పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, తాను త్వరలోనే మళ్లీ కలిసి నటిస్తామని సీనియర్ కమెడియన్ అలీ చెప్పారు. వీరిద్దరూ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. పవన్ ప్రతి సినిమాలోనూ అలీ తప్పక కనిపించేవాడు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్, అలీ మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరికొకరు దూరమయ్యారు. అయితే తాజాగా వీరిద్దరూ ఓ పెళ్లి వేడుకలో కలిశారు. అలీ బంధువుల పెళ్లి వేడుకకు పవన్ హాజరయ్యారు. ఆ సందర్భంగా వీరిద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అలీ.. పవన్‌తో విభేదాల గురించి మాట్లాడారు. ``సుస్వాగతం` సినిమాతో మా స్నేహం ప్రారంభమైంది. ఇప్పటివరకూ పవన్ 27 సినిమాలు చేస్తే.. 25 చిత్రాల్లో నేను ఉన్నాను. మా ఇద్దరి మధ్య రాజకీయపరంగా తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలూ లేవు. ఇటీవల మా బంధువుల పెళ్లిలో పవన్‌ను కలిశాను. చాలా సంతోషంగా అనిపించింది. రాజకీయాలు, కరోనా కారణంగా ఏడాదిన్నర నుంచి ఆయణ్ని కలవలేకపోయాను. మధ్యలో ఒకసారి ఆయణ్ని కలుద్దామని ఇంటికి వెళ్లాను. అప్పుడు ఆయన పుణెలో ఉన్నారని తెలిసి వచ్చేశాను. పవన్ మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాదే పవన్ సినిమాలో నేను కనిపిస్తాన`ని అలీ అన్నారు.