అందర్‌.. బాహర్‌

ABN , First Publish Date - 2022-05-17T06:36:06+05:30 IST

కర్ణాటక సరిహద్దులో అందర్‌ బాహర్‌ జోరుగా సాగుతోంది. బొమ్మనహాళ్‌ మండలంలో రోజుకు రూ.50 లక్షల వరకూ చేతులు మారుతున్నాయి.

అందర్‌.. బాహర్‌

సరిహద్దులో పేకాట 

రోజుకు రూ.50 లక్షల జూదం..

పట్టుబడకుండా పోలీసులపై నిఘాజోరు 


 కర్ణాటక సరిహద్దులో అందర్‌ బాహర్‌ జోరుగా సాగుతోంది. బొమ్మనహాళ్‌ మండలంలో రోజుకు రూ.50 లక్షల వరకూ చేతులు మారుతున్నాయి. కర్ణాటకలోని చిత్రదుర్గం, బళ్లారి, అనంతపురం జిల్లా లోని తాడిపత్రి, ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల నుంచి జూదరులు ఇక్కడికి రోజూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇసుక దిబ్బలు, తుంగభద్ర కాలువ, కంకర కొండలు ఉన్నాయి. జూదానికి అనుకూలమైన ప్రాంతం కావడంతో చాలామంది వస్తున్నారని సమాచారం. ఈ సమాచారం కొందరు పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 

- బొమ్మనహాళ్‌/బళ్లారి, ఆంధ్రజ్యోతి


ఎవరూ రాని చోట..

బొమ్మనహాళ్‌ మండలంలోని కొండలు, పొలాలు, కాలువలు, చెట్లను స్థావరాలుగా మార్చుకున్నారు. గత 20 రోజులుగా జూదం జోరు పెరిగిందని అంటున్నారు. ఇటీవల ఉంతకల్లు కొండ కింద ఉండే పొలంలో చెట్ల కింద పేకాట నిర్వహించారు. దీనికి రైతు అడ్డు చెప్పడంతో అతనిపై నిర్వాహకులు చేయిచేసుకున్నారు. మరుసటి రోజు రైతు అడ్డుతగలడంతో జూదరులు తమ స్థావరాన్ని కురవల్లి వద్దకు మార్చారు. అక్కడ రెండు రోజులు ఆట సాగింది. అక్కడ పోలీసుల నిఘా పడుతోందని తెలియగానే దర్గాహొన్నూరు వద్ద ఉండే ఇసుక మేటల్లో ఉండే ఒక చింత చెట్టు కిందకు శిబిరాన్ని మార్చారు. కొన్నాళ్ల తరువాత నేమకల్లు ఆంజనేయస్వామి క్షేత్రానికి వెళ్లే దారిలో, ఆర్చ్‌ పక్కన కి.మీ. దూరంలో ఉండే కొండ కిందకు మార్చారని సమాచారం. ఇలా నిత్యం స్థావరాలను మారుస్తున్నారని తెలిసింది. గతంలో వీరు చిత్రదుర్గం జిల్లా రాంపురం వద్ద ఒక తోటలో పేకాట ఆడేవారు. ఆ తరువాత అశోక్‌ సిద్దాపురం, రూపనగుడికి స్థావరాలు మార్చుకుంటూ పోయారు. 


రోజుకు రూ.50 లక్షలు..

అందర్‌ బాహర్‌లో రోజుకు రూ.50 లక్షల వరకూ చేతులు మారుతున్నాయని సమాచారం. పేకాట శిబిరానికి రోజుకు 50 మంది వరకూ జూదరులు వస్తున్నారని తెలిసింది. ఒక్కొక్కరు రూ.2 లక్షలకు పైగా నగదుతో పేకాటకు వస్తున్నారని తెలిసింది. నగదు చూపించినవారికే ఆటలోకి ఎంట్రీ ఉంటుందని, ఉదయం 10 నుంచి సాయంత్రం పొద్దు మునిగే వరకు ఆటను కొనసాగిస్తారని అంటున్నారు. రోజువారీ ఆటలో 5 శాతం నిర్వాహకులు కమీషనగా తీసుకుంటున్నారని తెలిసింది. రోజుకు రూ.2 లక్షలకు పైగా కమీషన వస్తుండటంతో నిర్వాహకులు ఆట జోరు పెంచారని తెలుస్తోంది.  అందర్‌ బాహర్‌ శిబిరాల వద్దకు ఆహారం, మద్యం సరఫరా అవుతోంది. నిర్వాహకులే వీటిని సమకూరుస్తున్నారని తెలిసింది. ఉదయం టిఫిన, మధ్యాహ్నం భోజనం, మందు.. అన్నీ వారే చూసుకుంటారని సమాచారం.



పోలీసులపైనే నిఘా

పేకాట స్థావరాలు, నిర్వాహకుల సమాచారం ఒకరిద్దరు పోలీసులకు తెలుసని అంటున్నారు. కానీ పోలీసు అధికారులకు చిక్కకుండా ఉండేందుకు, పోలీస్‌ స్టేషన్ల వద్ద కొందరు నిఘా పెడుతున్నారని సమాచారం. ఇలా నిఘా వేసిన యువకులు, పోలీస్‌ అధికారుల కదలికలను సెల్‌ఫోన్ల ద్వారా పేకాట నిర్వాహకులకు మెసేజ్‌ చేస్తారని సమాచారం. ఎస్‌ఎంఎ్‌సలను కోడ్‌ భాషలో పెడుతున్నారని, ‘పీ ఎస్‌’ అంటే పోలీసులు వస్తున్నారని, ‘పీ నో’ అంటే పోలీసులు రావడం లేదు అని అర్థమట. పోలీసుస్టేషన ఎదురుగా ఉండే హోటళ్లు, దుకాణాల వద్ద కూర్చుని, పోలీసుల కదలికలపై నిఘా వేస్తుంటారని తెలిసింది. 


యువతే ఎక్కువ..

 పేకాటకు యువకులే ఎక్కవగా వెళుతున్నారని తెలిసింది. జూదానికి అలవాటు పడిన చాలామంది యువకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పెద్దలు సంపాదించిన ఆస్తులను పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. ఇటీవల పోలీసు స్టేషన్ల వరకూ ఇవి చేరాయి. పెద్ద పెద్ద వ్యాపారులు సైతం పేకాటలో నష్టపోయి బోర్డులు తిప్పేశారు. పేకాట నిర్వహణ విషయం తమ దృష్టికి రాలేదని రాయదుర్గం సీఐ యువరాజ్‌ అన్నారు. సరిహద్దులో పేకాటను బళ్లారి రూరల్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నిరంజన ధ్రువీకరించారు. శిబిరాలపై నిఘా పెట్టామని, త్వరలో పట్టుకుంటామని అన్నారు. 


Updated Date - 2022-05-17T06:36:06+05:30 IST