TS: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక

ABN , First Publish Date - 2021-10-12T13:23:14+05:30 IST

రాష్ట్రంలో ఈ ఏడాది..

TS: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక

6 పేపర్లతోనే పది పరీక్షలు

ప్రతి సబ్జెక్టుకు ఒక్క పేపర్‌తోనే నిర్వహణ

మొత్తం 600 మార్కులకు పరీక్షలు

ప్రతి పేపర్‌ 80 మార్కులకు.. 

ఎఫ్‌ఏల నుంచి మరో 20 మార్కులు

సిలబస్‌ 70 శాతానికి కుదింపు

పరీక్ష సమయం మరో అరగంట పెంపు

విద్యా శాఖ ఉత్తర్వులు జారీ


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది (2021-22 విద్యా సంవత్సర) పదవ తరగతి పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష పేపర్లను కుదించడంతో పాటు, పరీక్ష సమయాన్ని పెంచారు. అలాగే, 1 నుంచి పదవ తరగతి వరకు సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కారణంగా విద్యా సంస్థలు సరిగ్గా నడవలేదన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు. ఇప్పటికీ విద్యార్థుల హాజరు దాదాపు 50 శాతం మాత్రమే నమోదవుతోంది.


విద్యా సంవత్సరం మొదట్లో 47 రోజుల పాటు డిజిటల్‌ క్లాసులు నిర్వహించారు. తర్వాత 166 రోజుల పాటు ప్రత్యక్ష తరగతులునిర్వహించాలని నిర్ణయించారు. గురుకులాల వంటి విద్యా సంస్థలను ఇంకా తెరవలేదు. ఆయా విషయాలను దృష్టిలో ఉంచుకునే పదవ తరగతి పరీక్షా పేపర్ల సంఖ్యను తగ్గించారు. సాధారణంగా పదవ తరగతి పరీక్షల్లో మొత్తం 11 పేపర్లు ఉండేవి. ఇందులో మొదటి లాంగే వజ్‌లో 2 పేపర్లు, రెండవ లాంగ్వేజ్‌లో ఒక పేపర్‌, థర్డ్‌ లాంగ్వేజ్‌లో (ఇంగ్లిష్‌) రెండు పేపర్లు, మిగిలిన సబ్జెక్టులు మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీ్‌సల్లో రెండు పేపర్ల చొప్పున పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది ప్రతి సబ్జెక్టులో ఒక్కో పేపర్‌తోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి పేపర్‌కు 100 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులు ఉంటాయి. అయితే, ప్రతి పేపర్‌లో 100 మార్కుల్లో 20 మార్కులను ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌(ఎఫ్ఏ)ల నుంచి వేయనున్నారు. మిగిలిన 80 మార్కులను విద్యార్థులు రాసే పరీక్ష పేపర్‌ ద్వారా ఇవ్వనున్నారు. ఈ సారి పరీక్ష సమయాన్ని కూడా పెంచారు. గతంలో ప్రతి పేపర్‌కు 2.45 గంటల సమయం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ సమయాన్ని 30 నిమిషాలు పెంచారు. అంటే, ప్రతి పేపర్‌ పరీక్షకు 3.15 గంటల పాటు సమయాన్ని ఇస్తారు. పదవ తరగతి వార్షిక పరీక్షలను మార్చి-ఏప్రిల్‌ నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది.


ఇంటర్‌లోనూ 70 శాతం సిలబస్‌!

ఇంటర్మీడియట్‌లో కూడా ఈ ఏడాది సిలబ్‌సను 70 శాతానికి కుదించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో కొన్ని మార్పులు తీసుకురానున్నారు. ముఖ్యంగా చాయిస్‌ ప్రశ్నలను రెట్టింపు చేయనున్నారు. గత ఏడాది నిర్వహించలేకపోయిన ఇంటర్‌ ప్రథమ ఏడాది పరీక్షలను ఈ నెల 25 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-10-12T13:23:14+05:30 IST