సి ఉంది. 


అనుమతి వచ్చింది : ఎస్‌ఎస్‌ఎస్‌, ఏసీసీ విజయభాస్కర్‌ 

జిల్లాలో ఉన్న 12 కేజీబీవీల్లో 8 కళాశాలలుగా ఉన్నాయి. ఇంకా నాలుగింటిలో 6 నుంచి 10 వరకే బోధన అమల్లో ఉంది. కొన్ని జిల్లాల్లో ఉన్న అన్ని కేజీబీవీలను కళాశాలలుగా మార్పు చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మనకు ఇంకా ఆదేశాలు రాలేదు.


Updated Date - 2020-10-01T08:17:44+05:30 IST