బీజేపీ నేతలంతా కాంగ్రెస్‌లోకి!

ABN , First Publish Date - 2021-10-20T08:00:44+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలోని బీజేపీ నేతలు కట్టగట్టుకొని కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు.

బీజేపీ నేతలంతా కాంగ్రెస్‌లోకి!

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత జరిగేదిదే

ఈటల, వివేక్‌ సహా జాబితాలో పలువురు

భట్టి మంచోడు.. రేవంత్‌ అక్రమార్కుడు

కరీంనగర్‌, నిజామాబాద్‌ తరహాలోనే  హుజూరాబాద్‌లో బీజేపీ- కాంగ్రెస్‌ ఫిక్సింగ్‌

దళిత బంధు పథకం ఎవరు ఆపినా ఆగదు

పార్టీ కార్యక్రమాలు ‘ముందస్తు’ కోసం కాదు

మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలోని బీజేపీ నేతలు కట్టగట్టుకొని కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆ జాబితాలో ఈటల రాజేందర్‌, జి.వివేక్‌ సహా చాలా మంది ఉన్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఒక పథకం ప్రకారం జరుగుతోందని, తమకు కచ్చితమైన సమాచారం ఉందని తెలిపారు. బీజేపీలో కొనసాగితే వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే ఉద్దేశంతో ఆ నేతలు ఉన్నారని, కాంగ్రె్‌సలోకి వెళితే కనీసం డిపాజిట్లు వస్తాయనేది వారి ఆలోచన అని అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో వెయ్యి శాతం కుమ్మక్కయిందని ఆరోపించారు.


‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌, నిజామాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయి. అదే అవగాహనను హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నాయి. అందుకే కాంగ్రెస్‌ అక్కడ డమ్మీ, స్థానికేతర, ముక్కూ ముఖం తెలియని అనామకుడిని నిలబెట్టింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఇప్పుడు సహకరించి, ఏడాదిన్నర తర్వాత కాంగ్రె్‌సలోకి ఆహ్వానించే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రచారం చేయడంలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌లో కూర్చొని, ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని రన్నింగ్‌ కామెంట్రీ చేస్తున్నారు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నికతో ఎవరేమిటో తేలిపోతుందని, ఎగిరెగిరి పడేవారి బలమెంతో తెలుస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ వంద శాతం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 


ఓడినోళ్లంతా ఇంట్లో పడుకుంటున్నారా?

హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి రావద్దనే ఈటల డిమాండ్‌పై మంత్రి  స్పందించారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి ఓడిపోయారు. మరి వాళ్లందరూ దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటున్నారా?  బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ సన్యాసం తీసుకున్నారా?’’ అని ప్రశ్నించారు. తాను గెలుస్తానని ఈటల చెప్పుకోవచ్చని, ఆయనకు ఓటు వేయాలా? వద్దా? అనేది ప్రజలు ఆలోచించుకుంటారని తెలిపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక చాలా చిన్న విషయమని, దానికే ఈటల ఎంతో ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశా రు. టీఆర్‌ఎ్‌సకు, ఎమ్మెల్యే పదవికి ఆయన ఎందుకు రాజీనామా చేశారని, పార్టీలో ఉండి ఎకసెక్కం మాటలు ఎవరు మాట్లాడమన్నారని, అసైన్డ్‌ భూములు ఎవరు కబ్జా పెట్టమన్నారని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాలపై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టడం ముందస్తు ఎన్నికల కోసం కాదని, దూరదృష్టితోనేనని కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వంలోకి వచ్చాక టీఆర్‌ఎ్‌సకు సంస్థాగతంగా కొంత లోటు ఏర్పడిందని దానిని భర్తీ చేసుకోవటానికే  పార్టీ కార్యక్రమాలపై ఫోకస్‌ పెట్టామని చెప్పారు. ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేశామని, వాటిని ప్రజలకు చెప్పడంలో శ్రేణులు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉందన్నారు.


