హద్దు..అదుపు లేదు..!

ABN , First Publish Date - 2020-07-10T11:15:46+05:30 IST

మద్యం పొరుగు రాష్ట్రంలో చౌక, మన రాష్ట్రంలో ఊహించనంత ధర. కాస్త రిస్క్‌ తీసుకుని పోలీసుల..

హద్దు..అదుపు  లేదు..!

సరిహద్దులు దాటి వస్తోన్న మద్యం

తెలంగాణ నుంచి తరలింపు

అక్రమార్కులకు భారీ ఆదాయం


జంగారెడ్డిగూడెం, జూలై 9 : మద్యం పొరుగు రాష్ట్రంలో చౌక, మన రాష్ట్రంలో ఊహించనంత ధర. కాస్త రిస్క్‌ తీసుకుని పోలీసుల కళ్లు కప్పి తెలంగాణ మద్యం ఇక్కడ విక్రయిస్తే లక్షల్లో లాభాలు.దీంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. కొంతమంది అధికారులు మద్యం అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా బుధవారం రాత్రి ఎక్సైజ్‌ సీఐ, వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ తెలంగాణ నుంచి మద్యం తరలిస్తూ పట్టుబడడం అధికార వర్గాల్లో సైతం కలకలం రేపింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు ఆంధ్ర సరిహద్దు ఏజెన్సీ ప్రాంతం కావడంతో మారుమూల ప్రాంతాల గుండా మద్యం అక్రమ రవాణా జరుగుతుంది.ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మందుబాబులకు కావలసిన బ్రాండ్‌లు, సరిపడా స్టాక్‌ ఉండడం లేదు. స్టాక్‌ ఉన్నా విపరీతమైన ధర ఉంది. క్వార్టర్‌ రూ.170 పైనే ఉంటుంది. అది కూడా కొద్ది స్టాక్‌ మాత్రమే కావడంతో మందుబాబుల గగ్గోలు పెడుతున్నారు.


ఇదే రకం మద్యం సమీప తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట వెళితే సగం ధరకే లభిస్తుంది. దీంతో పశ్చిమ ఏజెన్సీకి పక్కనే ఉన్న తెలంగాణ ప్రాంతం నుంచి పలురకాల మద్యం సీసా లను కొంతమంది ఇక్కడికి తీసుకువచ్చి విక్రయిస్తు న్నారు.సమీప తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం అక్రమ రవాణా అరిక ట్టేందుకు ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు నిత్యం దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో వారికి రిమాండ్‌ విధించ కుండా స్టేషన్‌ బెయిల్‌ ఇస్తున్నారు. పట్టుబడిన వారు మళ్లీ ఇదే వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి ఒక మద్యం సీసా తరలించినా అరెస్టు చేసి ఎనిమిదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమాన విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.


రెండు నెలల్లో 162 కేసులు

తెలంగాణ నుంచి మద్యం రవాణా అరికట్టడానికి సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. గడిచిన మే, జూన్‌ లో అధికా రులు దాడుల్లో పట్టుబడిన మద్యం, నమోదు చేసిన కేసులు అక్రమ రవాణా స్థాయి అద్దం పడతాయి. రెండు నెలల్లో 176 మందిపై 162 కేసులు నమోదు చేశారు. వారి నుంచి 1787 మద్యం సీసాలు, 85 ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.  


మద్యం అక్రమ రవాణా ఉపేక్షించం : ఎస్పీ నాయక్‌

మద్యం అక్రమ రవాణా చేసేవారిని ఉపేక్షించం. యూనిఫారంలో ఉండి కూడా  కొందరు అక్రమ రవాణాకు పాల్పడటం బాధాకరం. మద్యం నిలుపు దల చేయంలో సరిహద్దు చెక్‌పోస్టు సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. అక్ర మార్కులు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-07-10T11:15:46+05:30 IST