పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-09-19T04:56:56+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జాతీయరహదారి పక్కనున్న బ్రహ్మయ్య ఇంజనీరింగు కళాశాలలో ఆదివారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

 కోవూరు, సెప్టెంబరు18:  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు  జాతీయరహదారి పక్కనున్న బ్రహ్మయ్య ఇంజనీరింగు కళాశాలలో ఆదివారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు సిబ్బందికి అధికారులు  శిక్షణ ఇచ్చారు. మండలంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల్ని ఎంపీడీవో శ్రీహరి పర్యవేక్షించి తగు సూచనలిచ్చారు. పోలీసులు సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు.  మండలంలో ఒక జడ్పీటీసీ, 22 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏడాది క్రితం జరిగిన ఎన్నికలు కావడంతో గ్రామాల్లో గెలుపోటములపై పెద్దగా శ్రద్ధగా పెట్టడం లేదు.

విడవలూరు, : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు  సజావుగా సాగడానికి రాజకీయ పార్టీ నేతలు సహకరించాలని ఎంపీడీవో సింగయ్య , తహసీల్దారు చంద్రశేఖర్‌ కొరారు. స్థానిక మండలప్రజా పరిషత్‌ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఓట్ల లెక్కింపునకు  హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు తప్పని సరిగా కొవిడ్‌  పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒకవేళ వ్యాక్సిన్‌ వేయించుకుని ఉంటే  ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, సీపీఎం నాయకులు సత్యవోలు సత్యంరెడ్డి, బెజవాడగోవర్దన్‌రెడ్డి, తూళ్లూరు గోపాల్‌  పాల్గొన్నారు.

ఏజెంట్ల ఎంపికలో తలమునకలు

బుచ్చిరెడ్డిపాళెం : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏజెంట్లను ఎంపిక చేసుకునే ప్రక్రియలో వివిధ రాజకీయ పార్టీలు శనివారం తలమునకలయ్యాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలకుగాను 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 5 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో జొన్నవాడ, పెనుబల్లి, మినగల్లు, చెల్లాయపాళెం, రేబాల బిట్‌ 1 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎంపీపీ, జడ్పీటీసీ పీఠాలు ఎవరికి దక్కుతాయోననే చర్చలు మండలంలో ఊపందుకున్నాయి. ఆదివారం సాయంత్రం వచ్చే ఫలితాలతో ఉత్కంఠకు,  చర్చలకు తెరపడనుంది.

మనుబోలు : పరిషత్‌ ఎన్నికల లెక్కింపు ప్రక్రియనకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం మండలంలోని ఆరు ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులు, వారిని బలపరిచిన రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనుపర్తిపాడులో ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్కింపు ఉంటుందన్నారు. ఏజెంట్లు కరోనా పరీక్షలు చేయించుకుని నెగటివ్‌ ఉన్న వారే వెళ్లాలన్నారు. అలాగే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకుని ధ్రువీకరణ పత్రాలు చూపితేనే అనుమతిస్తారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

కొడవలూరు : మండలంలోని నార్తురాజుపాలెంలో ఉన్న ఆర్‌ఎన్‌ఆర్‌ కళాశాలలో ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తహసీల్దారు రమాదేవి తెలిపారు. శనివారం ఆర్‌ఎన్‌ఆర్‌ కళాశాలలోని కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు రూరల్‌ మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-09-19T04:56:56+05:30 IST