ఎన్నికల రాష్ట్రాలకే అన్ని నిధులూ!

ABN , First Publish Date - 2021-02-03T06:16:30+05:30 IST

సుమారు 34 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ సొంత పార్టీ వారి అంచనాలను కూడా...

ఎన్నికల రాష్ట్రాలకే అన్ని నిధులూ!

సుమారు 34 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ సొంత పార్టీ వారి అంచనాలను కూడా అందుకోలేకపోయారు. దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా కేవలం నాలుగు ఐదు రాష్ట్రాల బడ్జెట్‌ గానే ఇది మిగిలిపోనుంది. రానున్న రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రయోజనాలకు మాత్రమే బడ్జెట్‌లో పెద్దపీట వేసారు. మొత్తం బడ్జెట్‌లో సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలను కేవలం ఈ ఐదు రాష్ట్రాలకే కేటాయించారు. మిగతా దేశం ఎటు పోయినా సరే అనుకుంటూ తమ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేశారు.


తెలుగు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలకు నయా పైసా కూడా న్యాయం చేయకుండా మా వైఖరి ఇదే అని మొండిగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు ఏడేళ్ల క్రితం ఇచ్చిన విభజన హామీలు ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు కాలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికార పార్టీలైన టిఆర్ఎస్, వైసీపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. రేపటి ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నది. ఇప్పటికే తెలంగాణలో 2019 పార్లమెంటు ఎన్నికలలో నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న బీజేపీ గత ఒకటిన్నర ఏడాదిగా రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీలేదు. కేంద్రప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నామని అడ్డగోలుగా అబద్ధాలు మాత్రం చెబుతున్నది. తెలంగాణ మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు, విభజన హామీల్లో పేర్కొన్న బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇలాంటివేవీ ఈ బడ్జెట్‌లో కనీస ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. ఈ దశలో కాళేశ్వరం తాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కడప ఉక్కు కర్మాగారం నుంచి మొదలుకొని విజయవాడ, విశాఖపట్నం రైల్వే జోన్లు, పోలవరానికి అధిక నిధులు వంటి అంశాలేవీ ప్రస్తావనకు కూడా రాలేదు. కేవలం ఖరగ్‌పూర్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే గురించి మాట్లాడి ఊరుకున్నారు. అది ఎప్పుడు మొదలవుతుందో ఏనాటికి పూర్తవుతుందో తెలియదు.


మొత్తం మీద బడ్జెట్‌ను విశ్లేషిస్తే ఆరోగ్య రంగానికి పోయినసారి కంటే 137 శాతం నిధులు కేటాయించటం ఒక్కటీ ఆహ్వానించదగ్గ విషయం. గత బడ్జెట్‌లో 90 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయిస్తే ప్రస్తుతం రెండు లక్షల 10 వేల కోట్ల రూపాయల కేటాయించడం మంచిదే. అందులో 35 వేల కోట్ల రూపాయలు దేశమంతా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి కేటాయించారు. 


కేంద్ర బడ్జెట్‌ ఇటు ప్రతిపక్షాలు అంటున్నట్లు అంకెల గారడీ కాదు, అటు అధికారపక్షం భుజాలు చరుచుకుంటున్నట్లు అద్భుతమూ కాదు. ఈ కరోనా కష్టకాలం తర్వాత వచ్చిన బడ్జెట్‌ను ఊహించడానికి ఇంతకన్నా ఏమీ లేదు.

బండారు రామ్మోహనరావు

Updated Date - 2021-02-03T06:16:30+05:30 IST