యంగ్ టైగర్ యన్టీఆర్, అజేయ దర్శకుడు కొరటాల శివ కలయికలో త్వరలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఇద్దరి కాంబో సెట్ అవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్‌కు ఇది 30వ చిత్రం. గతేడాది ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీతో యన్టీఆర్, ‘ఆచార్య’ చిత్రంతో కొరటాల బిజీగా ఉన్న కారణంగా ఇంత వరకూ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. త్వరలోనే సినిమా గ్రాండ్ గా లాంఛయి, వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథానాయిక గురించి కొద్ది రోజులుగా రకరకాల వార్తలొస్తున్నాయి. ముందుగా హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు వినిపించగా.. ఆ తర్వాత జాన్వీ కపూర్ పేరు కూడా వచ్చింది. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ పేరు వార్తల్లో నిలుస్తోంది.
రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో మొట్టమొదటి సారిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ .. యన్టీఆర్ 30 లో కథానాయికగా నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఆలియా భట్ కథానాయికగా నటిస్తోందనగానే సినిమాకి మరింతగా హైప్ క్రియేట్ అయింది. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఆలియా యన్టీఆర్ తో నటించినప్పటికీ.. అందులో ఆమె రామ్ చరణ్ జోడీగా నటించింది. ఇప్పుడు కొరటాల శివ సినిమాతో కథానాయికగా నటిస్తుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. మరి దీనిపై నిర్మాతల స్పందన ఏంటో?