దొంగచాటుగా మద్యం విక్రయాలు

ABN , First Publish Date - 2020-04-03T07:39:11+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ను అవకాశంగా మలచుకుంటూ మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. దొంగ చాటుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఎమ్మార్పీకి రెట్టింపు రేట్లకు విక్రయాలు జరుపుతున్నారు.

దొంగచాటుగా మద్యం విక్రయాలు

ఎమ్మార్పీ కంటే రెట్టింపు ధరలకు అమ్మకం... 

వైన్‌షాపులు, బార్ల వద్ద రూ.2000 కోట్ల మద్యం స్టాక్‌

పాత తేదీల్లో విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ను అవకాశంగా మలచుకుంటూ మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. దొంగ చాటుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఎమ్మార్పీకి రెట్టింపు రేట్లకు విక్రయాలు జరుపుతున్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లవారు నిబంధనలు ఉల్లంఘించి బయటి వ్యక్తులకు మద్యాన్ని అమ్ముతున్నారు. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22న జనతా కర్ఫ్యూను విధించాయి. ఆ రోజు మద్యం విక్రయాలు సాగించవద్దంటూ ఎక్సైజ్‌ శాఖ కూడా ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 21న రాష్ట్రంలోని మద్యం వ్యాపారులు రూ.116 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి లిఫ్ట్‌ చేశారు. అంతకుముందే లిఫ్ట్‌ చేసిన స్టాక్‌ కూడా వైన్‌షాపులు, బార్లలో నిల్వ ఉంది. మార్చి 22కు ముందే దాదాపు రూ.2000 కోట్ల విలువైన మద్యం బార్లు, వైన్‌ షాపులు, క్లబ్బులు, టూరిస్టు హోటళ్లు, స్టార్‌ హోటళ్లలో నిల్వ ఉన్నట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనా వేసింది. అయితే.. మార్చి 23 నుంచి రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్లు, క్లబ్బులన్నింటినీ మూసి వేయాలంటూ ఎక్సైజ్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.


లాక్‌డౌన్‌ సమయంలో నేరుగా మద్యం దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో మందుబాబులు మద్యం కోసం వైన్‌ షాపులు, బార్లు, బెల్టు షాపుల్లో ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు దొంగచాటు విక్రయాలకు తెరలేపారు. మద్యాన్ని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. టీచర్స్‌ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.1840  కాగా.. దాన్ని రూ.3000కు విక్రయిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే బ్లెండర్స్‌ ప్రైడ్‌ ఫుల్‌బాటిల్‌ ఎమ్మార్పీ రూ.1080కాగా.. రూ.3000కు, సిగ్నేచర్‌ ఎమ్మార్పీ రూ.1060కుగాను రూ.2800కు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లో ఈ దొంగచాటు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బ్లాక్‌ లేబుల్‌, రెడ్‌ లేబుల్‌, బ్లూ లేబుల్‌, జానీ వాకర్‌ వంటి ఫారెన్‌ లిక్కర్‌ను మూడు రెట్లు పెంచి అమ్ముతున్నారు. వారు ఇప్పటికే సగం స్టాకును అమ్మేశారని, మిగతా రూ. 1,000 కోట్ల విలువైన మద్యాన్ని రెండుమూడు రోజుల్లో అమ్మేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  


పాత తేదీలతో..

వ్యాపారులు తెలివిగా మద్యం విక్రయాలను పాత తేదీల్లో రికార్డు చేస్తున్నారు. మార్చి 21, అంతకుముందు లిఫ్ట్‌ చేసిన మద్యం పాత తేదీల్లోనే విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఏ షాపునకు ఎంత మద్యం వెళ్లింది, ఏ తేదీన వెళ్లింది అన్నది రికార్డ్‌ అవుతుంది. అందుకే లాక్‌డౌన్‌ తేదీల్లో విక్రయించినట్లు కాకుండా.. ముందే సరుకు మొత్తం అమ్ముడుపోయినట్లుగా రికార్డులు సృష్టిస్తున్నారు.


కొండపోచమ్మ వద్ద ఏరులై పారుతున్న మద్యం

జగదేవ్‌పూర్‌: ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉన్నా సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని కొండపోచమ్మ ఆలయం వద్ద మద్యం వ్యాపారం మాత్రం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇక్కడ మద్యం అమ్మడానికి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ 50కి పైగా బెల్టుషాపులు దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం రాష్ట్రమంతటా వైన్‌ షాపులు మూసి ఉండగా ఇక్కడ మాత్రం విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి మెదక్‌, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి ఇక్కడికి మద్యం కొనుగోలు చేయడానికి వస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలను నాలుగురెట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొముర వెల్లి, చేర్యాల, గజ్వేల్‌లోని వైన్స్‌ దుకాణాల నుంచి ఇక్కడికి మద్యం సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా గజ్వేల్‌ ఎక్సైజ్‌ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 50లక్షలు విలువ చేసే మద్యంను కొండపోచమ్మ వద్దకు తీసుకువచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం ఉదయం జగదేవ్‌పూర్‌ ఎస్సై తన సిబ్బందితో కలిసి ఆలయం వద్ద గల దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఒక దుకాణంలో నాలుగు మద్యం బాటిళ్లను పట్టుకున్నారు.

Updated Date - 2020-04-03T07:39:11+05:30 IST