సమస్తం పర్యావరణ హితం

ABN , First Publish Date - 2020-08-22T06:01:48+05:30 IST

కరోనా కాలంలో ఇదివరకటిలా బయటకు వెళ్ళడానికి జనం భయపడుతున్నారు.పండుగలన్నా,

సమస్తం పర్యావరణ హితం

కరోనా కాలంలో ఇదివరకటిలా బయటకు వెళ్ళడానికి జనం భయపడుతున్నారు.పండుగలన్నా, వేడుకలన్నా వెనుకడుగు వేస్తున్నారు.ఇలాంటి పరిస్థితిలోంచీ వినూత్నమైన అవకాశాన్ని సృజనాత్మకమైన యువత అందిపుచ్చుకుంది.


ఈ ఏడాది వినాయక చవితి పూజా సామగ్రి కోసం బయట అడుగుపెట్టనక్కర్లేకుండా ఇంటి ముంగిటికే అన్నీ అందించింది. ఈ పూజా కిట్ల వ్యాపారుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల నుంచి ఔత్సాహిక వాణిజ్యవేత్తలు ఉన్నారు.


‘‘పండుగ ఎలా? అనే బెంగ పడకండి. మీకు కావలసినవి అందించడానికి మేమున్నాం’’ అంటూ ఈ ఏడాది వినాయక చవితికి పూజా కిట్స్‌ను ఇంటికే చేర్చాయి వివిధ సంస్థలు. కరోనా భయం వెంటాడుతున్న వేళ ఆన్‌లైన్‌లో క్లిక్‌ చేసి ఆర్డరిస్తే, ఒక రోజు ముందే వినాయక విగ్రహం, పూజా సామగ్రి అందించాయి. గతంలో కూడా ఈ విధంగా వినాయక పూజా కిట్ల అన్‌లైన్‌ వ్యాపారాన్ని ఒకరిద్దరు చేశారు.


అయితే ‘కొవిడ్‌-19’ ప్రభావం ఉద్యోగ, ఉపాఽధి, వ్యాపారాల మీద తీవ్రంగా పడడంతో కొత్త అవకాశాలను సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్న యువత దీన్ని ఆశావహమైన మార్గంగా ఎంచుకున్నారు. అంతేకాదు, కొన్ని కార్పోరేట్‌ సంస్థలు సైతం ఈసారి గణేశ పూజాకిట్ల సరఫరాలోకి దిగాయి. 


నవతరానిదే హంగామా...

కరోనా వల్ల ఆన్‌లైన్‌లో వినాయక పూజా కిట్‌లకు గిరాకీ బాగా పెరిగింది. వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు ఈ విక్రయాలకు వేదికయ్యాయి. ‘‘నాలుగేళ్లగా వినాయక పూజా కిట్‌లను విక్రయిస్తున్నాను. ఈసారి కరోనా కారణంగా ఎలా ఉంటుందోనని భయపడి కేవలం 1,000 మాత్రమే ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టాను. ఊహించని స్పందన వచ్చింది’’ అని అంటారు ఆరాధ్య కిట్స్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల స్వామి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన వేణుగోపాల్‌ గత నాలుగేళ్ళుగా వినాయక పూజా కిట్లను విక్రయిస్తున్నారు.


ఆయనే కాదు వాట్సాప్‌ లాంటి మాధ్యమాలు, డిజిటల్‌ మార్కెటింగ్‌ ద్వారా ఈసారి వినాయక పూజా కిట్స్‌ను నగరవాసులకు చేరువ చేసిన వారు చాలామందే ఉన్నారు. ఈ ఏడాది తొలిసారి చరక డెయిరీ ద్వారా సుమారు 750 ఎకోఫ్రెండ్లీ పూజా కిట్లను  వినయ్‌ విక్రయించారు. 


మట్టి విగ్రహాలకు పట్టం!

ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో విస్పష్టంగా కనిపించిన మరో విశేషం... పర్యావరణ స్పృహ. పర్యావరణ ప్రేమికులు గతంలో ఎంత మొత్తుకున్నా స్పందించని వారు కూడా ఇప్పుడు మట్టి విగ్రహాలకు జై కొట్టారు. అమ్మకాల్లో వాటిదే అగ్రస్థానం. గణపతి పూజలో అత్యంత కీలకమైన పత్రినీ, ప్రసాదాలనూ అందించే బ్యాగుల విషయంలో కూడా ఆన్‌లైన్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జాగ్రత్తలు తీసుకున్నాయి.


మట్టి విగ్రహాలను, పూజాకిట్‌ను జ్యూట్‌ లేదా బయోడీగ్రేడబల్‌ బ్యాగ్‌లలో అందించాయి. అలాగే మట్టి విగ్రహాలలో విత్తనాలను జోడించి విక్రయించిన  వారూ అధికంగానే ఉన్నారు. ‘వినాయకునికి మొక్కండి... నిమజ్జనం చేసి మొక్కలను పెంచండి’ అంటూ యువత సోషల్‌ మీడియాలో బాగానే ప్రచారం చేసింది. 


సంప్రదాయాలపై పెరిగిన ఆసక్తి

పూజ చేసినప్పుడు అంతా సంప్రదాయబద్ధంగా ఉండాలన్న ఆలోచన యువతలో పెరుగుతోంది. గణేశుణ్ణి పూజించే ‘ఏకవిశంతి పత్రాల’ కోసం ఈసారి ఎంతోమంది ఆరాతీశారు.  వినాయక పూజలో కీలకమైన 21 పత్రాలకూ ఔషధ గుణాలు ఉన్నాయి. నేటి తరం ఆ సంగతి గుర్తిస్తోంది.


అందుకే మూడు వేల కిట్లు అమ్మకానికి పెడితే వారం లోపే విక్రయమై పోయాయి’ అన్నారు వేణుగోపాలస్వామి. ‘‘వీలైనంత వరకూ 21 పత్రాలనూ అందించేందుకు ప్రయత్నించాం. అయితే దేవదారు లాంటి పత్రాలు దొరకలేదు. ఆ విషయాన్ని ముందుగానే భక్తులకు చెప్పేశాం’’ అన్నారు వినయ్‌. 

 పులగం గిరి





డిమాండ్‌ కరోనా వల్లే!

‘‘మాది మంగళగిరి దగ్గరలోని ఆత్మకూరు. అక్కడ ఈ పత్రి సేకరించి ఒక రోజు ముందుగానే నగరవాసులకు అందించాం. 21 రకాల పత్రితో పాటుగా మట్టి విగ్రహం, పూజకు కావాల్సిన సామాగ్రి ఉండే ఈ కిట్‌ పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. గతంతో పోలిస్తే చాలా వేగంగా ఈ సారి బుకింగ్స్‌ పూర్తయ్యాయి. ఈ డిమాండ్‌ అంతా కరోనా పరిస్థితుల వల్లనే అనుకుంటున్నాం.’’

- వేణుగోపాల స్వామి, వ్యవస్థాపకుడు, 

ఆరాధ్య ఎంటర్‌ప్రైజెస్‌





గోమూత్రం కూడా...

‘‘ఈ ఏడాది తొలిసారిగా ‘మహా గణేశ్‌ పూజా కిట్‌’ పేరిట 750 కిట్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయించాం. చాలామంది విగ్రహం, పూజా కిట్‌ అందిస్తున్నారు. కానీ, మేమైతే పండ్లు, పూజా సామాగ్రి సహా పూజలో అవసరమైనవన్నీ అంటే గోమూత్రం, పంచామృతాలు కూడా అందించాం. కరోనా కారణంగా అమ్మకాలు ఎలా ఉంటాయోనని కాస్త భయపడ్డాం. కానీ, స్పందన బాగుంది.’’

- వినయ్‌, 

చరక డెయిరీ 


Updated Date - 2020-08-22T06:01:48+05:30 IST