Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

‘యమలీల’ మహేశ్‌బాబు చేయాల్సింది... కానీ...

twitter-iconwatsapp-iconfb-icon
యమలీల మహేశ్‌బాబు చేయాల్సింది... కానీ...

ఎందచాట.. కాట్రవల్లీ.. వంటి విచిత్రమైన పదాలు వినపడగానే ప్రేక్షకుల మదిలో అలీ తళుక్కున మెరుస్తారు. సినిమాల్లో కమెడియనగానైనా... కామెడీ హీరోగానయినా తన పాత్రకు పరిపూర్ణ న్యాయం చేస్తారు. సీనియర్‌ కమెడియన్లంటే గౌరవమంటున్న అలీ.. కోట కనపడగానే బాబాయ్‌, బ్రహ్మానందం కనపడితే అన్నయ్యా అంటామంటున్నారు. తనకు అమ్మ సెంటిమెంటు కాస్త ఎక్కువేనంటున్నారు. హీరోల్లాగా ఒకే సినిమాకు నాలుగయిదు నెలలు ఫిక్సవకుండా కమెడియన్లు బాగానే సంపాదిస్తారంటున్న అలీతో 03-1-2011న జరిగిన ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే వివరాలు.... 


‘ఎంద చాట’తోనే బాగా ప్రాచుర్యం వచ్చినట్లుంది?

ఏడేళ్ల పిల్లాడు కూడా ‘చాటగాడు’ అంటే నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. అంబానీ వెళ్తే వందమందే గుర్తుపడతారు. అలీ వెళ్తే లక్షమంది గుర్తుపడతారు. మాకు అదే సిరి. ఏడెనిమిదేళ్ల వయసులో, రాజమండ్రి మిత్రాగారి ఆర్కెస్ట్రాలో.. టీ బ్రేక్‌లో నేను షోలే డైలాగులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ స్టైల్లో చెప్పేవాడిని. తర్వాత డాన్సులు.. అలా సినీరంగ ప్రవేశం జరిగింది. ఎప్పటికైనా మా అమ్మ, నాన్నలను మక్కా పంపాలనుకునేవాడిని. 99లో వెళ్లొచ్చాం. 2000లో నాన్నగారు చనిపోయారు.


మద్యం అలవాటు లేదా?

నాకు అస్సలు అలవాటు కాలేదు. బ్రహ్మానందం గారు ఇప్పటికీ రుచి కూడా చూడలేదు. రేపేంటని ఆలోచించకపోతే తర్వాత బాధలు తప్పవు. అందుకే మేం జాగ్రత్త పడ్డాం. రాజబాబు విపరీతంగా దానాలు చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి.


హీరోలకంటే ఎక్కువ సంపాదించేవాళ్లు ఎవరైనా ఉన్నారా?

హీరో ఒకే సినిమా నాలుగైదు నెలలు చేయాలి. మేం నాలుగైదు రోజులు చేస్తే చాలు. అలా పది సినిమాలు చేస్తాం. ఇండస్ట్రీలో ఇప్పుడంతా వైటే ఇస్తున్నారు కానీ బౌన్స్‌ అయిన చెక్కులు 10-15 ఉంటాయి. దాని మొత్తం పది లక్షలు ఉంటుంది.


మొదట్లో సినిమా కష్టాలు ఉంటాయి. మీ సంగతేంటి?

నేను మద్రాసులో సైకిల్‌ మీద తిరిగేవాణ్ని. నీకు తగ్గ వేషాలు లేవనేవారు. ఎనిమిదేళ్లు అలా కష్టపడ్డా. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్‌ రాఠీగారు నాతో హీరోగా చేయించారు. నిజానికి యమలీల హీరో మహేష్‌బాబు. కానీ కృష్ణగారు రెండేళ్లు ఆగమన్నారు. తర్వాత ఓ సినిమా ఫంక్షన్‌లో నా డాన్సు చూసి, నన్నే హీరో చేసి.. 50 వేలిచ్చారు.


కమెడియన్లను ఎలా చూస్తారు?

హీరోలందరూ మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తారు, హీరోయిన్లతోనే తేడా. వాళ్లు బాంబే కదా. నా పక్కన హీరోయిన్లు కొందరు నిరాకరించారంటే, వాళ్ల మేనేజర్లే అందుకు కారణం. యమలీలలో నటించేందుకు సౌందర్య ఓకే అంది. కానీ, మేనేజర్‌ వద్దన్నాడు.


మీ కెరీర్‌లో బాగా సంతృప్తినిచ్చిన సన్నివేశాలేవి?

ఇటీవల చిరుతలో మసాజ్‌ క్యారెక్టర్‌. వీటికి స్ఫూర్తి బ్యాంకాక్‌లో మసాజ్‌ పార్లర్లే. అక్కడ వాళ్లకి ఇంగ్లీషు పూర్తిగా రాదు. స్ట్రాంగ్‌ అనడానికి సెత్రాంగ్‌, స్లోలీ అనడానికి సలోలీ అంటారు. లక్ష్యంలో సిక్స్‌ ప్యాక్స్‌ ఉన్నట్టు చూపించే లెక్చరర్‌ బెలూన్లు ఊదుకుని లోపల పెట్టుకుంటాడు. దానికీ పేరొచ్చింది. మాకు చెప్పిన డైలాగులే కాక అప్పటికప్పుడు కొన్ని వచ్చేస్తాయి.

ఎంద చాట డైలాగ్‌ అసలెలా వచ్చింది?

జంబలకిడి పంబ సినిమాకు దివాకర్‌బాబు రైటర్‌. అందులో చేసే మలయాళ అమ్మాయి.. ఎంద చాట అంది. ఆమెతో నేను మలయాళంలో మాట్లాడితే, దివాకర్‌బాబు విని.. బాగుందని రాజేంద్రుడు- గజేంద్రుడులో పెట్టారు. నిజానికి ఆ పదానికి అర్థమేంటో నాకే తెలీదు. మలయాళీలో అన్నయ్యని చాట అంటారట. తమ్ముడిని చీపురుకట్ట అంటారా అన్నాను. డైలాగులో సగం మలయాళం, మిగిలిన సగం నా సృష్టి.


మీరు ఆడ వేషాలు వేయాలని ఎలా అనిపించింది?

మేకప్‌ విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. సొట్ట బుగ్గలు కలిసొస్తాయి. 50 సినిమాల్లో ఆడవేషాలు వేశాను.


కమెడియన్ల మధ్య ఐక్యత ఉందా?

ఫీల్డులో మాకు పెద్ద బ్రహ్మానందం, ఎంఎస్‌ నారాయణ. తర్వాత తనికెళ్ల భరణి, ధర్మవరపు, కోట, బాబూమోహన్‌.. వీళ్లు సీనియర్లు. కోట కనపడగానే బాబాయ్‌, బ్రహ్మానందం కనపడితే అన్నయ్యా అంటాం.


మీకు తల్లి సెంటిమెంటు ఎక్కువ కదా.. ఎందుకు?

దాదాపు పదిహేనేళ్లు అమ్మ ప్రేమను కోల్పోయి మద్రాసులో ఉండిపోయా. అమ్మా నాన్నలు చెప్పిన అమ్మాయినే చేసుకున్నా.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.