ముడి బియ్యంపై అంతా తూచ్‌!

ABN , First Publish Date - 2022-08-13T08:59:32+05:30 IST

యాసంగి ఽధాన్యం మిల్లింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది.

ముడి బియ్యంపై అంతా తూచ్‌!

  • ఉప్పుడు బియ్యం ఉత్పత్తి, మిల్లింగ్‌కే రాష్ట్రం ప్రాధాన్యం
  • కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో నష్ట నివారణ చర్యలు
  • 14 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ రైస్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
  • మరో 20 లక్షల టన్నులకు అనుమతిస్తే గండం గడిచినట్లే..!
  • చివరిదాకా చూసి వడ్లు మిగిలితే టెండర్లకు వెళ్లాలని యోచన


హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): యాసంగి ఽధాన్యం మిల్లింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. కేంద్రం పెట్టిన నిబంధన మేరకు ఎఫ్‌సీఐకి ముడి బియ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లుచేసిన రాష్ట్ర సర్కారు... ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఉప్పుడు బియ్యం ఉత్పత్తికే ప్రాధాన్యం ఇస్తోంది. ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవటానికి కేంద్రం సుముఖంగా ఉండటంతో... ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే అతి తక్కువ నష్టంతో యాసంగి సమస్య నుంచి బయటపడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గడచిన యాసంగి సీజన్‌లో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఉప్పుడు బియ్యం నిల్వలు భారీగా ఉన్న నేపథ్యంలో... కేంద్రం గతేడాది నుంచి బాయిల్డ్‌ రైస్‌ సేకరణను ఆపేసింది. అయితే రాష్ట్రానికి కాస్తో కూస్తో మినహాయింపులు ఇస్తూ గతేడాది వరకు బియ్యం సేకరించింది. గడచిన యాసంగి ధాన్యాన్ని మాత్రం ముడి బియ్యం రూపంలో ఇస్తేనే తీసుకుంటామని తెగేసి చెప్పింది. 


కొద్దిరోజులు కేంద్రంపై పోరాటం చేసిన రాష్ట్ర ప్రభుత్వం... చివరకు కేంద్రం కోరినట్లు రా రైస్‌ ఇస్తామని ప్రకటించింది. కానీ యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే సగానికి సగం నూకలు వస్తాయని రైస్‌ మిల్లర్లు పేచీ పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో కమిటీ వేసింది. మిల్లర్లతో ముడి బియ్యం ఉత్పత్తి చేయిస్తే... రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.1,500 కోట్ల ఆర్థిక భారం పడుతుందని కమిటీ తేల్చడంతో సర్కారులో అలజడి మొదలైంది. దీంతో ధాన్యం మిల్లింగ్‌ పద్ధతిని మార్చుకొని నష్టాన్ని తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పౌరసరఫరాల సంస్థకు సూచించటంతో బాయిల్డ్‌ రైస్‌ మిల్లింగ్‌ మొదలుపెట్టారు. అంతేగాక యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్‌ చేస్తే పక్కాగా 68 కిలోల బియ్యం వస్తాయి. దీనికి ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ (ఎఫ్‌ఆర్‌కే) కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం రాదు. మరోవైపు రైస్‌ కెర్నల్స్‌కు కూడా కేంద్రం డబ్బులు చెల్లిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడే అవకాశం ఉండదు. ఈక్రమంలోనే ముడి బియ్యం ఉత్పత్తికి స్వస్తి చెప్పినట్లు సమాచారం.


మరో 20 లక్షల టన్నులకు అనుమతిస్తే సరి

కాగా... యాసంగి ధాన్యంలో 4.95 లక్షల టన్నుల ధాన్యం భారీ వర్షాలకు పూర్తిగా తడిసింది. ఈ ధాన్యం ముడి బియ్యం ఉత్పత్తికి అక్కరకు రాదు. అందుకే పాక్షికంగా తడిసిన మరో 2.5లక్షల టన్నుల ధాన్యాన్ని కలిపి మొత్తం 7.5 లక్షల టన్నుల ఽధాన్యాన్ని మిల్లింగ్‌చేసి బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైస్‌ మిల్లర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈలోగా కేంద్రం నుంచి 8 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ రైస్‌ సేకరణకు అనుమతి వచ్చింది. గతంలో 6లక్షల టన్నులకు అనుమతి రావడంతో మొత్తం 14 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ కోటా రాష్ట్రానికి వచ్చినట్లయ్యింది. అయితే రాష్ట్రం కొనుగోలుచేసిన 50 లక్షల టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్‌ మిల్లింగ్‌ చేస్తే... 34 లక్షల టన్నుల రైస్‌ వస్తుంది. ఇందులో 14 లక్షల టన్నులు కేంద్రానికి పోతే ఇంకా 20 లక్షల టన్నుల బియ్యం మిగులుతాయి. ప్రస్తుత టార్గెట్‌ను పూర్తిచేసి, ఓ నెల తర్వాత కేంద్రం నుంచి మరో 10 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ రైస్‌కు అనుమతి తెస్తామనే ధీమాను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ వ్యక్తంచేశారు. ఆ తర్వాత మరో 10 లక్షల టన్నులకు అనుమతులు తెచ్చుకుంటే యాసంగి సమస్య పూర్తిగా కొలిక్కివస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ మొత్తం ధాన్యానికి కేంద్రం అనుమతులు ఇవ్వకపోతే... అప్పుడే ప్రత్యామ్నాయంగా టెండర్లు పిలవాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తిపైనే దృష్టిసారించాలని పౌరసరఫరాల సంస్థకు, రైస్‌ మిల్లర్లకు సీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

Updated Date - 2022-08-13T08:59:32+05:30 IST