ఎడారిని అత్యద్భుతంగా మార్చిన దుబాయ్.. 8 ఏళ్ల శ్రమతో ప్రపంచ అద్భుత లోకం సృష్టి!

ABN , First Publish Date - 2021-10-03T18:28:33+05:30 IST

దుబాయ్.. ఒకప్పుడు దట్టమైన ఎడారి ప్రాంతం. ఇసుక తప్ప చుక్క నీరులేని ఎడారి దిబ్బ. కానీ, ఇప్పుడు అదే దుబాయ్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించింది. అందమైన కట్టడాలతో అదరహో అనిపిస్తోంది. ఆ ఆకాశహర్మ్యాలను చూస్తుంటే మనల్ని మనమే మైమరిచిపోతాం. అసలు ఎడారిలో కూడా ఇంత..

ఎడారిని అత్యద్భుతంగా మార్చిన దుబాయ్.. 8 ఏళ్ల శ్రమతో ప్రపంచ అద్భుత లోకం సృష్టి!

ఎన్నారై డెస్క్: దుబాయ్.. ఒకప్పుడు దట్టమైన ఎడారి ప్రాంతం. ఇసుక తప్ప చుక్క నీరులేని ఎడారి దిబ్బ. కానీ, ఇప్పుడు అదే దుబాయ్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించింది. అందమైన కట్టడాలతో అదరహో అనిపిస్తోంది. ఆ ఆకాశహర్మ్యాలను చూస్తుంటే మనల్ని మనమే మైమరిచిపోతాం. అసలు ఎడారిలో కూడా ఇంత అభివృద్ధి చేయగలరని ఎవరు ఊహించలేదు. దుబాయ్‌లో ప్రతీది అద్భుతమనే చెప్పాలి. దీనికి కారణం అక్కడి పాలకులు చాలా తక్కువ సమయంలో పక్కా ప్రణాళికతో దుబాయ్‌ను అభివృద్ధి చేయడమే. దీంతో దుబాయ్ ఇప్పుడు ప్రపంచ ప్రముఖ నగరాలలో ఒకటిగా ఉంది. తాజాగా దుబాయ్‌లో మరో అందమైన అద్భుతమైన లోకాన్ని సృష్టించారు. అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కోసం ఈ అత్యద్భుతమైన సృష్టి జరిగింది. అదే.. దుబాయ్ ఎక్స్‌పో 2020.


ఇంతకుముందు ఇసుక తప్ప మరేమి లేని ఈ ప్రాంతం రూపురేఖలను మార్చేసింది దుబాయ్. అంతకుమించి అనే లెవెల్‌లో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే, దీని వెనుక 8ఏళ్ల శ్రమ, కోట్లాది రూపాయల వ్యయం ఉన్నాయి. దానికితోడు అద్భుతమైన ప్రణాళిక వెరసి మధ్య ప్రాచ్యం(Mideast)లోని తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌కు వేదికగా మారింది. ఎనిమిదేళ్ల క్రితం వరకూ అంతా ఎడారి ప్రాంతం. అసలీ ఎడారి ప్రాంతంలో ఇంత అద్భుతమైన ఎక్స్‌పో ఎలా అనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు ఇదే తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌గాను రికార్డుకెక్కింది. 1080 ఎకరాల్లో ఏర్పాటైనా ఈ ఎగ్జిబిషన్ కన్నులపండువగా ఉంది. మొత్తం 192 దేశాలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్నాయి. సుస్థిరత, అవకాశాలు, మొబిలిటీ అనే మూడు థీమ్స్‌పై వివిధ దేశాల సంస్థలు తమ వినూత్న ఆలోచనలను ఈ ఎక్స్‌పోలో పంచుకోనున్నాయి. దుబాయ్‌లో పర్యటకాన్ని ప్రోత్సహించడంతో పాటూ అభివృద్ధిలో కొత్త అవకాశాలను సృష్టించడమే ఈ ఎక్స్‌పో ఏర్పాటు వెనక ప్రభుత్వానికి ఉన్న ముఖ్య ఉద్దేశం. 


ఆఫ్రికన్ ఫుడ్ హాల్, 20 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల పొడవైన ఇటలీ తాడు, ఈజిప్షియన్ మమ్మీ, స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రెప్లికా, టాన్స్‌ఫార్మర్‌లా మారే చైనా కారు, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్ హీరో డేవిడ్ త్రీడీ బొమ్మ, అమెరికా మూడవ అధ్యక్షుడు వాడిన పవిత్ర ఖురాన్ వంటివి ప్రదాన ఆకర్షణలుగా ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో చూడనున్న ప్రోటో‌టైప్‌లు కూడా ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. ఇంతటి భారీ ఎగ్జిబిషన్‌ను ఇప్పటి వరకూ యూరోప్, అగ్రరాజ్యం అమెరికాలో మినహా మరెక్కాడ నిర్వహించలేదు. ఈ నెల 1న ప్రారంభమైన దుబాయ్ ఎక్స్‌పో 2020.. వాస్తవానికి గతేడాది ప్రారంభం కావాల్సింది. కానీ, మహమ్మారి కరోనా సంక్షోభం వల్ల వాయిదా పడింది. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఆరు నెలల పాటు ఈ భారీ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఇంకేందుకు ఆలస్యం.. వీలైతే మీరూ ఒకసారి ఈ అద్భుతలోకంలో విహరించి రండి. 









Updated Date - 2021-10-03T18:28:33+05:30 IST