బీజేపీ బలమంతా ఓబీసీలే!

ABN , First Publish Date - 2022-01-18T08:01:08+05:30 IST

నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీ దేశంలో బడుగు, బలహీన, వెనుకబడిన, దళిత వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ప్రభవించిందనడంలో సందేహం లేదు...

బీజేపీ బలమంతా ఓబీసీలే!

నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీ దేశంలో బడుగు, బలహీన, వెనుకబడిన, దళిత వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ప్రభవించిందనడంలో సందేహం లేదు. మిగతా పార్టీల్లాగా బిజెపి ఫలానా కుల పార్టీ, మత పార్టీ అని చెప్పుకోకపోగా, సామాజిక న్యాయప్రాతిపదికగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. కనుకనే అన్ని రాష్ట్రాల్లో ఓబీసీలు, దళితులు ఇవాళ మరే పార్టీలో కంటే బిజెపిలోనే అత్యధికంగా చేరుతున్నారు. లోక్‌సభకు ఇతర పార్టీల కంటే అత్యధిక బీసీలు, దళితులను పంపిన చరిత్ర బిజెపికే సొంతం. నిజానికి 1991లోనే కల్యాణ్‌సింగ్ నేతృత్వంలో బిజెపికి యాదవేతర బీసీలు, జాతవేతర దళితులు పట్టం కట్టినందువల్లే ఉత్తరప్రదేశ్‌లో 221 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 2014లో ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ స్వయంగా ప్రధానమంత్రి పదవి అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో దేశ వ్యాప్తంగా ఓబీసీల్లో ఒక కొత్త చైతన్యం ప్రజ్వరిల్లింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఓబీసీల్లో కదలిక ఏర్పడి మోదీని అక్కున చేర్చుకున్నారు. 2014లో బిజెపికి లభించిన 42.63 శాతం ఓట్లలో అత్యధికం ఓబీసీలు, దళిత వర్గాలవే. ఈ ఎన్నికల్లో మొత్తం 80 మంది అభ్యర్థుల్లో 27 మంది ఓబీసీలకు బిజెపి సీట్లు ఇచ్చింది. ఒక సభలో 15వేల మంది రాజభర్‌లు బిజెపిలో చేరారు. యాదవేతర బీసీలు మాత్రమే కాదు, జాతవేతర దళితులు, ఇతర దళిత వర్గాలు కూడా మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులయ్యారు. కేవలం ఉత్తరప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా దళితులు మోదీ ప్రభంజనాన్ని ఆహ్వానించారు. ప్రతి నలుగురు దళితుల్లో ఒకరు బిజెపికి ఓటు వేశారని 2014 ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన వారికి అర్థమైంది.


స్థూలంగా చూస్తే బిజెపి జాతీయ నాయకుడుగా మోదీ ప్రభవించిన తర్వాత దేశంలో కుల రాజకీయాలు చేసే కాంగ్రెస్, బహుజన సమాజ్, సమాజ్‌వాది వంటి పార్టీలపై దళితులు, బీసీల భ్రమలు తొలగిపోయాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశంలో బీసీలు, దళితుల ఆర్థిక పరిస్థితి ఏమీ మెరుగుపడలేదని వారు గ్రహించడం ప్రారంభించారు. నిజానికి బీసీలు, దళితుల్లో చదువుకున్నవారు పెరగడం వల్ల బిజెపికి వారి పట్ల ఆదరణ కూడా పెరుగుతూ వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఆర్థిక సంస్కరణల ఫలాలు అందరికీ చేరేలా చేసే అభివృద్ధి ద్వారానే ఆత్మనిర్భరత్వం వస్తుందని, సమాజంలో చిట్టచివరి వరుసలో ఉన్న వారిని చేరుకోవడమే సామాజిక న్యాయమనే బిజెపి తాత్విక సిద్ధాంతాన్ని అన్నివర్గాలు గౌరవించడం వల్లే దాని ఆమోదయోగ్యత దేశవ్యాప్తంగా పెరిగింది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల క్రింద నిధులు నేరుగా తమ ఖాతాల్లోకి చేరుతూ మధ్య దళారుల ప్రమేయం లేకుండా చేస్తున్న మోదీ విధానాలను వారు గమనిస్తూ వస్తున్నారు. క్రమంగా బిజెపి నాయకత్వంలోనూ, బిజెపి ప్రజాప్రతినిధుల్లోనూ ఓబీసీలు, దళితుల ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఒకరకంగా బిజెపి విధానాలను వారే ప్రభావితం చేస్తున్నారు. పార్లమెంట్‌కే కాదు, అసెంబ్లీలకు కూడా అత్యధిక, ఓబీసీ, దళిత ఎమ్మెల్యేలను పంపిన చరిత్ర భారతీయ జనతాపార్టీదే. కేవలం మొక్కుబడిగా దళిత, వెనుకబడిన వర్గాలను ప్రజాప్రతినిధులుగా పంపడమే కాదు, వారిలో ఇప్పటివరకూ సామాజిక, ఆర్థిక ఫలాలు అందుకోని వారిని గుర్తించి పట్టం కట్టడం బిజెపి తన కర్తవ్యంగా భావించింది.


