వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో అన్ని సదుపాయాలు

ABN , First Publish Date - 2021-06-17T06:07:29+05:30 IST

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు.

వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో అన్ని సదుపాయాలు
సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీరంగనాథ రాజు, ముత్తంశెట్టి, ప్రజాప్రతినిధులు, అధికారులు

గృహ నిర్మాణ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు

విశాఖపట్నం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. బుధవారం జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో  జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత స్పెషల్‌ డ్రైవ్‌లో ఐదు వేల ఇళ్లు ప్రారంభించాలని లక్ష్యం నిర్ణయించగా, 5019 ఇళ్లను ప్రారంభించినందుకు జిల్లా కలెక్టర్‌, అధికారులను మంత్రి అభినందించారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సమస్య లేకుండా ప్రతి కాలనీకి దగ్గరలో ఒక ఇసుక స్టాకు పాయింట్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ  ఇళ్ల పథకం కింద ఊళ్లే నిర్మిస్తున్నామన్నారు.  జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పురోగతిని వెల్లడించారు. ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో ఐదు వేల ప్లాంట్‌లు గ్రౌండింగ్‌ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులు మోసానికి గురవుతున్నారని పేర్కొనగా మంత్రి స్పందిస్తూ ఈ విషయంపై ఆర్‌డీఓ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలమంచిలి, అనకాపల్లి ఎమ్మెల్యేలు రమణమూర్తిరాజు, గుడివాడ అమర్‌నాఽథ్‌లు మాట్లాడుతూ తమ నియోజకవర్గాల్లో కొన్ని లేవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదన్నారు. దీనికి మంత్రి స్పందించి అటువంటి కాలనీలను గుర్తించి ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, మేయర్‌ వెంకట హరికుమారి, ఎంపీ జి.మాధవీ, హౌసింగ్‌ ఎండీ భరత్‌ నారాయణగుప్తా, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, వీఎంఆర్డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు, జేసీలు ఎం.వేణుగోపాలరెడ్డి, అరుణ్‌బాబు, కల్పనాకుమారి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్‌ గణే్‌శ్‌, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T06:07:29+05:30 IST