Inter పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. మొబైల్‌యాప్‌లో పరీక్ష కేంద్రం గుర్తింపు

ABN , First Publish Date - 2022-04-30T14:33:44+05:30 IST

Inter పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. మొబైల్‌యాప్‌లో పరీక్ష కేంద్రం గుర్తింపు..

Inter పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. మొబైల్‌యాప్‌లో పరీక్ష కేంద్రం గుర్తింపు

  • మూడు ఫీట్ల బెంచీకి ఒకరు.. ఐదు ఫీట్లయితే ఇద్దరు
  • గదికి 25మంది విద్యార్థులు 
  • సీసీ కెమెరాల పర్యవేక్షణ
  • మొబైల్‌యాప్‌లో పరీక్ష కేంద్రం గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో ఇంటర్‌ వార్షిక పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మే ఆరు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడా బెంచీలు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లకు డ్యూటీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేసవితీవ్రత, ఉక్కపోతను దృష్టిలో ఉంచుకుని గదుల్లో ఫ్యాన్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సెంటర్‌లో ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గదుల ఎదుట షామియానాలు ఏర్పాటు చేసి ఎండవేడి గదుల్లోకి రాకుండా చూస్తున్నారు. జలమండలి ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా, జీహెచ్‌ఎంసీ, మునిసిపాలిటీ సహకారంతో గదుల శుభ్రం, శానిటైజేషన్‌ చేయించనున్నట్లు అధికారులు వెల్లడించారు.


సీసీ కెమెరాల నిఘాలో..

ఇంటర్‌ ప్రశ్నపత్రాల సీల్‌ తెరిచినప్పటి నుంచి విద్యార్థులకు అందించేవరకు, వారు పరీక్ష రాస్తున్న తీరును.. ఇలా అన్నింటిని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. మాస్‌కాపీయింగ్‌ను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా మొబైల్‌ యాప్‌ ద్వారా సెంటర్‌ లోకేషన్‌ గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. యాప్‌ సాయంతో గైర్హాజరైన విద్యార్థుల లెక్కింపును సులువుగా చేయనున్నారు. మరో రెండు రోజుల్లో యాప్‌ వివరాలను ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. 


3,76,245 మంది విద్యార్థులు..

ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధుల్లో 3,76,245 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 234 పరీక్షా కేంద్రాల్లో ఫస్టియర్‌, సెకండియర్‌లో కలిపి 1,53,119 మంది, రంగారెడ్డి జిల్లాలోని 156 కేంద్రాలలో 1,15,366 మంది, మేడ్చల్‌ జిల్లాలోని 127 పరీక్షా కేంద్రాల్లో 1,07,760 మంది పరీక్షలు రాయనున్నారు. కాగా, ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించామని, మూడు ఫీట్ల బెంచీకి ఒకరు, 5 ఫీట్ల బెంచీకి ఇద్దరు విద్యార్థుల చొప్పున సీటింగ్‌ కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, సెంటర్ల సంఖ్యకు సమానంగా డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు పనిచేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయం కంటే అరగంట ముందే చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించేలేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-30T14:33:44+05:30 IST