రేవంత్‌ జోస్యం చెప్పుకొంటే మంచిది

అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతున్న రేవంత్‌రెడ్డి చిలుక జోస్యం చెప్పుకొంటే మంచిదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేతనైతే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్‌ చేశారు. కొడంగల్‌లో ఓడిపోయాక సన్యాసం తీసుకుంటానని చెప్పి, ఇంకా తిరుగుతున్న సన్నాసి అని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే చెవులు కోసుకుంటానని ఓ నాయకుడు అన్నారని, ఆయన చెవులు ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాయని అన్నారు. హుజూరాబాద్‌లో వందల మందితో నామినేషన్లు వేయిస్తామన్నవారు ఎక్కడ పోయారని పరోక్షంగా వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఎద్దేవా చేశారు. ‘‘రకరకాల పేపర్‌ టైగర్లు, మీడియా సృష్టించిన ఫ్లెక్సీ లీడర్లు ఉన్నారు. కేసీఆర్‌ది రాష్ట్రానికి మంచి చేయాలనే విజినరీ అయితే, మిగిలిన వాళ్లు టెలివిజన్‌ చర్చల్లో పోటీపడే, టెలివిజినరీలు’’ అని అన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలుస్తామని జబ్బలు చరుచుకున్న కాంగ్రెస్‌ పరిస్థితి ఏమైందని, రాజకీయ ఉద్ధండుడైన జానారెడ్డిపై ఓ యువకుడు గెలవలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో భట్టి విక్రమార్క మాట చెల్లుబాటు కావడంలేదని, గట్టి అక్రమార్కులదే నడుస్తోందని వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడే గట్టి అక్రమార్క అని అన్నారు. వైఎస్‌ షర్మిల పాదయాత్ర గురించి కేటీఆర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా.. ఎక్కడినుంచైనా నడువొచ్చు. హరితహారంలో భాగంగా పెట్టిన చెట్ల గాలి పీల్చుకోవచ్చు. బండి సంజయ్‌ తన పాదయాత్రలో మిషన్‌ భగీరథ నీళ్లు తాగుతూ.. కేసీఆర్‌ పంచిన చేపలు పట్టుకుంటూ.. గొర్రెలను నిమురుతూ.. ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల్లో సేద తీరుతూ కోనసీమలాంటి తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేశారు. వారికి ధన్యవాదాలు. రేపు వీరికి (షర్మిలకు) కూడా ధన్యవాదాలు’’ అని అన్నారు. 


బీజేపీని ఈటల ఓన్‌ చేసుకుంటున్నారా?

ఈటల ఎందుకు రాజీనామా చేశారో చెబుతున్నారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘అసలు బీజేపీని ఈటల ఓన్‌ చేసుకుంటుండా? ఆ పార్టీ ఆయనను ఓన్‌ చేసుకుంటుందా? మాట్లాడితే ఆయన.. జై ఈటల అంటుండు. జై శ్రీరాం.. జై బీజేపీ.. జై మోదీ నినాదాలు ఈటల ఎందుకు చేయటంలేదు?’’ అని నిలదీశారు. బీజేపీ అనే రొచ్చులోకి దిగిన ఈటల..  ఆ బురద అంటొద్దని, చాలా పవిత్రుడినని డైలాగులు కొడితే ఎలా అని ప్రశ్నించారు. తాను రాజీనామా చేస్తేనే వివిధ పథకాలు వస్తాయని ఈటల చెప్పడంలో అర్థం లేదన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే, సీఎం దళిత సాధికారత పథకానికి (ఇప్పుడు దళిత బంధు) బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. హుజూరాబాద్‌ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెస్తారో ఈటల, సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు ఎవరు ఆపినా ఆగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక తర్వాత యథావిధిగా అమలవుతుందన్నారు. 


