చెక్కులిచ్చినా మద్యం సరఫరా

ABN , First Publish Date - 2020-11-29T06:14:22+05:30 IST

రాష్ట్ర బేవరేజెస్‌ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా.. చెక్కులిస్తే మద్యాన్ని సరఫరా చేసేలా అధికారులు ఉత్తర్వులిచ్చారు. మద్యం స్టాక్‌ సరఫరాకు బ్యాంకు చలానాల రూపంలో డబ్బు చెల్లించాల్సి ఉండగా.. వరుసగా బ్యాంకు సెలవులు రావడం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు

చెక్కులిచ్చినా మద్యం సరఫరా

వైన్‌ షాపులకు బేవరేజెస్‌ వెసులుబాటు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అక్రమ విక్రయాలకు చాన్స్‌?


హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బేవరేజెస్‌ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా.. చెక్కులిస్తే మద్యాన్ని సరఫరా చేసేలా అధికారులు ఉత్తర్వులిచ్చారు. మద్యం స్టాక్‌ సరఫరాకు బ్యాంకు చలానాల రూపంలో డబ్బు చెల్లించాల్సి ఉండగా.. వరుసగా బ్యాంకు సెలవులు రావడం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సెలవు రోజైనా మద్యం డిపోలను తెరిచే ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. సంస్థ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. సాధారణంగా మద్యం షాపుల యజమానులు తమకు కావాల్సిన స్టాకుకు సంబంధించి.. బ్యాంకుల్లో చలాన్లు తీసి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మద్యం డిపోలకు ఇస్తారు. ఇలా ముందస్తుగా ఎక్సైజ్‌ ఖజానాలో డబ్బు జమచేస్తేనే కార్పొరేషన్‌ అధికారులు మద్యాన్ని సరఫరా చేస్తారు. కానీ, ఈ నెల 29న ఆదివారం, 30న గురునానక్‌ జయంతి/కార్తిక పౌర్ణమి, 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉండడంతో కొన్ని బ్యాంకులు సెలవులు ప్రకటించాయి.


అందుకే చెక్కులిస్తే మద్యాన్ని సరఫరా చేస్తామంటూ కార్పొరేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చెక్కులు బౌన్స్‌ అయితే 20ు పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. ఆదివారం మద్యం డిపోలను తెరిచి ఉంచాలని, మధ్యాహ్నం 3 గంటల వరకూ సరుకును సరఫరా చేయాలని తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం నుంచి మద్యం విక్రయాలపై నిషేధం ఉంటే మధ్యాహ్నం వరకు డిపోలు మద్యాన్ని విక్రయించేది అక్రమాలకు గేట్లు ఎత్తేందుకేననే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-11-29T06:14:22+05:30 IST