Abn logo
Sep 26 2021 @ 23:55PM

మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలి

మంగమారిపేట తీర ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లండి

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

భీమునిపట్నం, సెప్టెంబరు 26: గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి బీచ్‌రోడ్డులోని మంగమారిపేట తీరాన్ని సందర్శించారు. తుఫాన్‌ తీరం దాటే సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి తీర ప్రాంత మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా అధికారుల ఆదేశాలను అందరూ పాటించాలని, తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే ముందు జాగ్రత్తగా సిద్ధం చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు.  పునరావాస కేంద్రంగా జడ్పీ పాఠశాలను సిద్ధం చేశామని, అన్నవరం నుంచి తిమ్మాపురం వరకూ తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను సందర్శించి అందరినీ అప్రమత్తం చేశామని తహసీల్దార్‌ ఈశ్వరరావు మంత్రి ముత్తంశెట్టికి వివరించారు. మంత్రి వెంట ఆర్డీవో పెంచల కిశోర్‌, నాలుగో వార్డు కార్పొరేటర్‌ దౌలపల్లి ఏడుకొండలరావు, మత్స్యశాఖ అధికారులు, నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తంశెట్టి మహేశ్‌, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. 

వర్షానికి కూలిపోయిన గోడ

తుఫాన్‌ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మూడో వార్డు పరిధి బోయవీధిలో తెడ్డు సింహాద్రి అనే మత్స్యకారుడి శ్లాబ్‌ ఇంటి డాబాపై ఉన్న సపోర్టడ్‌ వాల్‌ నానిపోయి కూలిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇళ్లకే పరిమితమైన మత్స్యకారులు

భీమునిపట్నం (రూరల్‌): తుఫాన్‌ కారణంగా మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని అధికారులు ప్రకటించడంతో  భీమిలి తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉండడంతో పడవలు నీటిలో కొట్టుకుపోకుండా ఒకదానితో మరొకటి తాళ్లతో కట్టారు. అలాగే చేపల వేటకు వినియోగించే వలలు, ఇతర సామగ్రిని కూడా కట్టలుగా కట్టి తీరంలో జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో అన్నవరం, ఎర్రయ్యపాలెం, నాగమయ్యపాలెం, తదితర గ్రామాల్లోని మత్స్యకారులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉన్నారు.

జోన్‌-2లో 3 పునరావాస కేంద్రాలు

కొమ్మాది: తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జీవీఎంసీ జోన్‌-2 పరిధిలో మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జెడ్సీ బి.రాము తెలిపారు. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు అందరూ ఇంట్లోనే ఉండాలని, ఇళ్లల్లో విద్యుత్‌, గ్యాస్‌ కనెక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్లు సురక్షితంగా లేకపోతే పునరావస కేంద్రాలకు తరలిరావాలని కోరారు. పీఎంపాలెం అవంతి కళ్యాణ మండపం, సాగర్‌నగర్‌ వార్డు కార్యాలయం, ఆరిలోవ జీవీఎంసీ కళ్యాణ మండపంలో పునరావాప కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించామని పేర్కొన్నారు.

భీమిలి సముద్ర తీరంలో లంగరు వేసిన పడవలు