టీడీపీ తర్వాత టీఆర్‌ఎస్సే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో పార్టీలు వచ్చాయని, కానీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ మాత్రమే విజయవంతంగా నిలదొక్కుకున్నాయని కేటీఆర్‌ అన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌, ఇప్పుడు కేసీఆర్‌ ఒక తరం నాయకుల సృష్టికర్తలని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ గాలివాటం పార్టీ కాదని, తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే ఎలాగైతే, దశాబ్దాలుగా అక్కడి ప్రజల గొంతుకగా నిలిచిపోయాయో, అలాగే టీఆర్‌ఎ్‌సను కూడా దీర్ఘకాలంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడే స్వీయ రాజకీయ అస్తిత్వంగా తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు. నవంబరు 15 తర్వాత తనతోపాటు పార్టీ ప్రతినిధి బృందం తమిళనాడుకు వెళ్లి, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల నిర్మాణం, నిర్వహణపై  అధ్యయనం చేస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ నవ్వుతూ..‘నేను ఎందుకు పోటీ చేస్తా? లేనిపోని పంచాయితీ పెడుతున్నవ్‌!’ అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎ్‌సలో స్పర్థలు.. పార్టీ బలానికి సంకేతమని అన్నారు. ఏ బలంలేని, గెలిచే అవకాశంలేని వాళ్లే కొట్లాడుకుంటుంటే, గ్యారంటీగా గెలుస్తామనే టీఆర్‌ఎ్‌సలో అక్కడక్కడా బహుళ నాయకత్వం, విభేదాలు ఉండడం సహజమేనని తెలిపారు. వాటిని సర్దుబాటు చేసే తెలివి తమ పార్టీ నాయకత్వానికి ఉందన్నారు. 


వచ్చే నెల 15న ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దు 

వరంగల్‌లో నవంబరు 15న టీఆర్‌ఎస్‌ నిర్వహించే విజయగర్జన సభకు ఆరేడు వేల ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోబోతున్నామని కేటీఆర్‌ తెలిపారు. దీంతో ఆర్టీసీలో ప్రయాణించే ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, ఆ రోజు ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ప్రజలు తమకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో వచ్చే 15-20 రోజుల్లో కరోనా టీకా వేసుకోవటానికి ముందుకొచ్చిన వారికి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని, దీంతో వరంగల్‌ సభకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇక పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుల నియాకంపై కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్ర కమిటీదే నిర్ణయమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని, హైదరాబాద్‌, వరంగల్‌లో నగరపార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. నీట్‌ రద్దు చేయాలనే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే డిమాండ్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మన రాష్ట్రంలో విద్యార్థులకు ఏది లాభమో, దానినే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఎవరిపైనా గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించాల్సిన అవసరం తమకు లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులను స్వాగతించామని, ఇప్పడు బీజేపీ విషయంలోనూ అదే చేస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎ్‌సపై కొందరు గుడ్డి వ్యతిరేకతతో మాట్లాడుతున్నారని, అది మంచిది కాదని అన్నారు. 


ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం పెంచాలంటున్నారు

టీఆర్‌ఎ్‌సకు చెందిన వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం పెంచాలని కోరుతున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో వెళ్తారనే ప్రచారంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఇది చాలా రోజులుగా అంటున్నారు. దేనికైనా సమయం, సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుందో తెలియదు. కానీ, ఇప్పుడు మా తక్షణ లక్ష్యం టీఆర్‌ఎస్‌ ప్లీనరీ. ఆ తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నిక. తదుపరి వరంగల్‌ సభ’’ అని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు నారాజ్‌గా ఉంటే తాము ఇన్ని ఎన్నికల్లో ఎలా గెలుస్తామని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ గెలిస్తే మీడియాకు వార్త కాదని అన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  హుజూరాబాద్‌ ఒకటి మాత్రమేనన్నారు. ఈ ఉప ఎన్నిక ప్రచారానికి తాను వెళ్లడంలేదని తెలిపారు. ఇందుకు విపరీత అర్థాలు తీయాల్సిన అవసరం లేదన్నారు. నాగార్జునసాగర్‌, దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి కూడా తాను వెళ్లలేదని గుర్తుచేశారు. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ప్రచారం ఉండొచ్చని, తేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. గ్రామ పంచాయతీలకు 2004-14 మధ్యకాలంలో కంటే గడిచిన ఏడున్నరేళ్లలో ఎక్కువ నిధులు ఇచ్చామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఒకవేళ ఎక్కడైనా ఇవ్వకపోతే, సమీక్షించుకోవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చిట్‌చాట్‌లో మంత్రులు పువ్వాడ అజయ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, భానుప్రసాదరావు, ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T08:00:44+05:30 IST