2017 అసెంబ్లీ ఎన్నికల్లో 52.8 శాతం మంది, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 57.5 శాతం మంది, ఓబీసీలు, ఎస్సీలకు బిజెపి సీట్లు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బిజెపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో 31.5 శాతం ఓబీసీలు, 20.8 శాతం ఎస్సీలు కాగా 0.49 శాతం ఎస్టీలు. బిజెపి రాష్ట్ర ఆఫీసు బేరర్లలో కూడా 30.9 శాతం ఓబీసీలు, 19 శాతం ఎస్సీలు, 2.3 శాతం ఎస్టీలు ఉన్నారు. ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో 35.1 శాతం ఓబీసీలు కాగా, 12.9 శాతం మంది ఎస్టీలు. బిజెపి జిల్లా అధ్యక్షుల్లో కూడా దాదాపు 30 శాతం ఓబీసీలు, 6.12 శాతం ఎస్సీలు ఉన్నారని ఎంతమందికి తెలుసు?


2019 ఎన్నికల్లో బిజెపి నుంచి ఎన్నికైన 303 మంది లోక్‌సభ సభ్యుల్లో 209 మంది అంటే 68.9 శాతం మంది అగ్రవర్ణేతరులు. సిఎస్‌డిఎస్ 2019లో నిర్వహించిన ఎన్నికల సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా మూడోవంతు దళితులు అంటే 34శాతం మంది బిజెపికి ఓటు వేశారు, ఉత్తరప్రదేశ్‌లో యాదవేతర ఓబీసీలకు బిజెపి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. దీని మూలంగా యాదవేతర ఓబీసీల్లో 72 శాతం బిజెపికి మద్దతునిచ్చారు. ఎన్నికైన ఎంపీల్లో మొత్తం 113 మంది ఓబీసీలు కాగా, 53 మంది ఎస్సీలు, 43 మంది ఎస్టీలు ఉన్నారు. అంతేకాదు, నరేంద్రమోదీ కేబినెట్‌లోనే 61 శాతం ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు మంత్రిపదవులు ఇచ్చిన ఘనత మోదీకే దక్కుతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి పార్లమెంటరీ బోర్డు ప్రకటించిన 105 మంది అభ్యర్థుల తొలి జాబితాలో కూడా 44 మంది ఓబీసీలు, 19 మంది ఎస్సీలు ఉన్నారు. అంటే, మొత్తం సీట్లలో 60 శాతం ఓబీసీలు, దళితులకు దక్కాయి.


ఈ నేపథ్యంలో దళితులకు, ఓబీసీలకు బిజెపి అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఇద్దరో ముగ్గురో మంత్రులు రాజీనామా చేసినంత మాత్రాన వాస్తవాలు మారే అవకాశాలు లేవు. ఎన్నికలకు ముందు తమ వారసులకు, అనుయాయులకు టిక్కెట్లు కావాలని ఆశించి అవి రావని తెలిసి కొందరు రాజీనామా చేయడం పెద్ద విషయం కాదు. యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య కుమార్తె సంఘమిత్ర కూడా బిజెపి ఎంపి అనే విషయం మరిచిపోరాదు. ఆయన తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ ఆశించి భంగపడి సమాజ్‌వాది పార్టీలో చేరితే అది బిజెపికి ఎలా నష్టం చేకూరుస్తుంది? సంఘమిత్ర బిఎస్‌పిలో ఉండగా ఓడిపోయి బిజెపిలో చేరిన తర్వాత గెలుపొందారు. అదే ఆమె సోదరుడు రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. భారతీయ జనతాపార్టీలో వారసులకు సీట్లు అంత సులభంగా లభించవు. నిశితమైన అధ్యయనం, అనేకమంది పరిశీలకుల నివేదికల ఆధారంగా సీట్లు ఇవ్వాలని, ఏ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోను కాకూడదని బిజెపి నిర్ణయించుకుంది. అందులో తప్పేముంది? మరో మంత్రి దారాసింగ్ చౌహాన్ గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి చేతుల్లో ఓడిపోయిన తర్వాత బిఎస్‌పి నుంచి బిజెపిలో చేరారు. ఆయనను బిజెపి అసెంబ్లీకి నిలబెట్టి గెలిపించడమే కాక, ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా నియమించింది. బిఎస్‌పి నుంచి వచ్చిన మరో మంత్రి ధర్మసింగ్ సైనీతో పాటు యోగి అదిత్యనాథ్ మంత్రివర్గంలో స్థానం కల్పించింది. వీరిద్దరూ కూడా ఓబీసీలకు బిజెపి అన్యాయం చేసిందని ఆరోపించడంలో అర్థం ఉందా? ఉక్కు క్రమశిక్షణ గల రాజకీయ సంస్థ భారతీయ జనతాపార్టీ. ఈ పార్టీలో తమ గొంతెమ్మ కోర్కెలు నెరవేరవని తెలిసినందువల్లే కొందరు, అది కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఎన్నికల సమయంలో పార్టీలు ఫిరాయించడం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఉత్తరప్రదేశ్‌లో సామాజిక విప్లవం ప్రారంభించింది బిజెపి కనుక ఆ సామాజిక విప్లవ ఫలితాలు అందుకుంటున్నవారు ఆ పార్టీని మరోసారి ఆదరిస్తారనడంలో సందేహం లేదు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-01-18T08:01:08+05:30 IST