Abn logo
Sep 30 2021 @ 23:54PM

అన్నీ శక్తి స్వరూపాలే!

దేవీ నవరాత్రులు, బతుకమ్మ పండుగ... రెండూ అమ్మవారి ఆరాధనలే! ఆశ్వయుజ మాసంలో సాగే ఈ రెండు వేడుకల్లో... అమ్మవార్లను రోజుకో పేరుతో కొలుస్తారు. దేవీ పూజను పూర్తి శాస్త్రోక్త పద్ధతులతో నిర్వహిస్తే... బతుకమ్మ అచ్చమైన తెలంగాణ జానపద వేడుక. తీరులు వేరైనా కోరుకొనేదీ, వేడుకొనేదీ ఆ తల్లి అనుగ్రహాన్నే!


ఆశ్వయుజ మాసం దేవీ ఆరాధనతో ప్రారంభమవుతుంది. దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ ప్రాంతంలో... ఒక రోజు ముందే బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. ఇది కాకతీయుల కాలం నాటి పండుగ అని చరిత్రకారులు చెబుతున్నారు. దేవీ నవరాత్రులు అంటే శాస్త్రోక్తంగా, నిర్దిష్టమైన నియమ నిష్టలతో కూడిన పూజలు ఉంటాయి. కాగా, పెద్ద, చిన్న, పేద, ధనిక, కులం లాంటి పట్టింపులేవీ లేకుండా, పెద్ద నియమాలేవీ లేకుండా, అందరూ సులువుగా అమ్మవారిని ఆరాధించడానికి ఏర్పాటైనదిగా బతుకమ్మ పండుగను భావించవచ్చు. అందుకే ఇది జానపదుల పండుగ... ప్రధానంగా మహిళలు మాత్రమే చేసుకొనే వేడుక. బతుకును ఇచ్చే తల్లి బతుకమ్మ. ఆమే గౌరీ దేవి, ఆమే శాకంబరి, ఆమే అన్నపూర్ణ. దుర్గమ్మయినా, బతుకమ్మయినా... అన్నీ ఆ శక్తి స్వరూపాలే!దేవీ నవరాత్రులలో... దుర్గా అవతారంలో అమ్మవారు దుష్ట శిక్షణ చేసిన రోజు... ఆశ్వయుజ శుద్ధ అష్టమి. ఆ రోజు నాటికి తొమ్మిది రోజులు పూర్తి కావడానికి వీలుగా... భాద్రపద అమావాస్య రోజున గౌరీ పూజతో బతుకమ్మ పండుగకు శ్రీకారం చుడతారు. నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలవుతాయి. అంతకు ఒక రోజు ముందు... అమావాస్యనాడే బతుకమ్మ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలను దుర్గాష్టమితో సమాప్తం చేస్తే... అప్పటివరకూ ఆట పాటలతో అలసిపోయిన మహిళలకు... పెద్ద పండుగ అయిన దసరాకు ముందు ఒక రోజు విశ్రాంతి దొరుకుతుందన్నది దీని వెనుక ఉద్దేశం కావచ్చు. శ్రీవిద్యోపాసనలో తిథి ‘నిత్య యజనం’ అనే సంప్రదాయం ప్రకారం... అమావాస్య రోజున ఏ దేవత కొలువై ఉంటుందో... అదే దేవత పాడ్యమి రోజున కూడా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున గౌరమ్మను పెట్టి పూజించడం తప్పు కాదన్నది పెద్దల మాట. శ్రీచక్రానికి ప్రతీక

బతుకమ్మ వేడుకల్లో సులువుగా లభించే తంగేడు, గునుగు, బంతి, కట్లపూలు, గన్నేరు, పోకబంతి, సీతజడ, గుమ్మడి లాంటి పూవులే ప్రధానం. వెదురు లేదా ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకులను పరచి, ఏడు దొంతరలుగా... ‘మేరు శ్రీ చక్రం’ ఆకారంలో పూలను ఒక క్రమ పద్ధతిలో పేర్చి, దానిపైన పసుపు గౌరమ్మను ఉంచి కొలుస్తారు. పసుపు పచ్చగా... శ్రీచక్ర ఆకారంలో కొలువైన ఈ బతుకమ్మ... ఒక విధంగా చెప్పాలంటే దశ మహావిద్యలో ప్రస్తావితమైన, పీతాంబరీ దేవి అయిన భగళా రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ దొంతరలు మానవ దేహంలో ఉండే ‘మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార’ చక్రాలకు ప్రతీక. నవరాత్రి ఆరాధనలో ‘షడాధార పంకేరుహాన్తర్విరాజ...’ అని వర్ణించినట్టు... షడాధార పద్మం లోపల బిందు స్వరూపంగా విరాజిల్లుతున్న శ్రీ చక్రాన్ని పూజిస్తే... బతుకమ్మ సంబరంలో... పూలను మేరు శ్రీ చక్రం ఆకారంలో పేరుస్తూ పైన గౌరమ్మను పెట్టి ‘పుష్ప గౌరీ’గా పూజిస్తారు. నవరాత్రి పూజలో సువాసిని, బాల ఆరాధనలు చేస్తారు.


బతుకమ్మ వేడుకల్లో... ఆటలు అయిపోయాక ముత్తయిదువులకు పసుపు, కుంకుమ పెట్టి పూజించే విధానం కనబడుతుంది. దేవీ ఉపాసనను బాలా ఉపాసనతో ప్రారంభించి, పంచదశి, షోడశికి చేరుకుంటారు. అలాగే బతుకమ్మ పండుగలో మొదట బొడ్డెమ్మకు బాలలతో పూజలు చేయిస్తారు. అందులోని కొన్ని పూలను అమావాస్య నాడు పేర్చే బతుకమ్మలో వేసి... ‘ఎంగిలి పువ్వుల బతుకమ్మ’గా అమ్మవారిని కొలుస్తారు. బతుకమ్మ చుట్టూ మహిళలు పాటలు పాడుతూ, లయబద్ధంగా అడుగులు వేస్తారు. దీన్ని ‘ఆట’ అంటారు కానీ చేసేది పూజే! కాబట్టే చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడరు. 


