తిరుపతి : ‘నందమూరి తారకరామారావు అంటే తెలుగు ప్రజలకు కనిపించే దేవుడు. క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి కుటుంబంలో పెరిగిన నందమూరి ఆడబిడ్డపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధేస్తోంది’ అని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు, అఖిల భారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రధాన కార్యదర్శి ఎన్టీఆర్ రాజు ఆవేదన చెందారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై వైసీపీ నేతలు అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై శనివారం ఆయన మీడియా ముందుకొచ్చి.. మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ఎన్టీఆర్కు పార్టీలకతీతంగా అభిమానులు ఉన్నారని, రాజకీయాలతో సంబంధంలేని మహిళపై వైసీపీ నేతలు నోరుపారేసుకోవడం తగదన్నారు. యావత్తు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, తక్షణమే సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.