Alexa Ranking సర్వీసులను నిలిపివేస్తున్న Amazon.. కారణాలు చెప్పకుండానే నిష్క్రమణ..!

ABN , First Publish Date - 2022-01-29T19:39:53+05:30 IST

Alexa Rankings సర్వీసు ఆగిపోవడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై వెబ్‌సైట్‌ వ్యాపార సమాజంలో కొత్త చర్చ జరుగుతోంది. అదే సమయంలో అలెక్సా ర్యాంకింగ్ సర్వీసులను నిలిపివేయడం వెనుక కారణాలు ఏంటన్నది

Alexa Ranking సర్వీసులను నిలిపివేస్తున్న Amazon.. కారణాలు చెప్పకుండానే నిష్క్రమణ..!

‘2022వ సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి మేం మా సేవలను నిలిపివేస్తున్నాం..’.. ఇదీ Alexa Internet కొద్దిరోజుల క్రితం చేసిన ప్రకటన. ఈ పోటీ ప్రపంచంలో ఏ వెబ్‌సైట్‌ను ఎంత మంది చూస్తున్నారు. పోటీ వెబ్‌సైట్ ఏ ర్యాంక్‌లో ఉంది. ఏ దేశంలో పోటీ వెబ్‌సైట్ ఏ స్థానంలో ఉంది..? గత నెలతో పోల్చితే ఈ నెలలో ఎంత మంది నెటిజన్లు వెబ్‌సైట్‌ను వీక్షించారు..? వంటి వివిధ అంశాలను శోధించి దాదాపుగా వాస్తవానికి దగ్గరగా ఉండేలా రిపోర్టును Alexa ఇప్పటి వరకు అందిస్తూ ఉంది. న్యూస్ వెబ్‌సైట్లే కాదు.. ఈ కామర్స్ నుంచి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వరకు అన్ని వెబ్‌సైట్ల ర్యాంకింగ్స్‌ ఎలా ఉన్నాయన్నది ఈ Alexa చెబుతూ ఉంటుంది. అన్ని వెబ్‌సైట్ల కంపెనీలు ఈ Alexa ర్యాంకింగ్స్‌నే ప్రామాణికంగా చూపుతూ.. తమ సంస్థ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా Alexa మాతృ సంస్థ Amazon చేసిన ప్రకటన అందరినీ నివ్వెరపరుస్తోంది. 


బహిరంగ మార్కెట్‌లో Alexa Rankings కు విశ్వసనీయత ఉన్నా, Alexa సర్వీసులకు డిమాండ్ ఉన్నప్పటికీ కొన్ని మిలియన్ల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నప్పటికీ ‘ఈ సర్వీసు నుంచి విరమించుకుంటున్నాం’ అంటూ అమెజాన్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘1996వ సంవత్సరంలో Alexa కంపెనీ ప్రారంభమయింది. 1999వ సంవత్సరంలో అమెజాన్ దీన్ని కొనుగోలు చేసింది. రెండు దశాబ్దాలుగా Alexa.com ద్వారా మెరుగైన సేవలను అందిస్తూ ఉన్నాం. పోటీ ప్రపంచంతో పోటీ పడుతూ కచ్చితమైన రిపోర్టును అందిస్తూ వచ్చాము. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సేవల నుంచి తప్పుకుంటున్నామని చెప్పేందుకు చింతిస్తున్నాము. 2022వ సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుంచి మేము రిటైర్మెంట్ తీసుకుంటున్నాము. ఇన్నాళ్లుగా మమ్మల్ని ఆదరించింనందుకు ధన్యవాదాలు. డబ్బులు కట్టి చందాదారులు అయిన వాళ్లంతా తమ డేటాను తీసుకుని.. అకౌంట్‌ను డిలీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.’ అంటూ Alexa నుంచి కొద్ది రోజుల క్రితమే ఓ ప్రకటన వచ్చింది. వాస్తవానికి గతేడాది డిసెంబర్ 8వ తారీఖు నుంచే అలెక్సా కొత్తగా చందాదారులను చేర్చుకోవడం ఆపేసింది.


Alexa Rankings సర్వీసు ఆగిపోవడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై వెబ్‌సైట్‌ వ్యాపార సమాజంలో కొత్త చర్చ జరుగుతోంది. అదే సమయంలో అలెక్సా ర్యాంకింగ్ సర్వీసులను నిలిపివేయడం వెనుక కారణాలు ఏంటన్నది Amazon వెల్లడించకపోవడంపై నెట్టింట హాట్ టాపిక్ నడుస్తోంది. ఇదే తరహా సర్వీసులను ఇచ్చే ప్లాట్‌ఫామ్స్ ఇటీవల ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. వాటి నుంచి పోటీని ఎదుర్కొంటూనే మార్కెట్లో ఇప్పటికీ అలెక్సా నిలదొక్కుకుంటూ ఉంది. అయినప్పటికీ అమెజాన్ తీసుకున్న నిర్ణయం వెబ్‌సైట్ వ్యాపార సామ్రాజ్యాన్ని నివ్వెరపరుస్తోంది.

Updated Date - 2022-01-29T19:39:53+05:30 IST