సరిహద్దుల్లో అప్రమత్తం

ABN , First Publish Date - 2021-02-26T05:17:27+05:30 IST

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మళ్లీ విభృంభిస్తున్న కారణంగా జిల్లా యంత్రాంగం అ ప్రమత్తమవుతోంది.

సరిహద్దుల్లో అప్రమత్తం
నిర్మల్‌ జిల్లాకు మహారాష్ట్రతో సరిహద్దు రోడ్డు మార్గం

మహారాష్ట్ర బార్డర్‌పై గట్టి నిఘా 

కరోనా విస్తరణ కట్టడికి పక్కా ప్రణాళిక 

ఇరువైపుల రాకపోకల విషయంలో  జాగ్రత్తలు 

కోవిడ్‌ విస్తరించకుండా పకడ్భందీ యాక్షన్‌ప్లాన్‌ 

జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో స్వీయ  పర్యవేక్షణ 

నిర్మల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మళ్లీ విభృంభిస్తున్న కారణంగా జిల్లా యంత్రాంగం అ ప్రమత్తమవుతోంది. ఇటీవల సరిహద్దులో ఉన్న నాందేడ్‌ వరకు కరోనావ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో సరిహద్దులను మరింత అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ వైద్యారోగ్యశాఖ అధికారులతో మహారాష్ట్ర సరిహద్దుల నుంచి కరోనావైరస్‌ విస్తరించకుండా తీసుకోవాల్సిన పకడ్బందీ జాగ్రత్త చర్యలపై సమీక్షించారు. ఇటు భైంసా వైపు అటు సారంగాపూర్‌ మండలం స్వర్ణ వైపు మహారాష్ట్ర సరిహద్దులు అతిదగ్గరగా ఉండడం అలాగే అక్కడి ప్రజలు అన్ని రకాల పనులకోసం మనజిల్లా సరిహద్దుల్లోకి వస్తుండడం సహజమే. ముఖ్యంగా భైంసా, ముథోల్‌వైపు నాందేడ్‌, ధర్మాబాద్‌, ఔరంగాబాద్‌ తదితర ప్రాంతా ల నుంచి పెద్దసంఖ్యలో వ్యాపారులే కాకుండా సాధారణ ప్రజానీకం కూడా వస్తుంటారు. ఇలా ప్రతిరోజూ వందలాది మంది ఇరువైపుల రాకపోకలు సాగిస్తారు. జిల్లావాసులు సైతం వ్యాపారపని నిమిత్తమే గాకుండా బంధువుల వద్దకు కూడా మహారాష్ట్రలోని సరిహద్దులు దాటుతుంటారు. ఇలా సరిహద్దులతో గట్టి సంబంధాలున్న జిల్లాలోకి కరోనావైరస్‌ వ్యాపిం చే అవకాశాలున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో కూడా ఇదే రకంగా మహారాష్ట్ర వైపు నుంచి కరోనావైరస్‌ జిల్లాలోకి వేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. మరోసారి అలాంటి పరిణామాలు చోటు చేసుకోవద్దన్న భావనతో కలెక్టర్‌ ఈ దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీని కోసం గాను సరిహద్దుల రాకపోకలపై తాత్కాలిక నియంత్రణ చేస్తు న్నారు. అలాగే మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వారి వివరాలను సైతం సేకరిస్తున్నారు. దీంతో పాటు వైద్య,ఆరోగ్యశాఖ సైతం సరిహద్దుల వద్ద నిఘాసారించి అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఉమ్మ డి వ్యూహంతో కొవిడ్‌ వైరస్‌ మహారాష్ట్ర సరిహద్దుల నుంచి జిల్లాలోకి చొరబడకుండా చేసేందుకు పక్కాయాక్షన్‌ప్లాన్‌ అమలు చేస్తున్నారు. జిల్లాలో గతం కన్నా తక్కువగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం లేదు. 

ముందస్తు అప్రమత్త చర్యలు చేపట్టి స్థానికంగా కరోనాను కట్టడి చేస్తూనే మహారాష్ట్ర వైపు నుంచి ఆ వైరస్‌ ఇటు వైపు విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. 

