క్రీడలన్నీ లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2020-06-05T09:57:31+05:30 IST

వేసవి వచ్చిందటే చాలు చిన్నారులు, క్రీడాకారుల్లో ఒకటే ఆనందం. ఇష్టమైన ఆటలు ఆడుకోవచ్చని, క్రీడా శిబిరాలకు వెళ్లి శిక్షణ ..

క్రీడలన్నీ లాక్‌డౌన్‌!

వేసవి శిక్షణపై... కరోనా కాటు

ఇబ్బంది పడుతున్న శిక్షకులు

శిక్షణకు దూరంగా ఔత్సాహికులు 


(ఇచ్ఛాపురం రూరల్‌):  వేసవి వచ్చిందటే చాలు చిన్నారులు, క్రీడాకారుల్లో ఒకటే ఆనందం. ఇష్టమైన ఆటలు ఆడుకోవచ్చని, క్రీడా శిబిరాలకు వెళ్లి శిక్షణ పొందవచ్చనే సంతోషం. వేసవి క్రీడల్లో ఎంతోమంది ప్రతిభ వెలుగులోకి వచ్చేది. ఉదయం, సాయంత్రం వేళల్లో మైదానాలు సందడిగా కనిపించేవి. కానీ ఈ ఏడాది ఆ అవకాశం లేకుండాపోయింది. లాక్‌డౌన్‌ ప్రభావం.. క్రీడలపై కూడా పడింది. వేసవి శిక్షణ శిబిరాలు లేకపోవడంతో ఔత్సాహికులు ఇళ్లకే పరిమితమయ్యారు. మైదానాల్లో క్రీడాకారులు భౌతికదూరం పాటిస్తూ ఆడుకోవడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు అకాడమీలనూ మూసేశారు. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాలకు స్వస్తి పలకవడంతో ఔత్సాహికులు నిరాశ చెందుతున్నారు. 


వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపైనా కరోనా ప్రభావం పడింది. జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రాలు, వివిధ  ప్రైవేటు విద్యాసంస్థల్లోని మైదానాల్లో ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏటా వేసవి కాలంలో క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేది. హ్యాండ్‌బాల్‌, ఖోఖో, కబడ్డీ, విలువిద్య, వెయిట్‌ లిప్టింగ్‌, స్విమ్మింగ్‌, పుట్‌బాల్‌, క్రికెట్‌ తదితర అంశాలపై ఉచితంగా నెలరోజుల పాటు శిక్షణ కల్పించేది. క్రీడాకారులకు శిక్షణతో పాటు పౌష్టికాహారం అందజేసేది. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం సమర్పించేది. శిక్షకులకు గౌరవ వేతనం అందజేసేది. కానీ, ప్రస్తుత కరోనా ప్రభావం.. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపై   పడింది. లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో క్రీడా మైదానాలన్నీ బోసిపోతున్నాయి. ఆడుకోవడానికి ఎవరు వచ్చినా అనుమతించడం లేదు. అలాగే మైదానాలు ప్రస్తుతం కూరగాయల మార్కెట్లుగా మార్చేశారు.  


శిక్షణకు దూరం..

క్రీడా శిబిరాల కోసం ఏటా సుమారు రూ. 20 లక్షలు ఖర్చవుతుందని  సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 40 క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేవారు. సుమారు 1000 మంది వరకు తర్ఫీదు పొందేవారు. కొంతమంది దాతలు సొంత ఖర్చులతో శిక్షణ శిబిరాలు నిర్వహించేవారు. వీరి ద్వారా మరో 500 మందికి ఉపయోగకరంగా ఉండేది. ఇలాంటి శిబిరాలతో సుమారు 100 మంది వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వీరిలో చాలా మందికి ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. వీరు కూడా ప్రస్తుతం ఎటువంటి సాధన లేక ఇంటికే పరిమితమయ్యారు. ఇందులో శిక్షకులకు రూ.1500 భృతి ఇచ్చేవారు. క్రీడా సామగ్రికి రూ.7500 ఉపయోగించేవారు. శిక్షకులకు కొంతమేర ఉపాధి లభించేది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌తో ప్రస్తుతం అవి మూతపడడంతో శిక్షకులు ఆర్థికంగా నష్టపోతున్నారు. విద్యార్థులకు శిక్షణ లేక నిరుత్సాహ పడుతున్నారు.  


ఆర్థికంగా నష్టపోయాం ..కొయ్య పద్మనాభ రెడ్డి, క్రీడా శిక్షకుడు.

ఏటా వేసవిలో క్రీడా నైపుణ్య శిక్షణ ఇచ్చేవాళ్లం. లాక్‌డౌన్‌ ప్రభావంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లింది. మాకు ఎప్పుడు అనుమతి లభిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. 


అనుమతి ఇవ్వలేదు ..బి.శ్రీనివాసకుమార్‌, డీఎస్‌డీవో, చీఫ్‌ కోచ్‌, శ్రీకాకుళం.

ఒకే చోట అందరూ చేరే అవకాశం ఉన్నందున.. లాక్‌డౌన్‌ సడలింపుల్లో క్రీడలకు అనుమతి ఇవ్వలేదు. ఈ ఏడాది క్రీడా శిబిరాలు లేనట్లే. యోగా, తదితర అంశాలలో ఇంటి దగ్గర ఉంటూ నేర్చుకోవచ్చు. మిగిలిన క్రీడాంశాలలో తర్ఫీదు ఇచ్చేందుకు అనుమతి లేదు. 


Updated Date - 2020-06-05T09:57:31+05:30 IST