‘అగ్నిపథ్‌’పై అప్రమత్తం!

ABN , First Publish Date - 2022-06-18T04:39:56+05:30 IST

సైనిక నియామకం ‘అగ్నిపథ్‌’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో

‘అగ్నిపథ్‌’పై అప్రమత్తం!
ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలను పరిశీలిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు

  • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం నేపథ్యంలో అలర్ట్‌ 
  • ఉమ్మడి జిల్లాలోని రైల్వేస్టేషన్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత
  • అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల పహారా
  • పలు రైళ్ల రాకపోకలు బంద్‌, కొన్ని దారి మళ్లింపు 
  • ఇబ్బందిపడిన ప్రయాణికులు


సైనిక నియామకం ‘అగ్నిపథ్‌’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. పలు రైళ్లను తగలబెట్టారు. స్టేషన్‌లోని షాపులను ధ్వంసం చేశారు. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్ల వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. స్టేషన్‌లోకి వచ్చిపోయే వారిని తనిఖీ చేశారు. పోలీస్‌ ఉన్నతాధికారులు రైల్వే స్టేషన్ల వద్ద నిఘాను పర్యవేక్షించారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. 


వికారాబాద్‌ / తాండూరు / షాద్‌నగర్‌ / శంకర్‌పల్లి / శంషాబాద్‌ /మేడ్చల్‌/ ఘట్‌కేసర్‌రూరల్‌, జూన్‌ 17 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లోనూ శుక్రవారం ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉమ్మడిజిల్లాలోని రైల్వే స్టేషన్ల వద్ద ముందస్తు భద్రతా చర్యలు తీసుకు న్నారు. వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వేస్టేషన్‌కు వెళ్లే అన్నిమార్గాలను కట్టుదిట్టం చేశారు. 50 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించగా.. జిల్లా ఎస్పీ రషీద్‌, డీఎస్పీ సత్యనారాయణ, వికారాబాద్‌ సీఐ రాజశేఖర్‌ పర్యవేక్షించారు. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రద్దు కావడంతో ప్రయాణికులు వెనక్కి వెళ్లారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ వైపు వెళ్లే రైళ్లను కూడా అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.


తాండూరు రైల్వేస్టేషన్‌లో..

‘అగ్నిపథ్‌’పై నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భంగా తాండూరు రైల్వేస్టేషన్‌లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా నిఘా ఏర్పాటు చేసి రైల్వేస్టేషన్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఈసందర్భంగా సీఐ రాజేందర్‌రెడ్డి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు.


షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అల్లర్లను దృష్టిలో పెట్టుకుని షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. షాద్‌నగర్‌ సివిల్‌ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దేవకీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌కు వచ్చిపోయే వారిని తనిఖీ చేశారు. స్టేషన్‌ చుట్టుపక్కల జనాలు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకున్నారు. 


శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌లో...

‘అగ్నిపథ్‌’ నిరసనల నేపథ్యంలో శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రైళ్ల రాకపోకలు నిల్చిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 


శంషాబాద్‌ (ఉందానగర్‌) రైల్వేస్టేషన్‌లో...

దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్‌’పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ఉందానగర్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రైల్వేస్టేషన్‌ నుంచి నడవాల్సిన పలు రైళ్లు రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. 


ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్లకు భారీ భద్రత పెంచారు. స్టేషన్‌లో రైళ్లను ఆపేసి ప్రయాణికులను వెనక్కు పంపించారు. శాతవాహన, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను ఘట్‌కేసర్‌లోనే నిలిపివేశారు. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుతోపాటు ఇతర రైళ్ళను సికింద్రాబాద్‌కు వెళ్ళకుండా చర్లపల్లి నుంచి రూట్‌ మళ్ళించి వయా లింగంపల్లి ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ వారి గమ్యస్థానాలకు చేరుతున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు ఉప్పల్‌, చెంగిచెర్ల బస్‌డిపోల అధికారులతో మాట్లాడి అదనపు బస్సులను ఏర్పాటు చేయించారు. 



Updated Date - 2022-06-18T04:39:56+05:30 IST