‘‘అమ్మవారి పాదధూళి సోకితే చాలు... ‘జ్ఞానం’ అనే వెలుగుతో అజ్ఞానపు చీకట్లు తొలగుతాయ’’ని శంకరాచార్యులు పేర్కొన్నారు. అదే రీతిలో ‘‘నీ పాద ధూళి కాస్త మాపై పడినా చాలు తల్లీ’’ అంటూ బతుకమ్మల చుట్టూ వృత్తాకారంలో మహిళలు పాటలు పాడతారు. అలాగే ‘లలితా సహస్రనామ స్తోత్రం’లో ‘మరాళీ మందగమనా’ అనే భావానికి నిర్వచనంలా... మహిళలు అడుగులో అడుగు వేస్తూ, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆరాధించడం కనిపిస్తుంది. ‘శ్రీచక్రం’ అనే భావనతో పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి పద్మాన్ని సమర్పించాలి కదా! అందుకే బతుకమ్మ ఆటలో... మహిళలు అందరూ చేతులు కలిపి నిలబడి, చప్పట్లు కొట్టి, మళ్ళీ కిందికి వంగి చప్పట్లు కొట్టి, పైకి లేస్తూ, నెమ్మదిగా అడుగు కదుపుతూ... వృత్తాకారంలో తిరుగుతూ ఉంటే.. పద్మం ముడుచుకున్నట్టూ, అంతలోనే విచ్చుకున్నట్టూ ఉంటుంది. ‘‘మా చేతులనే పద్మాలుగా సమర్పించుకుంటున్నాం’’ అంటూ వాళ్ళు చేసే ఈ పూజ నిష్కల్మషమైన భక్తికి తార్కాణం.


చైతన్యాన్ని నింపే పూజ

నవరాత్రి పూజలో నవావరణ పూజ, చతుష్షష్ఠి, షోడశోపచార పూజలు చేస్తే... బతుకమ్మ సంబరాల్లో... పాటల రూపంలో ‘శ్రీ గౌరీ నీ పూజ ఉయ్యాలో’ అంటూ మొత్తంగా గౌరీ పూజ చేయడం కనిపిస్తుంది. దీనిలో మేలుకొలుపు పాటల నుంచి ఇతిహాస కథలు, చారిత్రక విషయాలు, వీరగాథల వరకూ.. ఎన్నెన్నో చోటు చేసుకుంటాయి. 


త్వమర్క, త్వమిందు, త్వమగ్ని

గురుస్త్వం, శివస్త్వం చ శక్తి స్త్వమేవ


‘‘నీవే గురువు, నీవే దైవం, నీవే బంధువు, నీవే అగ్ని, నీవే సూర్యుడు, నీవే చంద్రుడు’’ అంటూ ‘సర్వస్వం నీవే’ అని  నవరాత్రి పూజలో దేవీ ఉపాసకులు కీర్తిస్తూ ఉంటే... ‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయెప్పునే గౌరమ్మ’’ అంటూ... ‘‘ప్రతి పువ్వు, కాయ, ఇసుక... ఇలా ఆణువణువులో నీవే ఉన్నావు’’ అని ప్రకృతిని ప్రేమిస్తూ గౌరమ్మను పూజిస్తారు.


మరో విశేషం ఏమిటంటే... బతుకమ్మ వేడుకల్లో ఉపయోగించే పూలన్నీ... పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, ఎన్నో ఒడుదొడుకులను తట్టుకొని... రాళ్ళల్లో, రప్పల్లో మొలిచేవే. అలాంటి పూలతో అమర్చిన బతుకమ్మను పూజించడం వెనుక ఆంతర్యం... ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా తట్టుకొని, గౌరవప్రదమైన స్థానంలో నిలవాలనే చైతన్యాన్ని మహిళల్లో నింపడమేనని చెప్పవచ్చు.  ఈ వేడుకల్లో ఆఖరి దినమైన ‘సద్దుల బతుకమ్మ’ నాడు... తొమ్మిది రకాల సద్దులు కలిపి, తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించి, అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా సంభావించి, ఒడిబియ్యం కట్టి సాగనంపడం ఎంతో ముచ్చటైన దృశ్యం.


బతుకమ్మ పండుగలో ఎన్నో నిగూఢమైన అర్థాలు, ఆరోగ్య సూత్రాలు, నిమజ్జనంతో జలశుద్ధి చేయడం, మహిళల్లోని అంతర్గత శక్తిని బయటకు తీయడం, వారికి ఆరుబయట ఆడిపాడే స్వేచ్ఛ అందించడం లాంటి అనే ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. అవే ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టాయి.బతుకమ్మ వేడుకల్లో ఉపయోగించే పూలన్నీ... పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, ఎన్నో ఒడుదొడుకులను తట్టుకొని... రాళ్ళల్లో, రప్పల్లో మొలిచేవే. అలాంటి పూలతో అమర్చిన బతుకమ్మను పూజించడం వెనుక ఆంతర్యం... ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా తట్టుకొని, గౌరవప్రదమైన స్థానంలో నిలవాలనే చైతన్యాన్ని మహిళల్లో నింపడమేనని చెప్పవచ్చు. 

 కళ్యాణి శాస్త్రుల