సరిహద్దులపై ఉమ్మడి నిఘా

జిల్లాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో అధికారులు ఉమ్మ డి వ్యూహాన్ని అమలు చేపట్టారు. ఇటు కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ, అటు వైద్య,ఆరోగ్యశాఖలు మహారాష్ట్ర సరిహద్దులపై పకడ్భందీ అప్రమత్తత చర్యలు చేపట్టాయి. ముథోల్‌, భైంసా, సారంగాపూర్‌ ప్రాం తాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా సరిహద్దుల్లో వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజూ అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కొవిడ్‌ పరీక్షలతో పాటు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే మహారాష్ట్రలో కొవిడ్‌ వైరస్‌ విషరూపం దాల్చుతున్నట్లు వెలువడుతున్న కథనాలను యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే పక్కా యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించుకొని దీనిని పకడ్భందీగా అమలు చేస్తూ వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణ ప్రజల రాకపోకలతో పాటు, వాహనాల రాకపోకలపై కూడా దృష్టి పెడుతున్నారు. కొవిడ్‌ లక్షణాలున్న వారిని సరిహద్దులు దాటకుండా వారిని వెనక్కి పంపిస్తున్నారు. ప్రధానమార్గాలపైనే కాకుండా అంతర్గత దారులపై కూడా నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే పోలీసు, ఎక్సైజ్‌శాఖ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. ఇలా ఉమ్మడివ్యూహంతో కరోనావైరస్‌ను సరిహద్దులు దాటకుండా కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అడుగడుగునా నిర్లక్ష్యమే

లాక్‌డౌన్‌ సమయంలో కరోనా వైరస్‌వ్యాప్తి, దాని తీవ్రత దుష్ప్రరిణామాలపై అవగాహన పెంచుకున్న సాధారణ జనం అప్పట్లో పెద్ద ఎత్తున మాస్క్‌లు ధరించడం, సామాజికదూరం పాటించడం, సానిటైజర్‌లను ఉపయోగించడం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం తగ్గించారు. అలాగే రద్దీ ప్రాంతాల్లో తిరగకుండా, విందులకు హాజరుకాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కారణంగా కరోనావైరస్‌ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. దీంతో జనం తమ జాగ్రత్తలన్నింటినీ విస్మరిస్తూ వస్తున్నారు. మొన్నటివరకు మాస్క్‌లు ధరించిన వారంతా ప్రస్తుతం అవి లేకుండానే విచ్చలవిడిగా తిరుగుతున్నారు. విందులు, వినోదాలు పోటాపోటీగా జరుగుతుండడంతో వీరు కూడా అదే స్థాయిలో వాటికి హాజరవుతున్నారు. సానిటైజర్‌లను కూడా మరిచిపోయారు. మాస్క్‌లు ధరించడంసిగ్గుగా భావిస్తున్నారు. సామాజిక దూరం విషయాన్నయితే అందరూ విస్మరిస్తున్నారు. ఎక్కడ చూసినా మాస్క్‌లు లేకుండానే జనం తిరుగుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో మళ్లీ కరోనా విస్తరిస్తున్నట్లు వెలువడుతున్న కథనాలు జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మళ్లీ వీరంతామాస్క్‌లు ధరించడం, సానిటైజర్‌లను వినియోగించడం మొదలుపెడుతున్నారు. 

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా  కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. వైద్యారోగ్య శాఖ సిబ్బందికి అలాగే పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు కరోనా వ్యాక్సినేషన్‌ చేశారు. దీంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులకు, సిబ్బంది కూడా స్వచ్చందంగా వ్యాక్సినేషన్‌ చేసుకున్నారు. రెండు మూడు రోజుల్లో 50 సంవత్సరాలు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్‌ చేసుకోవడం తప్పనిసరి చేయబోతున్నారు. అయితే ఈ వ్యాక్సినేషన్‌ కారణంగా 108లో పని చేసే ఓ ఉద్యోగి మృతి చెందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు ప్రాథమిక దర్యాప్తు జరిపి మరణానికి వ్యాక్సినేషన్‌ కారణం కాదని, మృతునికి ముందుగానే గుండె వ్యాధులున్నాయని వైద్య,ఆరోగ్యశాఖ ప్రత్యేక మెడికల్‌ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది. ఈ దశలోనే వ్యాక్సినేషన్‌ విజయవంతం కావడంతో ఇక సాధారణ జనానికి టీకాలు ఇచ్చేందుకోసం సంబంధిత యంత్రాంగం సమాయత్తమవుతోంది. దీనికి అనుగుణంగానే సిబ్బందికి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పరిధిలోని సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేయగా ఇప్పుడు అన్ని రకాల ప్రజలకు వ్యాక్సిన్‌ చేయబోతున్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు దొర్లితే దాని పరిణామం ఎటువైపు దారి తీస్తుందోనన్నది ఎవరికి తెలియదు. మొత్తానికి జిల్లా యంత్రాంగం ఓ అడుగు ముందుకేసీ కరోనా సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకుంటూనే ప్రజలకు మరోసారి అవగాహన పెంపొందించేందు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.  

Updated Date - 2021-02-26T05:17:27+05:30 IST